Thursday, August 7, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంమీడియాపై మోడీ నిఘా

మీడియాపై మోడీ నిఘా

- Advertisement -

ఖాకీల చేతికి ఆంక్షల సంకెళ్లు అనుకూల వార్తలకు ఓకే..వ్యతిరేకమైతే ఉక్కుపాదమే
– కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్స్‌
– న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు
– కొనసాగుతున్న మస్క్‌,మోడీల మధ్య బంధం

తనకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాలలో వస్తున్న వ్యాఖ్యలు, వార్తలపై మోడీ ప్రభుత్వం కన్నెర్ర చేస్తూనే ఉంది. 2003 తర్వాత ఈ ధోరణి మరింత పెరిగింది. వ్యతిరేక పోస్టులు, వ్యాఖ్యలు, కార్టూన్లను తొలగించాలంటూ ఆదేశించే అధికారాన్ని పోలీసు అధికారులకు కట్టబెట్టింది. ప్రపంచ కుబేరుడైన ఎలన్‌ మస్క్‌ సారథ్యంలోని ఎక్స్‌ వేదికకు పుంఖానుపుంఖాలుగా నోటీసులు జారీ అవుతున్నాయి. అధికారులు ఆదేశించినప్పటికీ అనేక పోస్టులు ఇప్పటికీ ఆన్‌లైన్‌లో కన్పిస్తుండడం గమనార్హం. ప్రధాని మోడీ, మస్క్‌ మధ్య ఉన్న సంబంధాలే దీనికి కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మస్క్‌ వ్యాపార సామ్రాజ్యంలోని టెస్లా, స్టార్‌లింక్‌ ఇప్పటికే దేశంలో ప్రవేశించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్స్‌ న్యాయస్థానాలలో వ్యాజ్యాలు వేసినప్పటికీ మోడీ, మస్క్‌ మధ్య బంధం మాత్రం కొనసాగుతూనే ఉంది.
న్యూఢిల్లీ : ఎలన్‌ మస్క్‌ యాజమాన్యంలోని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో జనవరిలో వచ్చిన ఓ పోస్ట్‌ సతారా నగరంలోని పోలీసులను ఆందోళనకు గురిచేసింది. అధికార పార్టీకి చెందిన ఒక సీనియర్‌ నేతను ‘పనికిమాలిన వాడి’గా ఆ పోస్టులో అభివర్ణించారు. ఈ పోస్ట్‌, అందులోని విషయం తీవ్ర మత ఉద్రిక్తతను సృష్టిస్తుందని భావించిన ఇన్స్‌పెక్టర్‌ జితేంద్ర షహానే దానిని తొలగించాలంటూ ఎక్స్‌కు ఓ నోటీసు పంపారు. సామాజిక మాధ్యమాలలో వస్తున్న ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలను అడ్డుకునేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం అప్పటికే అనేక చర్యలు చేపట్టింది. వీటిని సవాలు చేస్తూ న్యాయస్థానాలలో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్లు దాఖలు చేసిన వారిలో ఈ పోస్టు పెట్టిన ఖాతా కూడా ఉంది.

తనకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో వస్తున్న వ్యాఖ్యలను అడ్డుకునేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం పోలీస్‌ అధికారులకు విస్తృత అధికారాలు కట్టబెట్టింది. ఈ చర్య చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అంటూ ఎక్స్‌ వాదించింది. ప్రభుత్వం పైన, అధికారుల పైన వస్తున్న విమర్శలను అణచివేసేందుకు ప్రభుత్వం పలు ప్రభుత్వ సంస్థలకు, పోలీసులకు అపరిమిత అధికారాలు కల్పించడం వాక్‌ స్వాతంత్య్రాన్ని కాలరాయడమే అవుతుందని విమర్శించింది. ఎక్స్‌ యజమాని అయిన మస్క్‌ అమెరికా, బ్రెజిల్‌, ఆస్ట్రేలియా తదితర దేశాలతో కూడా ఘర్షణకు దిగారు. వాక్‌ స్వాతంత్య్రాన్ని, భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకుంటారా అంటూ నిలదీశారు. భారత్‌లో ఇంటర్నెట్‌ సెన్సార్‌షిప్పును కట్టుదిట్టం చేసేందుకు మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకున్నదంటూ కర్నాటక హైకోర్టును మస్క్‌ ఆశ్రయించారు కూడా.

వివాదాస్పదం కాకపోయినా నోటీసులు
దుష్ప్రచారాన్ని అడ్డుకునే ఉద్దేశంతో సోషల్‌ మీడియాలోని అనుచిత కంటెంట్ల తొలగింపునకు ఆదేశించడం మాట అటుంచితే వివాదాస్పదం కాని పోస్టులను కూడా తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రధానమంత్రికి వ్యతిరేకంగా వచ్చిన కార్టూన్లను, స్థానిక నాయకులను ఎగతాళి చేసేలా ఉన్న కార్టూన్లను కూడా తొలగించాలని ఆదేశించారు. ఇంత జరిగినా మస్క్‌, మోడీ ప్రభుత్వం మధ్య సంబంధాలు దెబ్బతినే సంకేతాలు కన్పించడం లేదు. మస్క్‌ వ్యాపార సామ్రాజ్యంలోని టెస్లా వాహనాలు, ఉపగ్రహ ఇంటర్నెట్‌ ప్రొవైడర్‌ స్టార్‌లింక్‌ ఇప్పుడు మన దేశంలో ప్రవేశించాయి. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్య విషయమేమంటే బీజేపీని సమర్ధించే వారి సోషల్‌ మీడియా ఖాతాలపై కూడా పోలీసు అధికారులు నిఘా పెట్టారు. ఉదాహరణకు న్యాయవాది, బీజేపీ సభ్యుడు అయిన కౌస్తవ్‌ బగ్చీ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని వ్యోమగామి దుస్తులలో చూపుతూ ఓ చిత్రాన్ని పోస్ట్‌ చేశారు. అయితే అది దేశ భద్రతకు ప్రమాదమంటూ దానిని తొలగించాలని రాష్ట్ర పోలీసులు నోటీసు ఇచ్చారు.

ఇప్పటికీ ఆన్‌లైన్‌లో కన్పిస్తున్న పోస్టులు
ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన విషయాలపై పత్రికలలో వస్తున్న నివేదికలను సెన్సార్‌ చేయాలని రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేస్తోందని ఎక్స్‌ తన వ్యాజ్యంలో తెలిపింది. న్యూఢిల్లీలోని రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన పోస్టులను తొలగించాలని కొన్ని మీడియా సంస్థలకు ఆదేశాలు జారీ అయ్యాయి. వీటిలో అదానీ గ్రూప్‌నకు చెందిన రెండు ఎన్డీటీవీ సంస్థలు కూడా ఉన్నాయి. ఎన్డీటీవీ పోస్టులు ఇప్పటికీ ఆన్‌లైన్‌లోనే ఉన్నాయి. ఎక్స్‌లో పోస్ట్‌ చేసిన పలు అభ్యంతరకరమైన, రెచ్చగొట్టే విధంగా ఉన్న పోస్టులను తొలగించాలంటూ ఏప్రిల్‌లో కోరారు. వీటిలో ద్రవ్యోల్బణం అనే లేబుల్‌తో ఎర్ర డైనోనార్‌ను కలిగిన కార్టూన్‌ కూడా ఉంది. మోడీ, తమిళనాడు ముఖ్యమంత్రి కలిసి ధరలను నియం త్రించడానికి కష్టపడుతున్నట్టు దీనిని చిత్రించారు. అదే నెలలో…రంధ్రాలు పడిన పడవను చూపుతూ వరదలకు తమిళనాడు ప్రభుత్వం సంసిద్ధంగా లేకపోవడాన్ని ఎత్తిచూపే మరో కార్టూన్‌ను కూడా తొలగించాలని ఆదేశించారు. అయితే అది ఇప్పటికీ ఆన్‌లైన్‌లో ఉంది.

సహయోగ్‌లో చేరని ఎక్స్‌
సోషల్‌ మీడియాలో వచ్చిన కంటెంట్లను తొలగించాల్సిందిగా ఆదేశించే అధికారాన్ని ఐటీ మంత్రిత్వ శాఖ 99 మంది అధికారులకు కట్టబెట్టింది. అయితే తుది నిర్ణయం మాత్రం మంత్రిత్వ శాఖదే. గత సంవత్సరం అక్టోబరులో మరో అడుగు ముందుకు వేసిన మోడీ ప్రభుత్వం నోటీసుల జారీని సులభతరం చేయడానికి సహయోగ్‌ అనే వెబ్‌సైటును ప్రారంభించింది. ఈ పోర్టల్‌లో ఎక్స్‌ చేరలేదు. పైగా దానిని వ్యతిరేకిస్తూ ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వంపై దావా వేసింది. కాగా గత సంవత్సరం మార్చి, ఈ ఏడాది జూన్‌ మధ్యకాలంలో 1,400 పోస్టులు లేదా ఖాతాలు తొలగించాలని ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు ఎక్స్‌ను ఆదేశించాయి. ఈ తొలగింపు నోటీసులలో 70 శాతానికి పైగా సహయోగ్‌ వెబ్‌సైటును అభివృద్ధి చేసిన ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ జారీ చేసినవే. ఈ ఏజెన్సీ కేంద్ర హోం శాఖ అధీనంలో పనిచేస్తుంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కుమారుడు, అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ జై షాను బికినీ ధరించిన మహిళతో కలిపి అవమానకరమైన రీతిలో చూపించిన మూడు కల్పిత పోస్టులు తొలగించాలని జనవరిలో సైబర్‌ క్ర్రైమ్‌ సెంటర్‌ ఎక్స్‌కు సూచించింది. అయితే వీటిలో రెండు పోస్టులు ఇప్పటికీ ఆన్‌లైన్‌లోనే ఉన్నాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img