Monday, August 4, 2025
E-PAPER
Homeజాతీయంమహిళలు, ముస్లింలే లక్ష్యంగా...

మహిళలు, ముస్లింలే లక్ష్యంగా…

- Advertisement -

బీహార్‌ ముసాయిదా ఓటర్ల జాబితాలో భారీగా తొలగింపులు
పాట్నా :
బీహార్‌లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. ఈ ముసాయిదా జాబితాను పరిశీలిస్తే కొన్ని దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు బయటపడ్డాయి. జాబితా నుంచి తొలగించిన ఓటర్లలో సగానికి పైగా…అంటే 55 శాతం మంది మహిళలే. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయమేమంటే…రాష్ట్రంలోని పది జిల్లాలలో ముస్లిం జనాభా అధికంగా ఉంది. వీటిలో ఐదింటిలో భారీగా ఓటర్లను తొలగించారు. పశ్చిమ బీహార్‌లోని గోపాల్‌గంజ్‌ జిల్లాలో అత్యధికంగా 15.1 శాతం మంది ఓటర్లను తొలగించారు. ఒక్క గోపాల్‌గంజ్‌ శాసనసభ స్థానంలోనే 18.25 శాతం మంది ఓటు హక్కును కోల్పోయారు. ఓటర్ల తొలగింపులో ప్రథమ స్థానం ఈ నియోజకవర్గానిదే.
ముసాయిదా ఓటర్ల జాబితాలో సుమారు 65.6 లక్షల మందిని తొలగించారు. వీరిలో 22.3 లక్షల మంది చనిపోగా 36.3 లక్షల మంది తమ నివాసాలను మార్చుకున్నారు. లేదా వారి ఆచూకీ తెలియడం లేదు. ఏడు లక్షల మంది ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటర్లుగా నమోదయ్యారు. బీహార్‌లో మొత్తం 243 శాసనసభ స్థానాలు ఉన్నాయి. వీటిలో 43 స్థానాలలో ముసాయిదా జాబితాల నుంచి తొలగించబడిన ఓటర్లలో 60 శాతానికి పైగా మహిళలే. ఈ ఏడాది జనవరిలో బీహార్‌ ఓటర్లలో 47.7 శాతం మంది మహిళలు ఉండగా ముసాయిదా జాబితాలో వారి సంఖ్య 47.2 శాతానికి పడిపోయింది. దక్షిణ బీహార్‌లోని కైమూర్‌ జిల్లాలో ఎస్సీలకు కేటాయించిన రాజ్‌పూర్‌ స్థానంలో అత్యధికంగా 69 శాతం మంది మహిళా ఓటర్లను తొలగించారు. ఇదే జిల్లాలోని బ్రహ్మపూర్‌ స్థానంలో 63 శాతం మంది మహిళల ఓట్లు గల్లంతయ్యాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పోలిస్తే కైమూర్‌ జిల్లాలోనే అత్యధికంగా (64 శాతం) మహిళల ఓట్లను తొలగించారు. బక్సర్‌ జిల్లాలో ఇది 63 శాతంగా ఉంది.మహిళల ఓట్లు ఎక్కువగా తొలగించిన అసెంబ్లీ స్థానాలలో రాజ్‌పూర్‌ (ఎస్సీ-69 శాతం), రామ్‌ఘర్‌ (67 శాతం), ధాకా (65 శాతం), మొహానియా (ఎస్సీ-65 శాతం), భాబువా (64 శాతం), ఠాకూర్‌గంజ్‌ (63 శాతం), అమౌర్‌ (63 శాతం), కోచాధామన్‌ (63 శాతం), బ్రహ్మపూర్‌ (63 శాతం), నోఖా (62 శాతం) ఉన్నాయి. జిల్లాల విషయానికి వస్తే కైమూర్‌, బక్సర్‌, కిషన్‌గంజ్‌, గోపాల్‌పూర్‌, ఆర్వాల్‌, భాగల్పూర్‌లో 60 శాతినికి పైగా మహిళా ఓటర్లను తొలగించారు. రోV్‌ాతస్‌, సివాన్‌, దర్భాంగా, సుపాల్‌ జిల్లాల్లో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి. ఇక రాష్ట్రంలోని పూర్నియా, కిషన్‌గంజ్‌, మధుబని, భాగల్పూర్‌, సీతమర్చి జిల్లాలలో ముస్లిం ఓట్లు ఎక్కువ సంఖ్యలో గల్లంతయ్యాయి.
ఇదిలావుండగా బూత్‌ స్థాయి అధికారుల (బీఎల్‌ఓలు) వార్షిక వేతనాన్ని రూ.12,000కు పెంచుతున్నట్లు ఎన్నికల కమిషన్‌ తెలిపింది. ఎన్నికల జాబితాల రూపకల్పన కోసం వీరు క్షేత్రస్థాయిలో పనిచేస్తుంటారు. 2015 నుంచి వీరి వార్షిక వేతనం ఆరు వేల రూపాయలుగా ఉంటోంది. ఇప్పుడు దానిని రూ.12,000కు పెంచారు. ఉపాధ్యాయులు లేదా ఇతర రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు బీఓఎల్‌గా విధులు నిర్వర్తిస్తారు. పోలింగ్‌ కేంద్రంలో ఓటర్లను చేర్చడం, తొలగించడం వీరి పని. వివిధ రాష్ట్రాలలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్‌)ను చేపట్టే బీఎల్‌ఓలకు రూ.6,000 ప్రత్యేక ఇన్సెంటివ్‌ ఇవ్వాలని కూడా ఈసీ నిర్ణయించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -