– ఆమోదం తెలిపిన క్యాబినెట్
– చర్చల తర్వాత భవిష్యత్ కార్యాచరణ
– రాజకీయ కక్షపూరిత చర్యలుండవు
– పీసీ ఘోష్‌ది స్వతంత్ర న్యాయ కమిషన్ : మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సోమవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఘోష్ సమర్పించిన నివేదికపై అధికారుల కమిటీ తయారు చేసిన సారాంశాన్ని ప్రవేశపెట్టి చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదలశాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. త్వరలో అసెంబ్లీని సమావేశపరిచి పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రవేశపెట్టనున్నట్టు సీఎం తెలిపారు. ఆ సమావేశాల్లో చర్చించి అందరి అభిప్రాయాలను, సూచనలను స్వీకరించిన తర్వాతే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. ప్రతిపక్ష నేత కేసీఆర్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ నివేదికపై తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చని స్పష్టం చేశారు. పీసీ ఘోష్ కమిషన్ స్వతంత్ర న్యాయ కమిషన్ అని గుర్తుచేశారు. భవిష్యత్తులోనూ రాజకీయ కక్షపూరిత చర్యలు తీసుకోబోమని తెలిపారు. 2007-08లో నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించారని చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక దాన్ని మేడిగడ్డ, సుందిళ్ల వద్దకు మార్చారని తెలిపారు. ఆయన పాలనలోనే మేడిగడ్డ కుంగిపోయిందనీ, అన్నారం-సుందిళ్లకు పగుళ్లు వచ్చాయని అన్నారు. దీనిపై వేసిన కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లతో సహా ఐఏఎస్ అధికారులతో పాటు అందరి నుంచి సమాచారం సేకరించిందని తెలిపారు. ఊరు, పేరు, అంచనాలను మార్చి అవినీతికి పాల్పడి, అక్రమాలకు పునాదులు వేసిన ప్రాజెక్టు కూలిపోయిందని విమర్శించారు.
ఈటల చెప్పింది అవాస్తవం :డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సమిష్టి నిర్ణయమంటూ చెప్పినదాంట్లో వాస్తవం లేదని కమిషన్ తన నివేదికలో పేర్కొన్నట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆ ప్రాజెక్టు ప్రణాళిక, నిర్వహణ, అవకతవకలకు, పూర్తి చర్యలకు అప్పటి సీఎం కేసీఆర్‌దే పూర్తి బాధ్యత అని తెలిపారు. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేకపోవడం వల్లే మేడిగడ్డకు మార్చామని కేసీఆర్ చెప్పిన దాంట్లో నిజాయితీ లేదని కూడా కమిషన్ వ్యాఖ్యానించిందని భట్టి తెలిపారు.
అది కేసీఆర్ వ్యక్తిగత నిర్ణయం : మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి
కాళేశ్వరం రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ అన్నింటికీ మాజీ సీఎం కేసీఆరే వ్యక్తిగతంగా బాధ్యులని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అధ్యయన కమిటీ సమర్పించిన సారాంశంపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అధిక వడ్డీలతో రూ.84 వేల కోట్ల అప్పులు తెచ్చి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్‌ఎస్ హయాంలోనే కూలిపోయిందని చెప్పారు. పీసీ ఘోష్ కమిషన్ 660 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తే, దానిని అధికారుల కమిటీ 25 పేజీలతో సంక్షిప్తం చేసిందని తెలిపారు. 2016లో మేడిగడ్డ వద్ద నిర్మాణానికి ఒప్పందం కుదిరిందని, 2019లో కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారనీ, 2023లో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందనీ, ఆ కుంగుబాటుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) తనిఖీ చేసిందని తెలిపారు. ఈ తనిఖీలో మేడిగడ్డ నిర్మాణంలో ప్లానింగ్, డిజైన్‌లో లోపాలను గుర్తించిందని చెప్పారు. సుందిళ్లలోనూ ఇదే రకమైన సమస్యలున్నాయని తెలిపినట్టు వివరించారు. నీటి నిల్వకు అవకాశం లేని బ్యారేజీల్లో తమ ప్రచారం కోసం నిల్వ చేశారని ఆయన విమర్శించారు. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవన్న కేసీఆర్ నిర్ణయం నిజాయితీతో కూడింది కాదని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వ్యాఖ్యానించిందని చెప్పారు. అక్కడ తగినంత నీరు ఉందని అప్పటి కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి చెప్పారని గుర్తుచేశారు. 70 శాతం నికర నీటి లభ్యత ఆధారంగా హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చినట్టు కేంద్రం లేఖ రాస్తే, దాన్ని కాదని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నీటి లభ్యత లేదని తిరిగి లేఖ రాసిందని విమర్శించారు. ఆ లేఖ వెనుక దురుద్దేశాలు ఉన్నాయని కమిషన్ అభిప్రాయపడిందన్నారు. కేసీఆర్ వేసిన నిపుణుల కమిటీ కూడా మేడిగడ్డ వద్ద బ్యారేజ్ వద్దంటూ చేసిన సూచనలను కూడా పట్టించుకోలేదని తెలిపారు. ఆ కమిటీ ప్రాణహిత మీద బ్యారేజ్ కట్టొచ్చని సూచించిందని పేర్కొన్నారు.
”ప్రాజెక్టుపై అప్పటి క్యాబినెట్ భేటీలో చర్చించలేదు. సీఎం నోటిమాట మేరకు కాంట్రాక్టులు ఇచ్చారు. ప్రజాధనం కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు విలువలను సవరించారు. మేడిగడ్డ నిర్మాణంపై అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి నిర్ణయం చట్టబద్ధం కాదు. ఆ ప్రాజెక్టు నిర్మాణానికి ఇచ్చిన జీవోను క్యాబినెట్ సమావేశంలో పెట్టలేదు. ఇంతపెద్ద ప్రాజెక్టుకు మంత్రివర్గ ఆమోదం అవసరం, తప్పనిసరి కూడా. క్యాబినెట్ ఆమోదం లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేయకూడదు. మేడిగడ్డ నిర్మాణానికి ఇచ్చిన జీవోలు 230, 231, నిర్మాణ అనుమతులు చట్ట వ్యతిరేకం. కాళేశ్వరం రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ అన్నింటికీ కేసీఆర్ వ్యక్తిగతంగా బాధ్యుడని ఘోష్ కమిషన్ స్పష్టం చేసింది… పాలనా విధానాలు అనుసరించకుండా హరీశ్‌రావు ఆదేశాలు ఇచ్చారు. ఆర్థిక జవాబుదారీ తనాన్ని అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పాటించలేదు…”అని ఉత్తమ్ వివరించారు.
”కాళేశ్వరంలో ఆర్థిక అవకతవకలు, నిబంధనల ఉల్లంఘన జరిగింది. ప్రాజెక్టు అధికారులు, నిర్మాణ సంస్థతో కుమ్మక్కయ్యారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో ప్రజాధనం దుర్వినియోగమైంది. బ్యారేజీలు దెబ్బతినడానికి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే కారణం. నిర్మాణ స్థలం మార్పు, అంచనాల సవరింపులో అవకతవకలున్నాయి. డిజైన్‌లో లోపాలు, నాణ్యత తనిఖీలు లేకపోవడంతో నష్టం జరిగింది. ప్రజాధనం దుర్వినియోగానికి బోర్డు సభ్యులు కూడా బాధ్యులు. కాళేశ్వరం బోర్డులోని అధికారులపై క్రిమినల్ బీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద చర్యలు తీసుకోవాలి. మేడిగడ్డ నిర్మాణంపై ఎల్ అండ్ టీ సంస్థకు ఎలాంటి సర్టిఫికెట్లు ఇవ్వొద్దు. బ్యారేజీ ఏడో బ్లాక్‌ను ఆ సంస్థ పునరుద్ధరించాలి. ఇతర ఆనకట్టల్లో లోపాల సవరణ కూడా చేయాల్సిందే. ఈ వ్యయాన్ని ఎల్ అండ్ టీనే భరించాలి” అని కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసినట్టు ఉత్తమ్ తెలిపారు.
అసెంబ్లీకి కాళేశ్వరం నివేదిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES