– 11కు చేరిన నిందితుల సంఖ్య
– అన్ని కోణాల్లో విచారిస్తున్న పోలీసులు
– మరిన్ని అరెస్టులకు అవకాశం
నవతెలంగాణ-సిటీబ్యూరో
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే 8 మందిని అరెస్టు చేసిన పోలీసులు శుక్రవారం ఒకరిని అరెస్టు చేయగా, శనివారం మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దాంతో అరెస్టయిన నిందితుల సంఖ్య 11కు చేరింది. ఏ3 విశాఖ సృష్టి కేంద్రం మేనేజర్ కల్యాణి, ఏ6 ధనశ్రీ సంతోషి(అస్సాం)ను కస్టడీలోకి తీసుకున్నారు. ఇద్దరినీ 5 రోజులపాటు కస్టడీకి సికింద్రాబాద్ సివిల్ కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. వీరిని సరోగసీ వ్యవహారంలో పోలీసులు మరింత లోతుగా విచారించనున్నారు. వారికి గాంధీ ఆస్పత్రి లో వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం నార్త్‌జోన్ డీసీపీ కార్యాలయానికి తరలించారు. పూర్తిస్థాయిలో విచారణ అనంతరం నిందితులు చెప్పిన విషయాలను బట్టి ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలున్నాయి.
అస్సాం నుంచి వ్యవహారం
సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. సృష్టి ఫెర్టిలీటీ సెంటర్‌లో సరోగసీ పేరుతో పలువురు దంపతులను మోసం చేసి పెద్దఎత్తున డబ్బులు దండుకున్నారు. అస్సాంకు చెందిన మహిళలు ధనశ్రీ, సంతోషి ద్వారా పేద దంపతుల వద్ద అప్పుడే పుట్టిన పిల్లలను కొనుగోలు చేసి.. కావాల్సిన దంపతులకు(ట్రీట్‌మెంట్ తీసుకుం టున్న) వారి బిడ్డగా అప్పగించేవారు. మరోవైపు నింబధనలకు విరుద్ధంగా వీర్యం, అండాలను సేకరించి ఇతర రాష్ట్రాల్లో విక్రయించారు. సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ కేసులో సంతోషి కీలకంగా వ్యవహరించినట్టు, ఆమె మాటలను నమ్మిన బాధితులు భారీగా మోసపోయినట్టు పోలీసులు గుర్తించారు. సంతోషి, నమ్రత చైల్డ్ ట్రాఫికింగ్‌కి పాల్పడ్డారన్న కోణంలోనూ విచారణ చేపట్టారు.
నోరు విప్పని నమ్రత
తెలుగు రాష్ట్రాలతోపాటు మరో నాలుగు రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రత భారీ నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా, సులువుగా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవాలన్న ఉద్దేశంతో పెద్దఎత్తున మహిళా ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నట్టు తెలిసింది. శిశవుల క్రయవిక్రయాల్లో ఏజెంట్లు సహకరించడంతో వారందరికీ భారీగా నజరానాలు ఇచ్చారని పోలీసులు గుర్తించారు. గ్రామీణ ప్రాంతాలే టార్గెట్‌గా మెడికల్ క్యాంపులు, ఉచితంగా ఫెర్టిలిటీ సేవలు చేస్తానని క్యాంపులు నిర్వహిం చినట్టు తెలిసింది. క్యాంపులకు వచ్చిన దంపతులకు పిల్లలు కలుగుతారంటూ డాక్టర్ నమ్రత నమ్మించేది. ఐవీఎఫ్ బదులు సరోగసీకి రెఫర్ చేసి.. దాని కోసం దంపతుల నుంచి రూ.30 నుంచి రూ.50 లక్షలు వసూలు చేశారని సమా చారం. దంపతులను నమ్మించేందుకు సంతోషి నితోపాటు ఇతర ఏజెంట్ల ద్వారా పిల్లలను కొను గోలు చేసి సరోగసీ ద్వారా పుట్టారంటూ బాధిత దంపతులకు డాక్టర్ నమ్రత అందించి అదనపు డబ్బులు లాగేదని విశ్వసనీయ సమాచారం. ఇదిలావుండగా పోలీసుల విచారణలో మాత్రం నమ్రత నోరువిప్పడం లేదని తెలిసింది. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా గుర్తులేవని చెపుతున్నట్టు సమాచారం.