Sunday, August 3, 2025
E-PAPER
Homeకథఘట శ్రీ గారికి ఘన సన్మానం

ఘట శ్రీ గారికి ఘన సన్మానం

- Advertisement -

ఉగాది రానూ వచ్చింది పోనూ పోయింది, పాపం వెంకటేశ్వర్లుకు మాత్రం తనని ఎవరన్నా కవి సమ్మేళనానికి పిలవకపోరా? ఓ చిన్న సత్కారం అన్నా చేయక పోరా? అని ఎదురు చూసి చూసి కళ్ళు రెండూ కాయలు కాచిపోయాయి కాని ఒక్కడంటే ఒక్కడు కూడా పిలిచిన పాపాన పోలేదు.
చివరికి తన ఇంటి పక్క గుళ్లో ఉగాదికి పంచాంగ శ్రవణం తర్వాత కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ, తన కవితలను ఉచితంగా వినిపిస్తానంటే, రోజూ తాను పళ్లెంలో వేసే దక్షిణ కోసం చాటంత మొఖం చేసుకుని ఎదురుచూసే పూజారి కూడా వద్దు పొమ్మనటంతో మరింత కుంగిపోయాడు వెంకటేశ్వర్లు.
వెంకటేశ్వర్లు వత్తిరీత్యా ఉపాధ్యాయుడు, బడికి వచ్చే పిల్లలు రానురాను తగ్గిపోవడంతో గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవటం అలవాటు చేసుకున్నాడు. ఏమీ తోచక ఒకరోజు తన స్నేహితుడి బలవంతం మీద ఒక పేరున్న కవి గారి సత్కార సభకు హాజరయ్యాడు వెంకటేశ్వర్లు.
అక్కడ కవి గారికి తొడిగిన బంగారపు గండపెండేరం, ఏనుగు మీద అంబారీ ఊరేగింపు, దారి పొడుగునా పూలవర్షంతో భారీ స్థాయిలో జరిగిన సత్కారం చూసి హా అప్పటికప్పుడే తాను కూడా ఒక గొప్ప కవిగా పేరు తెచ్చుకోవాలని నిర్ణయం తీసేసుకున్నాడు వెంకటేశ్వర్లు.
నిర్ణయం తీసుకోవడం అయితే తీసుకున్నాడు గాని కవిత్వం ఎలా రాయాలో వెంకటేశ్వర్లుకు అసలు అంతుపట్టలేదు. కవిత్వం రాయాలంటే ముందుగా పేరున్న రచయితల రచనలన్నీ ఒక పట్టుబట్టాలని ఎవరో చెబితే మార్కెట్లో ఉన్న పేరున్న రచయితల కవితా సంపుటాలు అన్నీ అప్పు చేసి మరీ కొనేశాడు. కొనటం అయితే కొన్నాడుగాని, చదువుదామని చూస్తే ఒక్క ముక్క కూడా కొరుకుడు పడలేదు.
ఇక లాభం లేదనుకుని, తను పనిచేసే స్కూల్లోనే తెలుగు మాస్టారి చేత వాటి అర్థం, ప్రతి పదార్థం చెప్పించుకోవడం మొదలుపెట్టాడు. క్రమేణా కొద్ది కొద్దిగా అవి అర్థం అవసాగాయి.
కవిత్వం అర్థం అయినంత మాత్రాన మెదడులో అక్షరాలు మొలకెత్తాలని ఎక్కడా రూల్‌ లేదు కదా? మన వాడి విషయంలోనూ అదే జరిగింది. ఎంత తల బాదుకున్నా ఒక్క అక్షరం కూడా బుర్రలో నుంచి బయటకు రాలేదు. కవిత్వం మాట దేవుడెరుగు, నాలుగు వాక్యాలు రాయడం కోసం నిద్రలేని రాత్రులు గడుపుతూ పెట్టెలకు పెట్టెలు సిగరెట్లు ఊది పారేయడంతో చిక్కి సగమై శవంలా మారాడు.
చివరికి 30 రోజుల్లో కవిత్వం రాయడం ఎలా? అనే పుస్తకాలు ఏమన్నా మార్కెట్‌లో దొరుకుతాయేమోనని కాళ్లరిగేలా తిరిగినా ఫలితం మాత్రం దక్కలేదు. బహుశా ఎవరూ కూడా 30 రోజుల్లో కవిత్వం రాసి ఉండకపోవచ్చు అని సరిపెట్టుకుని, ఇక కవిత్వం రాయటం అనే మహా యజ్ఞానికి మంగళం పాడుదాం అనుకున్న సమయంలో,
వెంకటేశ్వర్లు బాధ చూడలేక, అతని స్నేహితుడు గండపెండేరం తొడిగించుకున్న ఓ కవి గారి దగ్గరికి తీసుకెళ్లాడు, ఆయన ఏమన్నా కవిత్వం రాయడానికి సలహాలు ఇస్తారేమోనని.
ఆ గ.పె.కవి గారు మన వేంకటేశ్వరుడిని ఓ పది రోజులు తన చుట్టు తిప్పించుకున్నాడు కాని కవిత్వం ఎలా రాయాలో అని ఒక్క సలహా కూడా ఇచ్చిన పాపాన పోలేదు. వెంకటేశ్వర్లుకు మాత్రం ఆ పది రోజులు గపె.కవి గారికి ఇష్టమైన పళ్ళు ఫలహారాలు తీసుకువెళ్ళటానికే ఓ వెయ్యి రూపాయల పైనే అయివుంటుంది. అయినా కూడా మన వాడు ఏమాత్రం చలించకుండా, స్వాతిముత్యంలో కమలహాసన్‌లా పట్టు విడవకుండా, గ.పె.కవిగారు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళి విసిగించటంతో, చివరికి కవిగారు మనవాడి చెవిలో గాయత్రి మంత్రోపదేశం చేసినట్టు కవితలు ఎలా రాయాలో ఉపదేశం చేసాడు.
ఇంకేముంది మన వాడు ఎగిరి గంతేసి, కవిత్వం రాయటం ఇంత తేలికా అనుకుంటూ పుంఖాను పుంఖాలుగా కవితలు రాయటం మొదలు పెట్టాడు.
ఒక నెల రోజుల్లోనే ఓ వంద కవితలు రాసి పారేసాడు మన వాడు. ఏమిటి ఆశ్చర్య పోతున్నారా? నిజం సుమండీ.. అప్పుడెప్పుడో శ్రీ శ్రీ గారు ”కుక్క పిల్ల, అగ్గి పుల్ల, సబ్బు బిళ్ళ కాదేది కవితకు అనర్హం” అన్నట్టు, మనవాడు పిల్లి పిల్లలు, వేప పుల్లలు, మందు బిళ్ళలు ఇలా ఒకటేమిటి ఏది కనిపిస్తే దాని మీద కవిత్వం రాయటం మొదలుపెట్టాడు.
రాయటం అయితే రాసాడు కాని, ఆ కవితలు వినటానికి ఎవ్వరు ముందుకు రాలేదు. చివరికి తను పనిచేసే స్కూల్లో తోటి ఉపాధ్యాయులకు వినిపించపోతే మనవాడి ప్రతిభముందుగానే తెలిసిన వాళ్ళు కాబట్టి ముఖం చాటేశారు. చివరికి స్కూల్లో పిల్లలకు చాక్లెట్లు, ఐస్‌ క్రీంలు కొనిపెట్టి, వాళ్లను చుట్టూ కూర్చోబెట్టి వినిపించేవాడు. వాళ్ళు మాత్రం ఎన్నని వింటారు, మనవాడి కవితల దెబ్బకు వాంతులు, విరోచనాలు అవ్వటంతో బడికి రావటమే మానేశారు. విషయం తెలిసిన వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడబలుక్కుని మనవాడి మీద ఓ రోజు దండయాత్రకు రావటంతో ”పిల్లలతో కవితలు” అనే కార్యక్రమాన్ని నిరవధికంగా వాయిదా వేసాడు.
వాయిదా వెయ్యటం అయితే వేసాడు కాని, ఇంత కష్టపడ్డా తన కవితలు వెలుగులోకి రావటం లేదని, తనని ఎవ్వరు గుర్తించటం లేదని లోలోపల తెగ కుమిలి పోయే వాడు. మన వాడి బాధ చూడలేక, స్కూల్‌ హెడ్‌ మాస్టారు ఒక రోజు పిలిచి ”నీ కవితలన్నీ ఓ సంపుటిగా అచ్చు వేసి, ఎవరన్నా ఓ పేరు మోసిన కవి గార్ని పిలిచి పుస్తకావిష్కరణ చేయించి, నీ పుస్తకాన్ని ఓ ప్రముఖునికి అంకితం ఇస్తే అప్పుడు నీకు గుర్తింపు అదే వస్తుంది” అని అసలు విషయం చెప్పాడు.
మన పుస్తకాన్ని మనమే అచ్చు వేసుకుని, మనమే పుస్తకాన్ని ఆవిష్కరణ చేయిస్తే ఏమి బాగుంటుంది అని నసిగాడు.
దానికి ఆ పెద్దాయన నవ్వుతూ, ”నీ పుస్తకాన్ని నువ్వు కాకపోతే ఎవరు అచ్చు వేస్తారు? ఎవరు ఆవిష్కరిస్తారు చెప్పు.. పుస్తకం అంటే మన చేతుల్లో పుట్టిన ఆడపిల్ల లాంటిది, మనం మన ఆడపిల్లని ఎలా పెంచి పెద్ద చేసి, పెళ్లి చేసి ఓ అయ్యా చేతిలో పెడతామో? అలాగే పుస్తకాన్ని కూడా దగ్గరుండి ఓ అయ్య చేతిలో పెట్టాలి.
”అయితే నా పుస్తకాన్ని మీకే అంకితం ఇస్తాను” అన్నాడు వెంకటేశ్వర్లు.
దానికి ఆయన మరింత పెద్దగా నవ్వుతు ”పూర్వం కవులు తాము రాసిన పుస్తకాలను రాజులకు అంకితం ఇచ్చే వాళ్ళు. వాళ్ళు అందుకు ప్రతిఫలంగా కానుకలు ఇచ్చేవాళ్ళు. నువ్వు నాకు అంకితం ఇస్తే నేనేమి ఇస్తాను చెప్పు మహా అయితే ఓ మంచి పెన్ను కొనిపెడతాను. అందుకని ఎవరన్నా చదువురాని, చదువుకోని బాడా బాబులను చూడు.. వాళ్ళైతే కనీసం నీ పుస్తకం అచ్చు వెయ్యటానికి అయిన ఖర్చన్నా ఇస్తారు” అంటూ చెప్పు కొచ్చాడు.
ఆయన ఉపదేశంతో మనవాడు దేశం మీద పడ్డాడు వెతకటానికి, ఎవరన్నా డబ్బు ఉన్నవాళ్ళు తన పుస్తకాన్ని స్వీకరిస్తారేమోనని.
మన వాడికి తెలిసిన వాళ్ళందరూ నవ్వేసి ”పుస్తకమా? మాకు అంకితం ఇస్తారా? ఏమి చేసుకొనండి” అంటూ సున్నితంగా కాదనేసారు.
ఇంకా మనవాడికి ఏ దారి కనపడక పోవటంతో, మళ్లీ హెడ్‌ మాస్టారి దగ్గరకే వచ్చి, ”నా వల్ల కావటం లేదు, మీరే ఎదో ఒకటి చెయ్యాలి” అంటూ బతిమి లాడాడు.
”సరే నాకు తెలిసిన ఒక తెలుగు సాహితి సాంస్కతిక సమాఖ్య ఉంది, వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు, అడిగి చూద్దాం పదా” అంటూ వెంట బెట్టుకు వెళ్ళారు.
————
పరిచయాలు అయిన తరువాత, వచ్చిన విషయం చెప్పారు హెడ్‌ మాస్టారు.
”ఓస్‌ అదెంత పని సార్‌.. మేము రోజు చేసేది అదే కదా..” అన్నాడు సాహితి సాంస్కతిక సమాఖ్య అధ్యక్షుడు.
ఆ మాటలతో మనవాడికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది, తన పుస్తకానికి జ్ఞానపీట్‌ అవార్డు వచ్చినంత ఆనంద పడిపోయాడు.
”చెప్పండి మమ్మల్ని ఏమి చెయ్యమంటారు” అంటూ వినయంగా అడిగారు హెడ్‌ మాస్టారు.
”నాకు ఒక పుస్తక అవిష్కరణ సభకు వెళ్ళాల్సిన సమయం అయ్యింది, మీరు మా సేక్రటరిని కలవండి అన్నీ ఆమె చూసుకుంటుంది” అంటూ తను అక్కడ నుంచి నిష్క్రమించాడు.
పోతు పోతు, ఇద్దరిని అతని సెక్రటరి అనబడే ఓ పాతికేళ్ళ పడుచు ముందు దిగబెట్టి వెళ్ళాడు సా.సా.స. అధ్యక్షుడు.
”చెప్పండి సార్‌.. ఆర్డినరీ పాకేజినా? లేదా స్పెషల్‌ పాకజినా..” అని అడిగింది.
”పాకేజినా?” ఇద్దరూ ఆశ్చర్య పోయారు.
”అదేమిటి సార్‌, సార్‌ చెప్పలేదా? హడావిడిలో చెప్పటం మర్చిపోయి ఉంటారు. మా పాకేజీలో పుస్తకం ప్రింటు చెయ్యటం దగ్గరనుంచి, ఆవిష్కరించటం, అంకిత మివ్వటం, సన్మానం చెయ్యటం వరకు అన్నీ మేమే చూసుకుంటాము. దానికి యాభై వేలు అవుతుంది” అంటూ వివరించింది.
”యాభై వేలా..” అంటూ ఇద్దరు నోళ్ళు వెల్లబెట్టారు.
”యాభై వేలది ఏముందండి.. అదే స్పెషల్‌ పాకేజీ అయితే లక్ష నుండి.. ఐదు లక్షల దాక ఉంది”
”స్పెషల్‌ పాకేజీ అంటే ఇంకేమి చేస్తారు”
”సిల్వర్‌ పాకేజీ అయితే, మన ఉళ్ళో పేరున్న రచయతలను పిలిచి మీ పుస్తకం ఆవిష్కరిస్తారు. వాళ్లలోనే ఒకరికి అంకితం ఇస్తాం. సన్మానం కూడా, వాళ్ళతోనే.. మొత్తం ఒక లక్ష దాక అవుతుంది”
”మరి గోల్డు పాకేజీ..” అంటూ నసిగాడు వెంకటేశ్వర్లు.
”గోల్డు పాకేజీలో రాష్ట్ర స్థాయిలో పేరున్న ఓ కవిగారి చేత అవిష్కరణ జరుగుతుంది, ఓ ఎం.ఎల్‌.ఏ గారిని పిలిచి మీ పుస్తకం అంకితం ఇప్పిస్తాం, వాళ్ళ చేత మీకు సన్మానం ఉంటుంది.. సుమారు రెండు లక్షలు దాక అవుతుంది”
”అసలు ఇంత ఖర్చు ఎందుకవుతుంది తల్లి..” అని హెడ్‌ మాస్టారు సందేహం వెలి బుచ్చారు.
”ఎందుకేవిటి సార్‌, మీరు చాలా అమాయకుల్లా ఉన్నారు, మీరు పిలవంగానే వాళ్ళు వచ్చేస్తారా ఏమిటి, వాళ్లకు పని పాట లేదా ఏమిటి చెప్పండి. వాళ్లకు కూడా డబ్బు ఇస్తేనే వస్తారు సార్‌. మళ్ళి వాళ్ళకు హౌటళ్ళు, కార్లు ఇంకా బోలెడన్ని ఏర్పాట్లు ఉంటాయి. ఆ ఖర్చులు ఎవరు పెట్టుకుంటారు చెప్పండి” అంటూ విడమర్చి చెప్పింది.
