గ్రాట్యూటీతో పాటు పెన్షన్ ఇవ్వాలి
కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవికి ఎఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్ ప్రతినిధి బృందం వినతి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనాలు పెంచాలని, గ్రాట్యూటీ, పెన్షన్ ఇవ్వాలని, ఎఫ్‌ఆర్‌ఎస్ ఉపసంహరించుకోవాలని ఆలిండియా అంగన్ వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఫెడరేషన్ (ఎఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్) డిమాండ్ చేసింది. బుధవారం నాడిక్కడ కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవిని ఎఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్ ప్రతినిధి బృందం కలిసి వినతి అందజేసింది. అంగన్‌వాడీ సంఘం బృందం ఇచ్చిన వినతిపై స్పందించిన కేంద్ర మంత్రి ఎఫ్‌ఆర్‌ఎస్‌కు సంబంధించిన సమస్యలకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. గ్రాట్యూటీపై సుప్రీం కోర్టు ఉత్తర్వును ప్రభుత్వం గమనంలో ఉన్నదని, వేతనాల పెంపును పరిశీలిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. అయితే ఎఫ్‌ఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఆగస్టు 21న బ్లాక్ డేను నిర్వహిస్తామని ఎఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్ స్పష్టం చేసింది. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఎఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్ ప్రధాన కార్యదర్శి ఎఆర్.సింధూ, కోశాధికారి అంజు మైనీ, కార్యదర్శి ఊర్మిళ రావత్, సభ్యులు అమృత్‌పాల్ కౌర్, రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ ఉన్నారు. కేంద్ర శిశు అభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి జ్ఞానేష్ భారతి కూడా ఈ సమావేశంలో హాజరయ్యారు.
అనంతరం ఎఆర్ సింధూ మాట్లాడుతూ పార్లమెంటరీ కమిటీ సిఫారసు ప్రకారం ఐసీడీఎస్ 50 ఏండ్లు పూర్తయ్యాయని వివరించారు. 2025 అక్టోబర్ 2 నాటికి వేతనాన్ని రెట్టింపు చేయాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు. వేతనాలకు వార్షిక ఇంక్రిమెంట్, సర్వీస్ వెయిటేజీ గురించి కూడా కోరామన్నారు. చాలా రాష్ట్రాల్లో అంగన్‌వాడీ సహాయకులు కార్మికుల వేతనంలో సగం మాత్రమే పొందుతున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. గుజరాత్ హైకోర్టు అంగన్‌వాడీ కార్మికులు, సహాయకులను క్రమబద్ధీకరించాలని ఆదేశించిందని, ప్రభుత్వం కోర్టులో ఈ ఉత్తర్వును వ్యతిరేకించకూడదని తాము కోరామని తెలిపారు. వచ్చే బడ్జెట్ నాటికి నెలకు రూ.26 వేల కనీస వేతనాలు, పెన్షన్ రూ.10 వేలు అమలు చేయాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గ్రాట్యుటీ, ఈఎస్‌ఐ, పీఎఫ్ తదితర అంశాలను లేవనెత్తామన్నారు.
బీఎల్‌వో డ్యూటీతో సహా ఐసీడీఎస్ కాని అదనపు పనులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు. అంగన్‌వాడీ కార్మికులు, సహాయకుల పదోన్నతికి సంబంధించిన పరిమితులను తొలగించే ఏకరీతి సేవా నియమాలపైన చర్చించామన్నారు. గ్రాట్యుటీపై సుప్రీంకోర్టు ఆదేశాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారని అన్నారు. వేతనం పెంచాలనే డిమాండ్‌ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని, పదోన్నతి మొదలైన వాటికి సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారన్నారు. కేంద్ర కార్మిక సంఘాలకు అనుబంధంగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల సంఘాలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
డిమాండ్లు
– ఐసీడీఎస్ స్వర్ణోత్సవాన్ని పురస్కరించు కుని పార్లమెంటరీ కమిటీ సిఫారసుల ప్రకారం 2025 అక్టోబర్ 2 నాటికి అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనాలను రెట్టింపు చేయాలి.
– అంగన్‌వాడీ సేవలకు పెండింగ్‌లో ఉన్న కేంద్ర వాటాను రాష్ట్రాలకు వెంటనే విడుదల చేయాలి.
– గుజరాత్ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లను గ్రేడ్ ..×××, గ్రేడ్ ..×V ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలి. 45వ ఐఎల్‌సీ సిఫారసును అమలు చేయాలి. కనీస వేతనాలు నెలకు రూ.26,000, పెన్షన్ నెలకు రూ.10,000, ఈఎస్‌ఐ, పీఎఫ్ ఇవ్వాలి.
– దేశవ్యాప్తంగా అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు ఏకరీతి సేవా నిబంధనలను వర్తింపజేయాలి.
– అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు గ్రాట్యుటీపై సుప్రీంకోర్టు ఆదేశాన్ని వెంటనే అమలు చేయాలి.
– ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ప్రారంభ బాల్య సంరక్షణ, విద్య (ఈసీసీఈ) హక్కు, అంగన్‌వాడీ కేంద్రాలు నోడల్ ఏజెన్సీలుగా ఉన్న అన్ని మహిళలకు ప్రసూతి ప్రయోజనం హక్కును నిర్ధారించడానికి ఒక చట్టాన్ని రూపొందించాలి. ఎన్‌ఈపీని ఉపసంహరించుకోవాలి. ఈసీసీఈని అధికారిక విద్యా వ్యవస్థతో అనుసంధానించకూడదు.
– ఈసీసీఈ చట్టం ప్రకారం ఐసీడీఎస్ (సాక్షమ్ అంగన్‌వాడీ, పోషన్ 2.0) ని అంగన్‌వాడీ కమ్ క్రెచ్‌లుగా పెట్టాలి. సరైన మౌలిక సదుపాయాలు, అవసరమైన మానవ వనరులతో స్థానిక అవసరాలను చూడాలి.
– తప్పనిసరి ఎఫ్‌ఆర్‌ఎస్‌ని వెంటనే ఉపసంహరించుకోవాలి. అంగన్‌వాడీ రిపోర్టింగ్ సిస్టమ్ డిజిటలైజేషన్ అమలుకు ముందు అన్ని అంగన్‌వాడీ కేంద్రాలలో కంప్యూటర్/ ల్యాప్‌టాప్/ ట్యాబ్ అందించాలి. దీని కోసం 4జీ/5జీ కనెక్షన్‌తో మంచి నాణ్యత గల మొబైల్ ఫోన్‌లను అందించాలి. అంగన్‌వాడీ కేంద్రాలలో ఉచిత వైఫై కనెక్షన్ అందించాలి. సుప్రీం కోర్టు ఆర్డర్ ప్రకారం ఆధార్ ధ్రువీకరణ లేదా ముఖ గుర్తింపుతో సంబంధం లేకుండా లబ్దిదారులకు నాణ్యమైన అనుబంధ పోషకాహారాన్ని అందించాలి.
– డేటా తారుమారుతో సహా పోషన్ ట్రాకర్ యాప్‌కు సంబంధించిన సమస్యలను చర్చించడానికి అన్ని అంగన్‌వాడీ సమాఖ్యలతో వెంటనే త్రైపాక్షిక సమావేశం నిర్వహించాలి.
– లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ, పథకాల ప్రయోజనాల కోసం ఆధార్‌ను తప్పనిసరి లింక్ చేయడం, పథకాల డిజిటలైజేషన్ పేరుతో లక్ష్యాన్ని నిర్దేశించడం, నిఘా, కేంద్రీకృత వంటగదిని ప్రవేశపెట్టడంతో ప్రయివేటీకరణ వంటి ఐసీడీఎస్‌ని బలహీనపరిచే అన్ని చర్యలను ఉపసంహరించుకోవాలి.