– భారత్-అమెరికా మధ్య కుదరని వాణిజ్య ఒప్పందం
– తప్పుడు అంచనాలు, సంకేతాలతో పెరిగిన దూరం
– అనేకాంశాలపై తలవంచినా ససేమిరా అన్న ట్రంప్
భారత్, అమెరికా మధ్య పలు దఫాలుగా వాణిజ్య చర్చలు జరిగినప్పటికీ అవి చివరికి విఫలమయ్యాయి. అమెరికాతో సానుకూల ఒప్పందం కుదురుతుందని, సుంకాలను పదిహేను శాతానికి పరిమితం చేసే అవకాశం ఉన్నదని ఐదు రౌండ్ల చర్చల అనంతరం భారత అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు మీడియాకు సంకేతాలు కూడా ఇచ్చారు. గడువు తేదీకి (ఈ నెల 1వ తేదీ) ముందు ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటన చేస్తారని వారు భావించినప్పటికీ అది జరగలేదు. ఇప్పుడు మనకు మిగిలింది ఏమిటి? రేపటి నుంచి భారత దిగుమతులపై అమెరికా ప్రభుత్వం ఇరవై ఐదు శాతం సుంకాలు విధించబోతోంది. రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నందుకు జరిమానా కూడా విధిస్తానని ట్రంప్ ప్రకటించారు. అది ఏ మేరకు ఉంటుందో చెప్పలేదు. భారత్ మంచి వాణిజ్య భాగస్వామి కాదని, ఆ దేశంపై భారీగా సుంకాలు విధిస్తానని ఆయన తాజాగా ఓ ప్రకటన కూడా చేశారు.
న్యూఢిల్లీ : జపాన్, ఈయూతో భారీ ఒప్పందాలు కుదుర్చుకున్న ట్రంప్ మన దాయాది దేశమైన పాక్‌తో కూడా ఒప్పందంపై సంతకాలు చేశారు. పాక్ వస్తువులపై సుంకాలను 19 శాతానికి తగ్గించారు. అలాంటిది భారత్, అమెరికా మధ్య ఎందుకు ఒప్పందం కుదరలేదనే విషయంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా సరిగా అంచనా వేయకపోవడం, తప్పుడు సంకేతాలు, అభిప్రాయ బేధాలే ప్రపంచంలో మొదటి, ఐదవ ఆర్థిక వ్యవస్థల మధ్య ఒప్పందం కుదరకపోవడానికి కారణమని రెండు దేశాలకు చెందిన అధికారులు తెలిపారు. ప్రస్తుతం భారత్, అమెరికా మధ్య 190 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతోంది.
రాయితీలపై సంసిద్ధత తెలిపినా…
వాణిజ్య మంత్రి పీయుష్ గోయల్ అమెరికాలో పర్యటించి వచ్చారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ న్యూఢిల్లీలో పర్యటించి వెళ్లారు. ఈ పర్యటనల కారణంగా ఒప్పందం కుదురుతుందని, పలు రాయితీలు వస్తాయని భారత్ భావించింది. అమెరికా నుంచి భారత్‌కు జరుగుతున్న దిగుమతులలో 40 శాతం పారిశ్రామిక వస్తువులే. వీటిపై మన దేశం జీరో టారిఫ్ విధించేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధపడింది. దేశీయంగా ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ మోడీ ప్రభుత్వం అమెరికా ఉత్పత్తులపై సుంకాలను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. ముఖ్యంగా అమెరికా కార్లు, ఆల్కహాల్‌పై టారిఫ్ తగ్గించేందుకు సంసిద్ధత తెలిపింది. అమెరికా డిమాండ్ మేరకు ఎక్కువగా ఇంధన, రక్షణ దిగుమతులు చేసుకునేందుకు కూడా ఓకే చెప్పింది. వాషింగ్టన్‌లో ఐదో రౌండ్ చర్చల తర్వాత అనేక విభేదాలు పరిష్కారమయ్యాయని, దీంతో ఒప్పందంపై ఆశలు పెరిగాయని భారత అధికారులు తెలిపారు. అమెరికా నుంచి సుంకం లేకుండా వ్యవసాయ, పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడంపై భారత్ వ్యక్తం చేసిన అభ్యంతరాలను అమెరికా అర్థం చేసుకుంటుందని కూడా వారు భావించారు.
మోడీ దిగివచ్చినా…
తమ ప్రతి డిమాండ్‌కు భారత్ తల వంచడంతో ట్రంప్ రెచ్చిపోయారు. మరిన్ని రాయితీలు కోరారు. దీంతో కథ అడ్డం తిరిగింది. ‘భారత్‌తో జరిగిన చర్చల్లో అనేక అంశాలపై పురోగతి కన్పించింది. కానీ ఒప్పందం మాత్రం కుదరలేదు’ అని అమెరికా అధ్యక్ష భవనం అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఫిబ్రవరిలో ప్రధాని మోడీ వాషింగ్టన్‌లో పర్యటించారు. గడవులోగా ఒప్పందం కుదుర్చుకునేందుకు అంగీకరించారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసేందుకు…అంటే 500 బిలియన్ డాలర్లకు పెంచేందుకు కూడా సుముఖత చూపారు. 47 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులలో వాణిజ్య అంతరాన్ని తగ్గించేందుకు పాతిక బిలియన్ డాలర్ల వరకూ అమెరికా ఇంధనాన్ని కొనుగోలు చేసేందుకు, రక్షణ దిగుమతులను పెంచేందుకు కూడా భారత్ ఓకే చెప్పింది.
కొంపముంచిన అతి విశ్వాసం
భారత్‌తో ‘పెద్ద’ ఒప్పందం కుదరబోతోందంటూ ట్రంప్ చేసిన ప్రకటన మన అధికారుల నమ్మకాన్ని బాగా పెంచింది. ట్రంప్ ప్రకటనతో సానుకూల ఒప్పందం చేతికి వచ్చినట్లేనని అనుకున్నారు. దీంతో భారత్ తన వైఖరిని కఠినతరం చేసింది. ముఖ్యంగా వ్యవసాయ వస్తువులు, డెయిరీ దిగుమతులపై పట్టు వీడలేదు. అయితే జపాన్, ఈయూతో అమెరికా భారీ ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత భారత్ తన అంచనాలను కుదించుకుంది. కానీ ట్రంప్‌కు అవి ఆమోదయోగ్యం కాలేదు. ట్రంప్, మోడీ మధ్య వాణిజ్య ఒప్పందంపై నేరుగా చర్చలు జరగకపోవడం కూడా ప్రస్తుత పరిస్థితికి కారణమని ఓ అధికారి వ్యాఖ్యానించారు. చర్చల ప్రక్రియను భారత అధికారులు సరిగా ముందుకు తీసుకుపోలేకపోవడాన్ని మరో అధికారి ప్రస్తావించారు. పాకిస్తాన్‌పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా ఒప్పందానికి ప్రతిబంధకంగా మారాయి.
ఒప్పందంపై ఇప్పటికీ అవకాశం
వియత్నాం, ఇండోనేషియా, జపాన్, ఈయూతో అమెరికా మెరుగైన ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత మనం అవసరమైన దౌత్య మద్దతును కోల్పోయామని ఒక అధికారి చెప్పారు. కాగా అమెరికా ప్రతినిధి బృందం ఈ నెలాఖరుకు న్యూఢిల్లీలో పర్యటించబోతోంది. ఒప్పందం కుదిరే అవకాశాలు ఇప్పటికీ ఉన్నాయని ప్రభుత్వ అధికారులు విశ్వసిస్తున్నారు. అమెరికా అధ్యక్ష భవనం అధికారి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వ్యవసాయం, డెయిరీ రంగాలలో రాయితీలు కల్పించే అవకాశాలు ఉన్నాయా అనే విషయాన్ని ప్రభుత్వం పున్ణపరిశీలిస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించుకొని, అమెరికా నుంచి కొనుగోలు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తారని అధికారి ఒకరు చెప్పారు.
డామిట్.. కథ అడ్డం తిరిగింది!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES