ఇతర దేశాల కంటే భారత్‌ది దారుణ పరిస్థితి : పరిశ్రమ వర్గాలు
న్యూఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోడీ తన జిగిరి దోస్త్ అని సంబోధించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అధిక టారిఫ్‌లు దేశ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. భారత్ నుంచు అమెరికాకు 86 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరుగుతున్నాయి. ఇందులో సగానికి పైగా.. 48 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.4 లక్షల కోట్ల పైగా) ఎగుమతులపై ట్రంప్ టారిఫ్‌లు ప్రభావం చూపనున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారత్‌పై విధించిన 25 శాతం సుంకాలు ఆగస్టు 7నుంచి అమల్లోకి రానున్నాయి. ఇది వస్త్రాలు (10.3 బిలియన్ డాలర్లు), రత్నాలు, ఆభరణాలు (12 బిలియన్ డాలర్లు), సముద్ర ఉత్పత్తులు (2.24 బిలియన్ డాలర్లు), తోలు, పాదరక్షలు (1.18 బిలియన్ డాలర్లు), రసాయనాలు (2.34 బిలియన్ డాలర్లు), ఎలక్ట్రికల్, మెకానికల్ మెషినరీ (9 బిలియన్ డాలర్లు) తదితర రంగాలను తీవ్రంగా ప్రభావితం చేయనుందని పరిశ్రమ, ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తోన్నాయి.
ప్రభావితమయ్యే రంగాలు వస్త్రాలు రత్నాలు, ఆభరణాలు సముద్ర ఉత్పత్తులు తోలు, పాదరక్షలు రసాయనాలు ఎలక్ట్రికల్, మెకానికల్ మెషినరీ.
కొన్నిటికీ మినహాయింపు
ఔషధాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, క్రూడ్ ఆయిల్, ఇంధనాలు, సహజ వాయువు, బొగ్గు, కీలక ఖనిజాలు, సెమీకండక్టర్లు, కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌లు వంటి ఉత్పత్తులపై సెక్షన్ 232 కింద యుఎస్ సుంకాలను మినహాయించింది. వీటి విలువ 38 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. 2024-25లో భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం 131.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో ఎగుమతులు 86.5 బిలియన్ డాలర్లు, దిగుమతులు 45.3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
ఉద్యోగ కోతలు తప్పవు.. : పరిశ్రమ వర్గాలు
వస్త్ర ఎగుమతులపై అధిక సుంకాల వల్ల ఈ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతిననుందని అని అపెరల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఎఇపిసి) చైర్మన్ సుధీర్ సేఖ్రీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘అధిక టారిఫ్‌లతో మా పరిశ్రమకు భారీ ఎదురుదెబ్బ. ఎగుమతిదారులు ఖర్చు తగ్గించి ఫ్యాక్టరీలను నడపాల్సి ఉంటుంది. లేకపోతే ఉద్యోగ కోతలు తప్పవు” అని అన్నారు. అమెరికా చర్యలతో ఎగుమతిదారులు కొత్త మార్కెట్లను అన్వేషించాల్సి వస్తుందని కాన్పూర్‌కు చెందిన గ్రోమోర్ ఇంటర్నేషనల్ ఎండి యద్వేంద్ర సింగ్ సచాన్ పేర్కొన్నారు. అధిక సుంకాల వల్ల తమ రెండు ప్రధాన అమెరికా కస్టమర్లు ధర తగ్గింపును డిమాండ్ చేస్తున్నాయని, రాబోయే ఆరు నెలలు కష్టంగా ఉండొచ్చని కనోడియా గ్లోబల్ డైరెక్టర్ అశిష్ కనోడియా అన్నారు. ‘మనకు ఇతర దేశాల కంటే దారుణమైన ఒప్పందం లభించింది.” అని జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సబ్యసాచి రే ఆందోళన వ్యక్తం చేశారు.
రూ.4 లక్షల కోట్ల ఎగుమతులకు ‘ట్రంప్’ దెబ్బ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES