Sunday, August 3, 2025
E-PAPER
Homeతాజా వార్తలు'కాళేశ్వరం'లో కేసీఆర్‌కు జైలు శిక్ష తప్పదు

‘కాళేశ్వరం’లో కేసీఆర్‌కు జైలు శిక్ష తప్పదు

- Advertisement -

– ఈ-ఫార్ములా రేసులో అడ్డంగా దొరికిన కేటీఆర్‌
– తేల్చిన పీసీ ఘోష్‌ కమిషన్‌
– ప్రభుత్వ సొమ్ము తిన్నోళ్లు కక్కాల్సిందే..
– ప్రభుత్వాన్ని పడగొడతామని అన్నప్పుడు పది మంది ఎమ్మెల్యేలు కలిశారని వ్యాఖ్య : పీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌గౌడ్‌
నవతెలంగాణ-జోగిపేట

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, కేసీఆర్‌ను దోషిగా జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ తేల్చి చెప్పిందని, ఇక ఆయనకు జైలు తప్పదని టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌గౌడ్‌ అన్నారు. సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండలం సంగుపేటలోని లక్ష్మిదేవి ఫంక్షన్‌హాల్‌లో శనివారం కాంగ్రెస్‌ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐసీసీ నేత, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్‌ కుమార్‌కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పేరుతో లక్షల కోట్ల రూపాయలు కొల్లగొటి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని కమిషన్‌ తేల్చి చెప్పిందన్నారు. ఇంజినీర్లు చెప్పినా కేసీఆర్‌ వినకుండా ప్రాజెక్టు విషయంలో తన సొంత లాభం కోసం.. ఇష్టం ఉన్న చోట ప్రాజెక్టును కట్టించారన్నారు. ప్రాజెక్టు నిర్మాణం రూ.40 వేల కోట్లు కాగా, కమీషన్‌ల కోసం రూ.లక్షన్నర కోట్లకు పెంచారని, రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రాజెక్టు ఫిల్లర్లు కుంగితే ఏమైతదని కేటీఆర్‌ ఎద్దేవా చేసి మాట్లాడారని, కూలుతున్న ఇంట్లో మీ కుటుంబాన్ని ఉంచుతారా? అని ప్రశ్నించారు. ఈ-ఫార్ములా కారు రేసు కేసులో కేటీఆర్‌ అడ్డంగా దొరికిపోయారని, ప్రభుత్వ సొమ్ము తిన్నది ఏవరైనా కక్కాల్సిందేనని మహేష్‌ కుమార్‌గౌడ్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రజలు 64 సీట్లు ఇచ్చినా ప్రభుత్వాన్ని పడగొడతాని, కూల్చేస్తామని బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు కుట్రలు చేశారని అన్నారు. ప్రభుత్వాన్ని రక్షించుకునేందుకు పది మంది ఎమ్మెల్యేలు మమ్మల్ని కలిశారని, వారి గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఆ నియోజకవర్గాల్లో కొంత మేరకు ఇబ్బందులున్నాయని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఇలాంటివి కొత్తేమీ కాదని, ఎన్ని గ్రూపులున్నా స్థానిక ఎన్నికల్లో సమిష్టిగా పార్టీ విజయం కోసం పాటుపడాలన్నారు. పార్టీలో పాత నీరుతో పాటు కొత్త నీరు ఉండాలనే పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కేసీఆర్‌, హరీశ్‌రావు సంతకాలతోనే బనకచర్ల ప్రాజెక్టు కడుతున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని, నెలకు రూ.18 వేల కోట్ల ఆదాయం వస్తే, ఇందులో రూ.6500 కోట్లు వడ్డీనే చెల్లిస్తున్నామని, ఆర్థికపరమైన ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను మాత్రం ఆపడం లేదన్నారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, ఎంపీ సురేష్‌ షేట్కార్‌, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్‌, రాజనర్సింహ పౌండేషన్‌ చైర్‌పర్సన్‌ త్రిష రాజనర్సింహ, సంగారెడ్డి, రాష్ట్ర ట్రైకార్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ బేల్లా నాయక్‌, మెదక్‌ గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌లు అంజయ్య, సువాసిని రెడ్డి, మహిళా నాయకులు గిరిజాషేట్కార్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -