Sunday, August 3, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుట్రంప్‌ అంటే మోడీకి భయమెందుకు?

ట్రంప్‌ అంటే మోడీకి భయమెందుకు?

- Advertisement -

– మారాల్సింది వ్యక్తులు కాదు…విధానాలు
– ధర్మస్థల దేవాలయాన్ని కర్నాటక ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
– కాళేశ్వరంపై కక్షసాధింపు చర్యలొద్దు : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అంటే భారత ప్రధాని మోడీకి భయమెందుకని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. పాకిస్తాన్‌-భారత్‌ యుద్ధాన్ని ఆపానంటూ ట్రంప్‌ ప్రకటించినా మోడీ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. పార్లమెంటులో విపక్షాలు ప్రశ్నించినా వాస్తవాలు ఎందుకు చెప్పడం లేదన్నారు. అబద్ధాలను అందంగా, అవలీలగా చెప్పే వ్యక్తులు ఈ దేశంలో ఇద్దరే ఉన్నారనీ, వారు ప్రధాని మోడీ, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అని అన్నారు. హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో శనివారం నారాయణ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ట్రంప్‌నకు మోడీ బానిసత్వం చేయడం భారత ప్రజలందరికీ అవమానకరమన్నారు. ట్రంప్‌ నిరాశానిస్పృహలతో ఇష్టాను సారంగా వ్యవరిస్తున్నారని విమర్శించారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన వారిలో పార్లమెంట్‌ సమావేశాలకు ఒక్కరోజు ముందు ముగ్గురిని హతమార్చారని చెప్పారు. వారిని ఎప్పుడో అరెస్టు చేసి పార్లమెంటులో సమాధానం చెప్పేందుకే ఇలా చేశారని అన్నారు. జమ్మూకాశ్మీర్‌లో 7.50 లక్షల మందిని భద్రతా సిబ్బందిని కేంద్రం మోహరించిందనీ, ఉగ్రవాదులను పట్టుకోకుండా ఇంత కాలం ఏమి చేసిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మోడీ గ్రాఫ్‌ పడిపోవడంతో ఆర్‌ఎస్‌ఎస్‌ 75 ఏండ్ల వరకే పదవీ కాలం అనే అంశాన్ని తెరపైకి తెచ్చిందన్నారు. అయితే మారాల్సింది వ్యక్తులు కాదనీ, విధానాలు అని చెప్పారు. కర్నాటకలోని ధర్మస్థల ఆలయాన్ని ట్రస్టీ అపవిత్రం చేసిందని విమర్శించారు. ఆ దేవాలయాన్ని తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆలయంలో జరిగిన అన్ని దారుణాలకూ ట్రస్ట్‌ బోర్డుదే బాధ్యతని వెంటనే బోర్డు సభ్యులను అరెస్టు చేయాలని కోరారు. అక్కడ దాదాపు 400 మంది మహిళలపై లైంగికదాడులకు పాల్పడి హత్య చేశారని వివరించారు. అది పవిత్ర ధర్మశాలా, శ్మశానమా అర్ధం కావడం లేదన్నారు. ధర్మస్థల ఘటనకు సంబంధించి వార్తల ప్రచురణలను నిలిపివేస్తూ స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. ధర్మశాలకు కేరళ ప్రభుత్వానికి సంబంధమేంటని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. ఫీజులు విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
స్మార్ట్‌ మీటర్ల పేరుతో ఏపీలో దోపిడీకి తెరలేపారని విమర్శించారు. వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక అందిందనీ, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే కక్షసాధింపు చర్యలు తీసుకోవద్దని సూచించారు. ప్రజలకు వివరించి పారదర్శకమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలని చెప్పారు. మాయల ఫకీర్‌ ప్రాణాలు చిలుకలో ఉన్నట్టు కమిషన్‌ నివేదికలో కేసీఆర్‌ బాగోతం దాగి ఉందన్నారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్‌కు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినంత మాత్రాన జరిగేది ఏమి లేదని అన్నారు. ఎమ్మెల్యే, ఎంపీలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే ఎన్నికల కమిషన్‌ (ఈసీ) ఏం చేస్తోందని నారాయణ ప్రశ్నించారు. ఫిరాయింపులకు పాల్పడిన వెంటనే సుమోటోగా స్వీకరించి అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పార్టీ ఫిరాయింపులు అనైతికమని చెప్పారు. సెప్టెంబర్‌ 22 నుంచి చండీఘర్‌లో సీపీఐ జాతీయ మహాసభలు జరగనున్నాయని అన్నారు. ఈ మహాసభల్లో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌ను బలోపేతం చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -