ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్రేమలు పెరిగిపోతున్నాయి. వీటిలో కొన్ని పెండ్లి వరకు వెళితే కొన్ని మాత్రం అనార్థాలకు దారి తీస్తున్నాయి. సోషల్ మీడియా వినియోగం వల్ల పెండ్లికి ముందే ఒకరి గురించి ఒకరు తెలుసుకునేందుకు కొంత వరకు బాగానే ఉపయోగపడుతుంది. అయితే ఈ సోషల్ మీడియాను మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనే దానిపై అనేక విషయాలు ఆధారపడి ఉంటాయి. మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, వాళ్లను ఎందుకు నమ్ముతున్నాం అనేది పరిశీలించుకోవాలి. లేదంటే మోసపోవడం ఖాయం. అలాంటి ఓ కథనమే ఈ వారం ఐద్వా అదాలత్‌లో…
కవితకు 26 ఏండ్లు ఉంటాయి. డిగ్రీ పూర్తి చేసి ఒక ప్రయివేటు సంస్థలో ఉగ్యోగం చేస్తుంది. అమ్మా, నాన్న, అక్క, తమ్ముడితో కలిసి ఉంటుంది. అక్కకు పెండ్లి అయిపోయింది. తమ్ముడు చదువుకుంటున్నాడు. అమ్మా నాన్న ఇద్దరూ ఉద్యోగస్తులే. కవిత అందరితో ఇట్టే కలిసిపోతుంది. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్ముతుంది. పరిచయం అయిన నెల, రెండు నెలలకే వారితో తనకు సంబంధించిన అన్ని విషయాలు పంచుకుంటుంది. చివరకు వ్యక్తిగత విషయాలతో సహా చెప్పేస్తుంది. ఆ తర్వాత బాధపడుతుంది. ‘నేను వాళ్లతో ఇలాంటి విషయాలు చెప్పాల్సింది కాదు, తొందర పడ్డాను’ అని తర్వాత తీరిగ్గా ఆలోచిస్తూ తనలో తనే మదనపడుతుంటుంది. ఆమె చేసే ఇలాంటి పనుల వల్ల ఆమెతో పాటు అప్పుడప్పుడు కుటుంబం మొత్తం కూడా బాధపడాల్సి వచ్చేది.
ఇలాంటి కవితకు ఆరు నెలల ముందు ఫేస్‌బుక్‌లో ప్రవీణ్ పరిచయం అయ్యాడు. ప్రతి రోజూ ఇద్దరూ చాటింగ్ చేసుకునేవారు. రోజూ కనీసం రెండు మూడు గంటలైనా కచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. ప్రవీణ్‌కు కవిత తన కుటుంబ పరిస్థితి మొత్తం చెప్పింది. వారి ఆస్తులు, ఇంటి గొడవలు, మంచి చెడు… ఇలా ఇంట్లో చిన్న సంఘటన జరిగినా అతనితో పంచుకునేది. ఇంట్లో పండగలైనా, ఫంక్షన్ అయినా ఆమె ఆరోజు ఏ డ్రెస్ వేసుకుందో కూడా చెప్పేసేది. అంతే కాదు ఒక్కోసారి ప్రవీణ్‌ను అడిగి మరీ అతను చెప్పిన డ్రెస్సే వేసుకునేది.
ఇలా ఇద్దరి మధ్య స్నేహం కాస్త మూడు నెలల్లోనే ప్రేమగా మారింది. ప్రవీణ్‌నే తన భర్తగా నిర్ణయించుకుంది కవిత. ప్రవీణ్ కూడా ‘నువ్వు లేకుండా నేను ఉండలేను, మనిద్దరం పెండ్లి చేసుకుందాం’ అని నమ్మించాడు. అంతే కాదు ‘మా అమ్మకు ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రిలో ఉంది అర్జంటుగా నాకు కొంత డబ్బు కావాలి. అక్క పెండ్లి వుంది ఖర్చులకు ఇబ్బందిగా ఉంది’ అంటూ కవిత దగ్గర నుండి సుమారు రెండు లక్షల వరకు తీసుకున్నాడు. ఒకసారి ‘పెండ్లి చేసుకోబోయే వాళ్లమే కదా ఇంకా ఎన్ని రోజులు ఇలా ఫేస్‌బుక్‌లోనే మాట్లాడుకోవడం, మనం ఎక్కడైనా కలుసుకుందాం’ అన్నాడు ప్రవీణ్. అనుకున్నట్టుగానే ఇద్దరూ అప్పుడప్పుడు బయట కలుసుకోవడం మొదలుపెట్టారు. మొదట్లో సినిమాలు, ఐస్‌క్రీ పార్లర్లు, పార్కుల్లో కలుసుకునే వాళ్లు చివరకు హౌటల్ రూమ్‌లకు వెళ్లడం ప్రారంభించారు.
కవిత అతన్ని పూర్తిగా నమ్మింది. ఇద్దరూ మేజర్లు కాబట్టి అన్నీ తమ ఇష్టపూర్వకంగానే కొనసాగించారు. ఇప్పుడు కవిత రెండు నెలల గర్భవతి. అదే విషయం ప్రవీణ్‌కు చెప్పింది. దానికి అతను సంతోషించి ‘వెంటనే పెండ్లి చేసుకుందాం, నేను ఊరికి వెళ్లి మా కుటుంబ సభ్యులకు చెప్పి వారిని ఒప్పించి మీ ఇంటికి తీసుకొని వస్తాను. అయితే ఇప్పుడు వెళ్లడానికి నా దగ్గర డబ్బులు లేవు’ అన్నాడు. దాంతో కవిత ‘నా దగ్గర ఉన్నాయి’ అని 50 వేలు ఇచ్చి పంపించింది. అవి తీసుకొని వెళ్ళి నెల రోజులు అవుతుంది. అతని నుండి ఫోన్‌కానీ, మెసేజ్ కానీ లేదు. ఫేస్‌బుక్‌లో కూడా కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో కవితకు అర్థం కాక ఐద్వా ఐలమ్మ ట్రస్ట్‌కు వచ్చింది.
మేము ప్రవీణ్‌తో మాట్లాడాలని అనుకుంటే అతనికి సంబంధించిన పూర్తి సమాచారం ఆమె దగ్గర లేదు. అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అతని ఫేస్‌బుక్ ఐడీలో పేరు ప్రవీణ్ అని తప్ప మిగతా వివరాలేమీ లేవు. అతను ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు, వారి కుటుంబ సభ్యులు ఎవరు.. అనే విషయాలు ఏవీ కవితకు తెలియదు. ఇవేవీ తెలియకుండా అతనితో పరిచయం పెట్టుకొని ప్రేమించి చివరకు గర్భవతి అయ్యింది.
ఇంట్లో వాళ్లకు ఈ విషయం తెలుసా అంటే ‘లేదు, నేను ఎవరికీ చెప్పలేదు. గర్భవతిని అని తెలిస్తే నా కుటుంబం ఏమైపోతుందో అర్థం కావడం లేదు. నన్ను పెండ్లి చేసుకుంటా అని నన్ను నమ్మించి ఇలా చేస్తాడనుకోలేదు’ అంటూ కవిత ఏడ్వడం మొదలు పెట్టింది. దాంతో మేమే కవిత తల్లిదండ్రులను పిలిచి ‘ఇలాంటి సమయంలో మీరే కవితకు అండగా నిలబడాలి. లేదంటే ఆమె పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. కవిత చేసింది చాలా పెద్ద తప్పే. అలా అని మీ బిడ్డను వదులుకోలేరు కదా! నమ్మి మోసపోయింది. ప్రవీణ్ అడ్రస్ తెలియదు కాబట్టి మీరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కేసు పెట్టండి. వారు దర్యాప్తు చేసి ప్రవీణ్ ఆచూకీ తెలుసుకుంటారు’ అని చెప్పాము.
అయితే మొదట తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకెళ్లడానికి అంగీకరించలేదు. బిడ్డ పుట్టిన తర్వాత తండ్రి ఎవరని అందరూ అడిగితే ఏం చెప్పాలి. ఇలాంటి అమ్మాయి మాకు వద్దు’ అన్నారు. రెండు మూడు సార్లు వాళ్లను కూర్చోబెట్టి అర్థమయ్యేటట్టు చెబితే చివరకు కవితను అంగీకరించారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కేసు కూడా పెట్టారు. అప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే ప్రవీణ్ గతంలో కూడా ఇలా ఇద్దరు అమ్మాయిలను మోసం చేశాడు. ఆ కేసులు కూడా నడుస్తున్నాయి. కనుక ఇప్పుడు కవితకు కొత్త జీవితం ప్రారంభించడం తప్ప మరో మార్గం లేదు.
కాబట్టి అమ్మాయిలూ.. కాస్త జాగ్రత్త. స్నేహాలు చేసేటప్పుడు వెనకా ముందు చూసి అవగాహనతో చేస్తే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే తల్లిదండ్రులు పిల్లలను తిట్టినా, కోప్పడినా కేవలం వాళ్ల మంచి కోసమే. అయినా కొంత మంది పెద్దల మాటలు పట్టించుకోకుండా తప్పులు చేస్తుంటారు. అయితే పిల్లలు ఎలాంటి తప్పులు చేసినా తల్లిదండ్రులు వాళ్లకు అండగా ఉంటారు. అప్పుడే వారి భవిష్యత్ బాగుంటుంది. పిల్లలను అర్థం చేసుకునేది కేవలం తల్లిదండ్రులు మాత్రమే అని కవిత జీవితం ద్వారా మనకు మరోసారి రుజువయింది.
- వై వరలక్ష్మి, 9948794051