”డైమెండు పాకేజీ కుడా ఉందా..” చిన్నగా గొణిగాడు మనవాడు.
”ఉంది సార్‌, ఐదు లక్షల దాక అవుతుంది..” అన్నది పొడి పొడిగా.
”అందులో ఏముంటుంది తల్లి..: హెడ్‌ మాస్టారు అడిగారు.
”సినిమాలకు కధలు రాసే ఓ పేరున్న కవిగారి చేత మీ పుస్తకం ఆవిష్కరింప బడుతుంది, ఓ మంత్రి గారికి మీ పుస్తకం అంకితం ఇప్పిస్తాము, మీకు గండ పెండేరం తోడుగుతాము, మీకు ఓ మంచి బిరుదు కుడా ఇచ్చి ఘన సన్మానం చేస్తాము, మీ పుస్తకం గురించి అన్నీ పత్రికల్లో సమీక్షలు వచ్చేటట్లు చూస్తాము” అంటూ ముగించింది.
”సరేనమ్మా. .అలోచించుకుని మళ్లీ వస్తాము” అంటూ లేవ బోయాడు హెడ్‌ మాస్టారు.
కాని మనవాడు మాత్రం కుర్చీలోనుంచి కదలలేదు. అప్పటికే గండపెండేరం, బిరుదులతో సన్మానం జరిగినట్లు ఉహించుకుంటూ ఉహా లోకాల్లోకి వెళ్ళిపోయాడు.
”వెంకటేశ్వర్లు వెళ్దామా” అంటూ భుజం పట్టుకుని గుంజారు మాస్టారు.
ఆ దెబ్బకి మనవాడు ఈ లోకంలోకి వచ్చి ”ఎక్కడికి మాస్టారు..” అన్నాడు అయోమయంగా.
”ఆలోచించుకుని మళ్లీ వద్దాం” అన్నారు అనునయంగా.
”ఇంకా ఆలోచించేది ఏమీ లేదు మాస్టారు.. డైమండు పాకేజీ ఖాయం చేసేద్దాం” అంటూ అప్పటి కప్పుడు తన జేబులో ఉన్న ఐదు వేలు తీసి అడ్వాన్సుగా ఉంచుకోమని చెప్పాడు.
”సరే సార్‌, మా సారూ రాగానే మాట్లాడి మిగిలిన విషయాలన్నీ మీకు ఫోన్‌ చేసి చెపుతాను” అంది ఇంక వెళ్ళ మన్నట్టు
తిరిగి వచ్చే దారిలో ”తొందర పడ్డావేమో వెంకటేశ్వర్లు, అంత డబ్బు ఎక్కడనుంచి తెస్తావు..” అన్నారు మాస్టారు.
”నా పి.ఎఫ్‌ డబ్బులు ఉన్నాయి కదా సార్‌.. వాటినుంచి తీసుకుంటా” అన్నాడు ఏమాత్రం భయపడకుండా.
ఇంక వెంకటేశ్వర్లుకు ఎవరు చెప్పినా వినడని అర్ధమయిన మాస్టారు మౌనంగా ఉండిపోయారు.
——–
వెంకటేశ్వర్లు పుస్తకావిష్కరణ సభ తేది, వేదిక ఖరారు చేసి తెలియ చేసారు సా.సా.స. వాళ్ళు. మిగిలిన డబ్బు అకౌంట్లో వేసి, ఓ వందమందినన్న తిసుకోచ్చుకునే ఏర్పాట్లు చేసుకోమని చెప్పారు.
మనవాడు వెంటనే ఆహ్వాన పత్రాలు అచ్చువేయించి తనకు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఆహ్వాన పత్రంతో పాటు తన కవితల పుస్తకాన్ని కూడా పంచి పెట్టాడు.
రేపు సభ జరగబోతోంది అనగా, సా.సా.స వాళ్ళు ఫోన్‌ చేసి, క్షమించాలి అనుకోకుండా మనం అనుకున్న సభా వేదికను ప్రభుత్వం వాళ్ళు తీసుకున్నారు, అందుకని మీ పుస్తకావిష్కరణ సభను అక్కడికి దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసాం” అని చెప్పారు.
దానితో కాస్త కంగారు పడిన మనవాడు అడ్రస్‌ మారితే పిలిచిన వాళ్ళు వస్తారో లేదో అనుకుని, అందరిని రాజకీయ సభలకు జనాన్ని బస్సులు పెట్టి తోలినట్లు, మనవాడు ఆటోలు, కార్లు పెట్టి మరి తోలాడు. కాని పట్టుమని పదిమంది కూడా రాలేదు, బహుసా ముందుగానే పుస్తకం చదివారో ఏమో మరి?
ముఖ్య అతిధిగా రావాల్సిన మంత్రిగారు తనకు అందాల్సిన పర్సు అందక పోవటంతో ముఖ్యమైన పని ఉందని డుమ్మా కొట్టేసారట. ఇక ఎప్పుడో బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రాలకు కథలు రాసిన ఒక అవుట్‌ డేటెడ్‌ కవిగారిని తీసుకొచ్చి పుస్తకావిష్కరణ చేయించారు సా.సా.స. అధ్యక్షుడే మనవాడి కవితల పుస్తకం మీద సమీక్ష రాసి చదివి వినిపించాడు. చివరగా ఓ ఇత్తడి కడియాన్ని గండపెండేరం అంటూ వెంకటేశ్వర్లు చేతికి తొడిగి, ”ఘట శ్రీ” అనే బిరుదుతో సత్కారం చేసి పంపారు సమాఖ్య వాళ్ళు.
వెధవది డబ్బులు పోతే పోయాయి, బిరుదు మాత్రం గట్టిదే ఇచ్చారని సంతోష పడుతూ మనవాడు తిరుగు ప్రయాణం కట్టాడు.
దారి మధ్యలో హెడ్‌ మాస్టారు ”వెంకటేశ్వర్లు ఇంతోద్తి దానికి అంత డబ్బు తగలేయ్యాలా, మన స్కూల్లోనే ఆ సభ ఎదో ఏర్పాటు చేసుకుని, మన డి.ఐ.ఓ గారిని ముఖ్య అతిధిగా పిలిస్తే నీకు పేరుకు పేరు వచ్చేది, డబ్బుకు డబ్బు మిగిలేదికదా” అన్నారు.
”కాని ఘట శ్రీ, అంత గొప్ప బిరుదు ఇవ్వరు కదా మాస్టారు” అన్నాడు.
”అసలు ఘట శ్రీ అంటే అర్ధం తెలుసా నీకు” అని అడిగారు.
”తెలియదు మాస్టారు..” అంటూ సిగ్గుపడ్డాడు.
”ఘటం అంటే కుండ, కుండ మట్టితో చేస్తారు, అంటే నీది మట్టి బుర్ర అని చెప్పకనే చెప్పారు” అని విడమర్చి చెప్పారు.
”ఘన సన్మానం అంటే ఎదో అనుకున్నా, ఇదా మాస్టారు, అందుకనేనా అందరు అంత గట్టిగా చప్పట్లు కొట్టారు” అంటూ వాపోయాడు.
”మరి ఘటశ్రీ గారికి ఘన సన్మానం అంటే ఆమాత్రం ఘనంగా చప్పట్లు కొట్టాలి కదా..” అంటూ వెక్కిరించారు మాస్టారు.
తను చేసిన తెలివితక్కువ పనికి సిగ్గుపడుతూ తల దించుకున్నాడు వెంకటేశ్వర్లు.

– ఈ శ్రీనివాస రెడ్డి, 7893111985

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -