– 80 మంది పిల్లలను విక్రయించినట్టు గుర్తింపు
– తిరిగి కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫర్టిలిటీ సెంటర్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో ప్రధాన నిందితురాలు, ఆ కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆమెను ఐదు రోజులపాటు కస్టడీకి తీసుకుని విచారించిన గోపాలపురం పోలీసులు సృష్టిలో మోసాలపై పలు కీలక విషయాలు రాబట్టినట్టు తెలిసింది. మంగళవారం పోలీసు కస్టడీ ముగియడంతో ఆమెను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి, తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే, కేసుకు సంబంధించిన పూర్తి స్థాయిలో వివరాలను పోలీసులు సేకరించలేకపోవడంతో తిరిగి మరోసారి నమ్రతను కస్టడీకి తీసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా బుధవారం నమ్రతను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. ఇదిలావుండగా, ఈ కేసులో బినామీ డాక్టర్ విద్యుల్లత విదేశాలకు పారిపోయేందుకు సిద్ధమవ్వగా పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకుని విచారించి సృష్టిలో మోసాలపై కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. 86 మంది దంపతులను సరోగసీకి ఒప్పించిన డాక్టర్ నమ్రత, ఒక్కో జంట నుంచి రూ.30 నుంచి రూ.50 లక్షల వరకు వసూలు చేసినట్టు గుర్తించారు. దాదాపు 80మంది పిల్లలను నమ్రత విక్రయించినట్టు తెలిసింది. వేర్వేరు ప్రాంతాలు, రాష్ట్రాల్లో పిల్లలను కొనుగోలు చేసినట్టు విచారణలో అంగీకరించినట్టు సమాచారం. పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయిస్తుండగా ఇప్పటికే నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ కేసులో తాజాగా 9 మందిని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.
ప్రముఖ గైనకాలజిస్ట్ లెటర్‌హెడ్‌లు వాడిన నమ్రత
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. సికింద్రాబాద్‌కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కన్సల్టెంట్‌గా పనిచేసిన వైద్యురాలి లెటర్‌హెడ్‌లను నమ్రత ఉపయోగించి పలువురికి ఇంజక్షన్లు, మందులు ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. తన పేరుతో ఉన్న లెటర్‌హెడ్ చూసి సదరు గైనకాలజిస్ట్ ఆశ్చర్యానికి గురయ్యారని తెలిసింది. నమ్రతపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు నమ్రత సరోగసీ పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడినట్టు గుర్తించారు.
‘సృష్టి’ డా.నమ్రత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES