Monday, August 4, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅవయవదానంలో తెలంగాణ అగ్రస్థానం

అవయవదానంలో తెలంగాణ అగ్రస్థానం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అవయవదానంలో తెలంగాణ రాష్ట్రం మరోసారి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2024 సంవత్సరానికి గాను దేశంలోనే అత్యధిక అవయవదానాలు చేసిన రాష్ట్రంగా తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు జాతీయ అవయవ, కణజాల మార్పిడి సంస్థ (నోటో) విడుదల చేసిన అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా మరణానంతరం చేసే అవయవదానంలో తెలంగాణ దేశంలోనే ముందు వరుసలో ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘జీవన్‌దాన్’ కార్యక్రమం ఈ ఘనత సాధించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ఏటా అవయవదాతల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2021లో 162 మంది దాతలు ఉండగా, 2022 నాటికి ఆ సంఖ్య 194కి పెరిగింది. ఇదే ఒరవడి 2023, 2024 సంవత్సరాల్లోనూ కొనసాగింది. 2023లో కూడా తెలంగాణ.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పోటీపడి అగ్రస్థానంలో నిలవడం గమనార్హం.

‘జీవన్‌దాన్’ కార్యక్రమం కింద మరణించిన దాతల నుంచి కిడ్నీలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, క్లోమం, కంటి కార్నియాలు వంటి కీలక అవయవాలను సేకరించి ఎంతోమందికి పునర్జన్మ ప్రసాదిస్తున్నారు. ముఖ్యంగా కొవిడ్ మహమ్మారి తర్వాత ప్రజల్లో అవయవదానంపై అవగాహన పెరగడం, మరణించిన వారి కుటుంబ సభ్యులు అవయవదానానికి స్వచ్ఛందంగా ముందుకు రావడం ఈ విజయానికి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు.

తాజా గ‌ణాంకాల ప్ర‌కారం దేశవ్యాప్తంగా అవయవదానం రేటు ప్రతి పది లక్షల జనాభాకు ఒకటి కంటే తక్కువ(0.8)గా ఉన్నప్పటికీ, తెలంగాణలో ఇది 4.88గా ఉంది. తెలంగాణ‌ సాధించిన ఈ పురోగతి ఎంతో ఆశాజనకంగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, నిరంతర అవగాహన కార్యక్రమాలు, ఆసుపత్రులు, అధికారుల మధ్య సమర్థవంతమైన సమన్వయం వల్లే ఇది సాధ్యమైందని చెప్పవచ్చు. అవయవాల కొరతను అధిగమించి, ప్రాణాలను కాపాడటంలో తెలంగాణ మోడల్ ఇతర రాష్ట్రాలకు ఒక మార్గదర్శిగా నిలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -