– నకిలీ ఓటర్ల ప్రక్షాళన పేరుతో మైనార్టీలను తగ్గించే కుట్ర
– హిందూత్వ రాజ్య స్థాపన కోసమే ఆ ప్రక్రియ
– ఈసీఐ స్వతంత్రతను కోల్పోతే..ప్రజాస్వామ్య మనుగడ కష్టమే
– సుప్రీం కోర్టు చెప్పినా పట్టించుకోని వైనం : ఎస్వీకే వెబినార్‌లో తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మతాల మధ్య వైషమ్యాలు పెంచి, తద్వారా హిందూత్వ రాజ్య స్థాపన లక్ష్యాన్ని సాధించే ప్రక్రియలో భాగమే నకిలీ ఓటర్ల ప్రక్షాళన పేరుతో సాగుతున్న తంతు అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ‘ఓటర్ల జాబితా సవరణలో ఈసీ అనుసరిస్తు పద్ధతి-దాని పర్యవసానాలు’ అనే అంశంపై ట్రస్ట్ కార్యదర్శి ఎస్ వినయ కుమార్ అధ్యక్షతన వెబినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్ ఆదేశాల మేరకు బీజేపీ దేశంలో మైనార్టీల జనాభాను తగ్గించే ప్రక్రియను సాగిస్తున్నదని చెప్పారు. ఇప్పటికే బీహార్‌లో నకిలీ ఒటర్ల ప్రక్షాళన పేరుతో సుమారు 65లక్షల ఓట్లను తొలిగించారని చెప్పారు. దీనికి ఈసీ చెప్పే సమాధానం హేతు బద్దంగా లేదన్నారు. ఈ విషయంపై సుప్రీం కోర్టు అడిగిన ప్రశ్నలకు ఎన్నికల సంఘం దగ్గర తగిన సమాధానం లేదని చెప్పారు. ఆధార్ కార్డు అన్నింటికీ పనికొచ్చినప్పుడు ఓటరు గుర్తింపునకు ఎందుకు పనికి రాదో చెప్పాలని కోర్టు అడిగిన ప్రశ్నకు జవాబు లేదన్నారు. నకిలీ కార్డులు సృష్టించే ప్రమాదం ఉందనే సమాధానాన్ని కోర్టు సహేతుకం కాదని చెప్పిందని గుర్తు చేశారు. పైగా ఈ భూమ్మీద ఏ డాక్యుమెంట్ పోర్జరీ చేయలేరో చెప్పాలంటూ ఈసీని ప్రశ్నించిందని తెలిపారు. నకిలీ ఒటర్లు తగ్గించేదే నిజమైతే..65లక్షల ఓటర్లు ఎలా తగ్గుతారని కూడా న్యాయస్థానం ప్రశ్నించిందన్నారు. ఓటర్ల ప్రక్షాళన పారదర్శకంగా ఉండాలని సూచించిందని గుర్తు చేశారు. వాస్తవంగా ఒక ఓటును తొలగించాలంటే..న్యాయపరమైన ప్రక్రియ కొనసాగాలన్నారు. సంబంధిత ఓటరుకు నోటీసు పంపిచే దగ్గరనుంచి పలు రకాల ప్రక్రియలున్నాయని గుర్తు చేశారు. ఇదో బీహార్‌లోనే జరుగుతున్న విషయం కాదనీ, దేశం మొత్తం ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తుందని చెప్పారు.దీనికి ప్రధాన కారణం హిందూత్వ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవటమే లక్ష్యమని వివరించారు. ఈ కుట్రలో భాగమే రకరకాల ప్రక్రియలను సందర్భమొచ్చినప్పుడల్లా బీజేపీ వాడుకుంటుందని చెప్పారు. మతతత్వానికి, మతోన్మాదాన్ని వ్యతిరేకించే శక్తులను హిందూ మత వ్యతిరేకులుగా ప్రచారం చేస్తున్నదని చెప్పారు. తద్వారా హిందూవులను రెచ్చగొడుతున్నారన్నారు. వాస్తవంగా హిదూత్వానికి, హిందూమత ధర్మాలకు సంబంధం లేదని వివరించారు.ధర్మాల గురించి సాగుతున్న చర్చ కొత్తదేమి కాదని వివరించారు. సనాదన ధర్మం పేరుతో మనుధర్మాన్ని తీసుకొచ్చి భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర సాగుతున్నదని చెప్పారు. అందులో భాగంగానే సోషలిజం, సెక్యులరిజం అనే పదాలని తొలగించాలంటూ చర్చ చేస్తున్నారని గుర్తు చేశారు. కుల అసమానతలు, వివక్ష.. కొనసాగటమే ధర్మం తప్పితే..సమానత్వం అంటే ఎలా అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. అందుకే సనాతన సంప్రదాయాలు, దాని భావాజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. మైనార్టీలను శత్రువుగా చూపించి, మెజార్టీ హిందూవులను ఒకటి చేసుకుని రాజకీయ లబ్దిపొందాలనుకుంటున్నదని తెలిపారు. మోడీ, ట్రంప్ అదే ఎత్తుగడలను అనుసరిస్తున్నారన్నారు. నియంతృత్వ విధానాలను, నియోఫాసిస్టు లక్షణాలను అనుసరిస్తున్నదని విమర్శించారు. ఇందుకు కార్పొరేట్ శక్తులు మతోన్మాదులకు అండగా ఉంటున్నాయని వివరించారు. యుద్ధం పట్ల ప్రభుత్వం అనుసరించిన విధానంపై పార్లమెంట్‌లో ఎంపీలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మోడీ సర్కారు నీళ్లు నములుతున్నదని వివరించారు. ట్రంప్, మోడీ స్నేహం ఏ పాటిదో మన దేశంపై 25శాతం సుంకాలు విధించటంతో తేటతెల్లమైందని తెలిపారు.
మతాల మధ్య వైషమ్యాలే లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES