ఈసీని ఆదేశించిన సుప్రీం
న్యూఢిల్లీ : బీహార్ ఓటర్ల ముసాయిదా జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలను, తొలగించడానికి గల కారణాలను అందజేయాలని సుప్రీంకోర్టు బుధవారం ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్‌లో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) పేరుతో చేపట్టిన ప్రక్రియలో భాగంగా ఆగస్టు 1న ముసాయిదా జాబితాను ఈసీ ప్రచురించింది. ఈ వివరాలన్నింటినీ 9వ తేదీకల్లా అందజేయాలని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ ఈసీని ఆదేశించింది. దీనిపై విచారణను 12వ తేదీకి వాయిదా వేసింది. బీహార్‌లో ఎస్‌ఐఆర్‌ను సవాలు చేస్తూ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్)అనే ఎన్‌జిఓ గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. తాజాగా ముసాయిదా ఓటర్ల జాబితాలో తొలగించిన వారి వివరాలు వెల్లడించాలంటూ మరో పిటిషన్ దాఖలు చేసింది. దానిపై బుధవారం విచారణ జరిపిన సుప్రీం పై ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల పేర్లు తొలగించడానికి వివిధ రకాల కారణాలు ఉండొచ్చునని, చనిపోవడం లేదా రాష్ట్రం నుంచి శాశ్వతంగా బయటకు వెళ్ళిపోవడం, రెండు చోట్ల పేర్లు వుండడం, ఎక్కడున్నారో తెలియకపోవడంవంటి పలు కారణాలు వుండొచ్చు నని ఆ పిటిషన్ పేర్కొంది. అయితే, తొలగించిన ప్రతి పేరుకు గల కారణాలను విడివిడిగా చూపలేదు. నియోజకవర్గాల వారీగా లేదా బూత్‌ల వారీగా ఏ విధంగానైనా ముసాయిదాలో చూపలేదని పేర్కొంది. నిర్దిష్ట కారణాలతో తొలగించిన ఓటర్ల వివరాలను అసెంబ్లీ, బూత్‌ల వారీ జాబితా వారీగా అందజేయాలని కోరింది.
తొలగించిన పేర్ల జాబితాను కొన్ని రాజకీయ పార్టీలకు అందజేశారని, అయితే వాటివల్ల ఉపయోగం లేకుండా పోయిందని పిటిషనర్ల తరపున ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. ఇలాంటి తొలగింపులకు గల కారణాలు ఇవ్వనందున వాటిని క్రాస్ చెక్ చేసుకోవడానికి కూడా వీల్లేకుండా పోయిందని అన్నారు. ‘బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌ఓ) సిఫారసు చేయలేదు’ అని గుర్తించబడిన ఎన్యూమరేషన్ ఫారాల ఓటర్ల వివరాలను అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా, బూత్‌ల వారీగా ప్రచురించాల్సిందిగా పిటిషనర్లు కోరారు. దర్భంగా, కైమూర్ జిల్లాలకు సంబంధించిన సమాచారం చూసినట్లైతే బీఎల్‌ఓ సిఫారసు చేయలేదు అని రాసిన ఎన్యూమరేషన్ ఫారాలను పెద్ద సంఖ్యలో అప్‌లోడ్ చేశారని పిటిషనర్ల తరపున ప్రశాంత్ భూషణ్ తెలిపారు. దర్భంగా, కైమూర్ జిల్లాల్లో వరుసగా 10.6, 12.6శాతం మందికి ఇలా బీఎల్‌ఓ సిఫారసు చేయలేదనే ముద్ర వేసి వుందని పేర్కొన్నారు.
ఆ 65 లక్షల మంది ఓటర్ల వివరాలివ్వండి
- Advertisement -
- Advertisement -