Thursday, August 7, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంకేరళపై కేంద్రం వివక్ష

కేరళపై కేంద్రం వివక్ష

- Advertisement -

కేంద్ర పన్నుల్లో పడిపోయిన కేరళ వాటా
2.5 శాతం నుంచి 1.925 శాతానికి తగ్గుదల
న్యూఢిల్లీ :
మానవాభివృద్ధిలో దేశానికే దిక్సూచిగా నిలుస్తున్న కేరళ రాష్ట్రంపై కేంద్రం తీవ్ర వివక్ష చూపు తోంది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా గణ నీయంగా పడిపోతోంది. రాజ్యసభలో సీపీఐ(ఎం) సభ్యుడు జాన్‌ బ్రిట్టాస్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మం త్రిత్వ శాఖ ఇచ్చిన సమాధానాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు అందుతున్న వాటాపై బ్రిట్టాస్‌ అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం లభించలేదు. కేంద్ర ప్రభుత్వం డొంకతిరుగుడు వివరణలతో సరిపెట్టే ప్రయత్నం చేసింది.

సమ్మిళిత అభివృద్ధిలో మోడల్‌గా నిలుస్తున్నా…
1971లో దేశ జనాభాలో కేరళ వాటా 3.89 శాతం. పదవ ఆర్థిక సంఘం కాలంలో రాష్ట్రానికి 3.87 శాతం పన్ను వాటా వచ్చింది. అంటే జనాభాకు అనుగుణంగానే కేంద్ర పన్నుల్లో వాటా లభించిందన్న మాట. అయితే 14వ ఆర్థిక సంఘం కాలానికి వచ్చే సరికి ఈ వాటా 2.5 శాతానికి పడిపోయింది. 15వ ఆర్థిక సంఘం కాలంలో అది మరింత తగ్గి 1.925 శాతానికి చేరింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో రాష్ట్ర వాటా 2.75 శాతంగా ఉన్నప్పటికీ పన్నుల్లో ఆ మేరకు రాబడి కన్పించడం లేదు. జనసంఖ్యను అలా ఉంచినా ఆరోగ్యం, విద్య, సామాజిక సంక్షేమం, జనాభా నియంత్రణ వంటి రంగాల్లో సమ్మిళిత అభివృద్ధికి కేరళ ఓ మోడల్‌గా నిలుస్తోంది. అభివృద్ధికి మారుపేరుగా నిలుస్తున్న కేరళను గుర్తించడం, అందుకు తగిన ప్రతిఫలాన్ని అందించడం మాట అటుంచి రాష్ట్రాన్ని ఆర్థికంగా చిన్నచూపు చూస్తున్నారు. మద్దతు ఇవ్వాల్సింది పోయి శిక్షిస్తున్నారు.

రాజకీయ కోణంతోనే చిన్నచూపు
ఇందులో రాజకీయ కోణం ఉంది. వామపక్ష కూటమి పాలనలో ఉన్న కేరళను నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడంతో పాటు కేంద్రంతో రాజకీయంగా సత్సంబంధాలు నెరపుతున్న బీహార్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు నిధులు పెంచుతున్నారు. ఈ రాష్ట్రాలన్నింటికీ 15వ ఆర్థిక సంఘం కింద కేంద్ర పన్నుల్లో ఎక్కువ వాటా లభించింది. ఈ వివక్షను ఆర్థిక మంత్రిత్వ శాఖ సమర్థించుకోలేకపోతోంది. ఇది కేవలం సాంకేతిక సర్దుబాటు కాదు. కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యానికి ఉదాహరణ. తన విధానాలకు అంగీకరించని, అమలు చేయని కేరళను నిధులలో సరైన వాటా ఇవ్వకుండా కేంద్రం శిక్షిస్తోంది. జనాభా నియంత్రణలో విజయం సాధించిన కేరళ వంటి రాష్ట్రాలు అభివృద్ధి పథంలో పయనిస్తుంటే ఓర్వలేని కేంద్రం వాటిని ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇది విధానపరమైన వైఫల్యం కాదు. ఆర్థిక వివక్ష. అభివృద్ధితో విజయాలు సాధిస్తున్న రాష్ట్రాల కంటే తనకు రాజకీయంగా ఉపయోగపడుతున్న రాష్ట్రాలకే కేంద్రం ప్రాధాన్యత ఇస్తోంది. కోవిడ్‌, నిఫా వంటి సంక్షోభాలను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కేరళ రాష్ట్రం ఇప్పుడు తీవ్ర ఒత్తిడిని చవిచూస్తోంది. దానికి ప్రకృతి వైపరీత్యాలు కారణం కావు. కేంద్రం ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపులకు పాల్పడటమే దీనికి కారణం. పరిపాలన విషయంలో ప్రపంచ వేదికలపై కేరళను ప్రశంసలతో ముంచెత్తుతున్న కేంద్ర ప్రభుత్వం దేశీయంగా దానికి మద్దతు ఇవ్వడంలో విఫలమవుతోంది. ఫలితాలు అందిస్తున్న రాష్ట్రాల పట్ల అలసత్వం ప్రదర్శిస్తూ, మానవాభివృద్ధిలో బలహీనంగా ఉన్న రాష్ట్రాలకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారో వివరించేందుకు కేంద్రం నిరాకరిస్తోంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img