Monday, August 4, 2025
E-PAPER
Homeక్రైమ్విద్యార్థిని అనుమానాస్పద మృతి

విద్యార్థిని అనుమానాస్పద మృతి

- Advertisement -

– కళాశాల ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా
– విద్యార్థిని మరణంపై విచారణ జరిపించాలి
నవతెలంగాణ-నయీంనగర్‌, ఎంజీఎం

హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఎస్‌ఆర్‌ కళాశాలకు చెందిన ఓ విద్యార్థిని కళాశాలలోనే ఉరి వేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. కాగా, విద్యార్థిని కుటుంబీకులకు ఎలాంటి సమాచారం అందించకుండానే మృతదేహాన్ని కళాశాల యాజమాన్యం వరంగల్‌ ఎంజీఎంకు తరలించడంతో కళాశాలపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాలకు చెందిన మిట్టపల్లి శివాని(16) హనుమకొండ నయీమ్‌నగర్‌లోని ఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలోనే కళాశాలలోని క్లాసు రూమ్‌లో తన డ్రెస్సు చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఇదిలా ఉంటే మృతురాలు రాసిన సూసైడ్‌ నోట్‌ సంఘటన స్థలంలో లభ్యమైంది. ‘కళాశాలలో చేర్చే ముందు ఒక్కసారి ఆలోచించాలి.’ అని ఆ లేఖలో శివాని తన అవేదనను వ్యక్తం చేసింది. కానీ, ఈ సూసైడ్‌ నోట్‌ తమ కూతురిది కాదని మృతురాలి తల్లి అంటోంది.
దాంతో విద్యార్థిని మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా శివాని మృతదేహాన్ని ఎంజీఎంలో వదిలేయడం బాధకరమని మృతురాలి బాబాయి కొమరయ్య అన్నారు. ఉదయం 9 గంటలకు ఎస్‌ఆర్‌ కాలేజీ యాజమాన్యం ఫోన్‌చేసి విషయం చెప్పారని, తాము సాయంత్రం 6 గంటలకు కాలేజ్‌కు వచ్చేసరికి అక్కడ ప్రిన్సిపాల్‌ లేరని తెలిపారు. ఎంజీఎం వద్ద కళాశాల యాజమాన్యం తరపున ఏ ఒక్కరూ లేరని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, చదువుల్లో రాణించలేక, ఒత్తిడిని భరించలేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని తోటి విద్యార్థులు, ఎస్‌ఆర్‌ కాలేజ్‌ సిబ్బంది తెలిపారు.

సమగ్ర విచారణ జరపాలి
విద్యార్థిని ఆత్మహత్య విషయం తెలుసుకున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్‌ మాట్లాడారు. విద్యార్థి శివాని ఆత్మహత్యపై పోలీసులు సమగ్రమైన విచారణ జరిపించి, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రయివేట్‌, కార్పొరేటు విద్యా సంస్థలు విద్యార్థులను చదువుల పేరుతో, అధిక ఫీజుల పేరుతో ఒత్తిడికి గురిచేస్తూ వారి ప్రాణాలు తీసే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. శివాని అనే అమ్మాయి ఆదివారం ఉదయం 7:30గంటలకు చనిపోతే 12 గంటల వరకు విద్యార్థి తల్లిదండ్రులకు ఎస్‌ఆర్‌ విద్యా సంస్థ యజమాన్యం చెప్పకుండా విద్యార్థి మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌, స్థానిక ఎమ్మెల్యే, విద్యాశాఖ అధికారులు స్పందించి వెంటనే విచారణ చేపట్టాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి బిరెడ్డి జస్వంత్‌, జిల్లా కమిటీ సభ్యులు చెన్నూరి సాయికుమార్‌, మల్లేష్‌, పవన్‌, రాహుల్‌, అజరు, వినరు, ప్రశాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -