కేంద్ర అటవీశాఖ మంత్రికి బృందాకరత్ లేఖ
న్యూఢిల్లీ : ఛత్తీస్‌గఢ్ అటవీ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖమంత్రి భూపేందర్ యాదవ్‌కు మాజీ ఎంపీ, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ ప్రత్యేక ఆహ్వా నితురాలు బృందాకరత్ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫలితంగా 1742 హెక్టార్ల దట్టమైన అటవీ భూమి విధ్వంసానికి గురవుతుందని ఆమె ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకుని కెంటె బొగ్గు ప్రాజెక్టు విస్తరణ పనుల అమలును నిలిపివేయాలని కోరారు. ఈ ఏడాది జూన్‌లో సుర్గుజా జిల్లా అటవీ శాఖాధికారి ఆ సైట్‌లో తనిఖీ జరిపిన తర్వాత ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. హస్డియో-అరంద్ ప్రాంత బొగ్గు ప్రాజెక్టులో భాగమైన ఈ ప్రాజెక్టు నిర్వహణా భారాన్ని రాజస్థాన్ ప్రభుత్వ విద్యుత్ సంస్థకు అప్పగించారు. రాజస్థాన్ పూర్వపు ప్రభుత్వం అదానీ ఎంటర్‌ప్రైజెస్ అయిన పర్సా కెంటె కాలరీస్ లిమిటెడ్‌తో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది.
ఇందులో అదానీకి 74శాతం వాటా వుంది. హస్డియో-పర్సా బొగ్గు ప్రాజెక్టుకు ఈ కంపెనీని ఆపరేటర్‌గా నియమించారు. రికార్డులను పరిశీలిస్తే ఈ వెంచర్ కింద గణనీయమైన మొత్తంలో బొగ్గు ప్రయివేటు కంపెనీకి చెందిన విద్యుత్ ప్రాజెక్టులకు మళ్లించ బడుతోందని వెల్లడైంది. పైగా తిరస్కరించబడిన బొగ్గు అనే పేరుతో ఇదంతా సాగుతోంది. ప్రజా ప్రయోజనాల పేరుతో ఈ బొగ్గు ప్రాజెక్టును చేపట్టి, అనుమతులు పొందినా నిజానికి అందులో ప్రజల ప్రయోజనాలకు సంబంధించి ఏమీ లేవని, అంతా ప్రయివేటు ప్రయోజనాలే అమలవుతున్నాయని, ఖనిజ వనరులు దోపిడీకి గురవుతున్నాయని బృందాకరత్ లేఖ పేర్కొంది.
ఈ ప్రాజెక్టును అమలు చేస్తే, ఇప్పటికే మైనింగ్ పేరుతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలు మరింత వినాశనానికి గురవుతాయని అన్నారు. అధికారిక తనిఖీల నివేదిక ప్రకారం, నాలుగున్నర లక్షల చెట్లను కొట్టేస్తున్నారు. ఇవన్నీ కూడా దట్టమైన అటవీ భాగంలోనే వున్నాయి. ఓపెన్‌కాస్ట్ మైనింగ్ వల్ల ఇప్పటికే ఈ ప్రాంతంలోని వేలాది చెట్లు ధ్వంసమయ్యాయి. జలాలు కలుషిత మయ్యాయి. భూసారం దెబ్బతింది. పైగా గ్రామ సభల అభిప్రాయాలను పూర్తిగా విస్మరించి మరీ ఈ ప్రాజెక్టులను చేపడుతున్నారు. ఇలాంటి ప్రాజెక్టులకు గ్రామసభల ఆమోదం తప్పనిసరని రాజ్యాంగ, చట్ట నిబంధనలు చెబుతున్నా పట్టించుకోవడం లేదు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ వల్ల వాస్తవ ప్రాజెక్టును మించి చాలా పెద్ద మొత్తంలో భూభాగం ప్రభావితమవుతుంది. నిర్దిష్టమైన ఈ ప్రాంతంలో ప్రజల నివాసం లేనప్పటికీ ఈ ఏరియాకు వెలుపల అనేక గ్రామాలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రమాదముంది. ఇప్పటికే స్థానిక కమ్యూనిటీలకు చెందిన 1500కి పైగా రాతపూర్వక అభ్యంతరాలు ప్రభుత్వానికి అందినా, వాటిని పట్టించుకోలేదని బృందా కరత్ తన లేఖలో పేర్కొన్నారు. అభివృద్ధి పేరుతో ఇలాంటి ప్రయివేట్ మైనింగ్ ప్రాజెక్టులు సాగిస్తున్న వినాశనం నుంచి మన అడవులను రక్షించుకో వడానికి కఠినమైన రక్షణ చర్యలు అవసరమని బృందా కరత్ ఆ లేఖలో మంత్రికి స్పష్టం చేశారు.
ఈ ప్రాంతం లోని ఆదివాసీలు ఈ ప్రాజెక్టును తీవ్రంగా ప్రతిఘటిం చడం ద్వారా, చెట్లను కాపాడుకోవడానికి, తద్వారా ప్రకృతి నాశనం కాకుండా చూసేందుకు ప్రయత్నించేది వారేనని స్పష్టమైందని ఆ లేఖలో పేర్కొన్నారు. వారే దేశంలోని అడువులను నిజంగా కాపాడుకునేదని రుజువైందన్నారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా అడవులను కాపాడుకోవ డానికి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీపై వుందని తెలిపారు. ప్రయివేటు కంపెనీ ప్రయోజనాల కన్నా సుసంపన్నమైన జీవ వైవిధ్యమున్న ప్రాంతాన్ని నాశనం కాకుండా కాపాడుకోవడమనేది అత్యంత ముఖ్యమని గ్రహించాలని బృందా కరత్ లేఖలో పేర్కొన్నారు.
అదానీ కబ్జా నుంచి అటవీ భూమిని కాపాడండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES