– ఉత్సవ విగ్రహాలుగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు
– గ్రూప్ రాజకీయలకు కేరాఫ్‌గా బీఆర్ఎస్
– ప్రతి నియోజకవర్గంలోనూ తగాదాలు
– గాడిలో పెట్టడంలో జిల్లా అధినేతలు విఫలం
వికారాబాద్ జిల్లా అధినేతకు ఇతర ముఖ్య నేతలతో విబేధాలు నైరాశ్యంలో పార్టీ శ్రేణులు
బీఆర్ఎస్ను మరో దఫా అధికారంలోకి తీసుకురావడానికి ఆ పార్టీ అధినేత శతవిధాలా కృషి చేస్తున్నారు. పార్టీని మరింతా పటిష్టం చేయాలనే ఉద్దేశంతో గతంలో జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. క్యాడర్ నుంచి లీడర్ దాకా సమన్వయం చేసుకుని, గ్రూపు రాజకీయాలకు చెక్‌పెట్టి పార్టీని బలోపేతం చేయాలని పార్టీ అధినేత జిల్లా అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అధికార పార్టీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యే మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. వీటిని కట్టడి చేయాల్సిన జిల్లా అధ్యక్షులు ఆ మేరకు చర్యలు తీసుకోవడం లేదు. కేవలం ఇతర పార్టీ నేతల చేరికలకు పరిమితం కావడం తప్పా పార్టీలోని అంతర్గత విషయాలపై దృష్టి సారించడం లేదు. దాంతో ఉత్సవ విగ్రహాలుగా మిగిలారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్లో అంతర్గత విబేధాలు తారస్థాయికి చేరా యి. ఎన్నికల సమయం దగ్గర పడేకొద్ది ఆ పార్టీలో వర్గపోరు తీవ్ర రూపం దాల్చుతోంది. జిల్లాలో ఏ నియోజకవర్గంలో చూసినా గ్రూప్ రాజకీయాలే దర్శన మిస్తున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు పార్టీ అధినేత ప్రతీ జిల్లాకు జిల్లా అధ్యక్షు లను నియమించారు. కానీ జిల్లా అధ్యక్షులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. పార్టీ అధ్యక్షుడిగా అన్ని నియో జకవర్గాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. క్యాడర్, లీడర్ మధ్య, లీడర్, లీడర్ మధ్య సమన్వయం చేసి పార్టీని మరింతా పటిష్టం చేయాలి. కానీ ఉమ్మడి జిల్లాలో అధ్యక్షులు తమ సొంత నియోజకవర్గాలకే పరిమితం అవుతున్నారు. పక్క నియోజకవర్గంలోకి వెళ్లే పరిస్థితి లేదు. ఇక పార్టీ సమస్యలను పట్టింపేక్కడిదని పార్టీ శ్రేణులే చర్చించుకుంటున్నారు.
రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్లో తగ్గని అంతర్గ విభేదాలు
కొంత కాలంగా బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా పార్టీ నేతల మధ్య నెలకొన్న అంతర్గత విబేధాలు ఏ మాత్రం సద్దుమనగడం లేవు. జిల్లా అధ్యక్షులుగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పగ్గాలు చేపట్టినప్పటికీ పెద్దగా మార్పులేమి కనిపించడం లేదు. క్యాడర్ మధ్య నెలకొన్న అంతర్గ విబేధాలను పరిష్కరించి, సమన్వయప ర్చడంలో జిల్లా అధ్యక్షులుగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి విఫలం చెందినట్టు ఆ పార్టీ శ్రేణులే ఆరోపిస్తున్నారు. మహేశ్వరంలో నియోజకవర్గంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగాల కృష్ణారెడ్డి పచ్చి గడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి ఉంది. రోజు రోజుకూ వారి మధ్య విబేధాలు తారా స్థాయి చేరుతున్నా యి. తీగల పార్టీ వీడేందుకు కూడా సిద్ధమైనట్టు సమాచారం. అయినప్పటికీ వీరి మధ్య సయోధ్య కూదుర్చి, తీగల పార్టీ వీడకుండా చేయడంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదనేది స్పష్టం. ఇదిలా ఉంటే రాజేందర్న గర్‌లో ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డిల మధ్య, చేవెళ్లలో కాలే యాదయ్య, మాజీ ఎమ్మెల్యే రత్నం, షాద్‌నగర్‌లో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ప్రతాప్ రెడ్డిల మధ్య, ఇలా ప్రతీ నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు కొకొల్లాలు. వీటికి ఫుల్‌స్టాఫ్ పెట్టి.. పార్టీని గాడిలో పెట్టాల్సిన బాధ్యత జిల్లా అధినాయకత్వానిదే కానీ ఆ పదవిలోఉన్న కిషన్‌రెడ్డి ఆ దిశగా చర్యలు తీసుకున్నది శూన్యమే అన్నది పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వర్గాలను వీడని వికారాబాద్
వికారాబాద్ జిల్లాలోనూ పార్టీలో అంతర్గత విబేధాలు భగ్గుమంటున్నాయి. వికారాబాద్ జిల్లా అధ్యక్షులుగా వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌కు సీఎం కేసీఆర్ పార్టీ పగ్గాలు అప్పగించారు. తదనంతరం గతంలో కంటే మరింతా పార్టీలో విబేధాలు పెరిగాయి. జడ్పీ చైర్‌పర్సన్‌కు జిల్లా అధ్యక్షుడికి మధ్య విబేధాలు బహిరంగ రహస్యమే. గతంలో ఇద్దరి వర్గీయులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని, ఒకరి పర్యటనలను ఒకరు అడ్డుకున్న పరిస్థితి తెలిసిందే. తాండూర్‌లో సైతం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి మధ్య విబేధాలు ఉన్నాయి. జిల్లా అధ్యక్షుడు ఆనంద్ తాండూర్ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వైపు ఉండడం.. ఎమ్మెల్సీ పట్నం కుటుంబానికి జిల్లా అధ్యక్షుడు ఆనంద్‌కు మధ్య విభేదాలు ఉండడంతో అగ్నికి గాలి తోడైనట్టు పార్టీ వర్గాల్లో గ్రూపు రాజకీయాలు రెట్టింపు అయ్యాయి. అందరినీ సమన్వయం చేయాల్సిన జిల్లా అధ్యక్షుడికే.. ఇతర నేతలతో విబేధాలు ఉండడంతో పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. దీని ప్రభావం వచ్చే ఎన్నికలపై ఉంటుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఏదిఏమైనా పార్టీని గాడిలో పెట్టాల్సిన జిల్లా అధినేతలు ఉత్సవ విగ్రహాల పాత్రను పోషించడంతో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది.