Thursday, August 7, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుచలో హైదరాబాద్‌ ఉద్రిక్తం

చలో హైదరాబాద్‌ ఉద్రిక్తం

- Advertisement -

– బలవంతంగా మధ్యాహ్న భోజన కార్మికుల అరెస్టు
– ఓ కార్మికురాలి చేతికి గాయం, ఆస్పత్రికి తరలింపు
– విడతలవారీగా రావడంతో పోలీసుల ఉరుకులు పరుగులు
– వేతనాలివ్వకుంటే మీరు పని చేస్తారా? జీతమడిగితే అరెస్టులేంది? అంటూ ప్రశ్నించిన కార్మికులు
– పాలడుగు భాస్కర్‌, ఎస్వీ.రమ గృహ నిర్బంధం
– పోలీసులమయంగా స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కార్యాలయ పరిసరాలు
– పోలీసుల బందోబస్తు మధ్య అదనపు డైరెక్టర్‌కు సీఐటీయూ నేతల వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

మధ్యాహ్న భోజన కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం తలపెట్టిన చలో హైదరాబాద్‌ (స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనరేట్‌ ఎదుట ధర్నా) కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. ముఖ్యనేతలను ఇండ్లల్లో నిర్బంధించినా… జిల్లాల్లో ఎక్కడికక్కడా అరెస్టులు చేసినా..హైదరాబాద్‌కు వెళ్తే కేసులు బుక్‌ చేస్తామని పోలీసులు బెదిరించినా…కనిపించినోళ్లను కనిపించినట్టు బలవంతంగా వాహనాల్లో కుక్కి పోలీస్‌ స్టేషన్లకు తరలించినా మధ్యాహ్న భోజన కార్మికులు పోరాట పటిమను వీడలేదు. సచివాలయం, అరణ్యభవన్‌. టెలిఫోన్‌ భవన్‌, ఏజీ ఆఫీస్‌ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించినా స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనరేట్‌ కార్యాలయం సమీపంలోకి ఒక్కసారిగా వంద మందికిపైగా కార్మికులు దూసుకొచ్చారు. అక్కడే రోడ్డుపై బైటాయించారు. ‘మీకు ఒక నెల జీతమివ్వకుంటే పనిచేస్తారా? జీతమడిగితే అరెస్టులు చేసుకుంట పోతరా? మా గోడును అధికారులకు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వరా? ఇదేం న్యాయం’ అంటూ పోలీసులపై మధ్యాహ్న భోజన కార్మికులు తమ మాటల తూటాలను ఎక్కుపెట్టారు. వారిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి నాంపల్లి, బేగంబజార్‌, ముషీరాబాద్‌ తదితర పోలీస్‌స్టేషన్లకు తరలించారు. బస్సులో వస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులను పోలీసులు సచివాలయం సమీపంలో అదుపులోకి తీసుకునే క్రమంలో మంచిర్యాల జిల్లాకు చెందిన దాసరి రాజేశ్వరి కిందపడి చేతికి గాయమైంది. చేయి మొత్తం వాయడంతో పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. మంచిర్యాల, ఆదిలాబాద్‌, కొమ్రంభీమ్‌ తదితర జిల్లాల నుంచి రెండో విడతగా వచ్చిన మధ్యాహ్న భోజన కార్మికులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎస్‌లకు తరలించారు. ‘మేం గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నామా? రెండుమూడు వేల వేతనంతో ఎవరైనా బతుకుతారా? పుస్తెలతాళ్లు అమ్ముకుని పిల్లలకు వంట చేసి పెడుతున్న మాపై ఈ దౌర్జన్యమేంటి? ఆరు నెలల నుంచి కోడిగుడ్ల పైసలిస్తలేరు? యాడికెళ్లి తెచ్చిపెట్టాలే? మీ జేబుల్లోంచి ఖర్చుపెడతరా? 15, 20 ఏండ్ల సంది పని చేస్తున్నం..ఎన్నడైనా పర్మినెంట్‌ కాకపోతదా అన్న చిన్న ఆశతో పనిచేస్తున్నాం. రేవంత్‌రెడ్డి సారే మాకు పదివేల రూపాయల జీతమిస్తమన్నడు.

అధికారంలోకి వచ్చిండు కదా ఎందుకిస్తలేడు?’ అంటూ మహిళా కార్మికులు సంధించిన ప్రశ్నలు అటుగా వెళ్లేవారితోపాటు పోలీసులను సైతం ఆలోచింప జేశాయి. ‘మేం మా విధుల్ని నిర్వర్తిస్తున్నాం. మీపై మాకేం కోపం లేదు’ అంటూ పోలీసులు సర్దిజెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆటోల్లో వెళ్లేవారిని సైతం అనుమానంగా ప్రశ్నించడం కనిపించింది. రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళను ‘నడువు పోలీసు వాహనం ఎక్కు’ అని ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఆ మహిళ ఒకింత అసహనానికి గురై తన ఐడీ ప్రూఫ్‌లను చూపించి వెళ్లిపోయిన పరిస్థితి కనిపించింది. అదే సమయంలో లక్డీకాపూల్‌ వైపు నుంచి వచ్చిన రంగారెడ్డి జిల్లాకు చెందిన మధ్యాహ్న భోజన కార్మికులను టెలిఫోన్‌ భవన్‌ ఎదుట ఉన్న బస్టాప్‌లో పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. ఓవైపు మధ్యాహ్న భోజన కార్మికులు విడతల వారీగా వస్తుండటం, మరోవైపు పోలీసుల ఉరుకుల పరుగులతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనరేట్‌ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం తర్వాత విద్యాశాఖ అధికారులకు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు పాలడుగు భాస్కర్‌, తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ.రమ, అధ్యక్షులు వై.స్వప్న, సీఐటీయూ కార్యదర్శి పి.శ్రీకాంత్‌, ఆఫీస్‌ బేరర్లు ఇందూరి సులోచన, సత్యనారాయణ, కృష్ణమాచారి, సుల్తాన్‌, శారద, రాజేశ్వరి, రాధ తదితరుల బృందంతో వినతిపత్రం ఇప్పించేందుకు పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో ఆ బృందం స్కూల్‌ ఎడ్యుకేషన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ మదన్‌మోహన్‌కు వినతిపత్రం అందజేసింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్న కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి పాలడుగు భాస్కర్‌, ఎస్వీ.రమ తీసుకెళ్లారు. సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీనిచ్చారు. 15 రోజుల్లో సమస్యలు పరిష్కరించకుంటే పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని భాస్కర్‌ నొక్కి చెప్పారు.

అరెస్టయిన వారిని పరామర్శించిన డీజీ, ఆశయ్య
అరెస్టు అయిన ముషీరాబాద్‌ పీఎస్‌లో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులను సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు డీజీ. నరసింహారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య, తదితరులు పరామర్శించారు. పోలీసులు నెట్టేయడంతో కిందపడి చెయ్యికి గాయమై ఇబ్బంది పడుతున్న రాజేశ్వరితో మాట్లాడారు. ముషీరాబాద్‌ సీఐతో డీజీ నరసింహారావు మాట్లాడి ఆమెకు వైద్యసేవలు అందించాలని కోరారు. దీంతో పోలీసులు వెంటనే ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఆమెకు వైద్యం అందించారు. అక్రమ అరెస్టు చేసిన కార్మికులందరినీ విడుదల చేయాలని పోలీసు ఉన్నతాధికారులను డీజీ కోరారు. మధ్యాహ్న భోజన కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే సానుకూలంగా స్పందించి సానుభూతితో పరిష్కరించాలనీ, పెండింగ్‌ బిల్లులను విడుదల చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
మధ్యాహ్నం వరకు గృహ నిర్బంధంలో పాలడుగు భాస్కర్‌, ఎస్వీ.రమ, జేవీ, తదితరులు
స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనరేట్‌ ఎదుట ధర్నా నేపథ్యంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ఎస్వీ.రమను వారి ఇండ్లల్లోనే పోలీసులు నిర్బంధిం చారు. వారి ఇండ్ల ఎదుట పోలీసులు పహారా కాశారు. మధ్యాహ్నం వరకు ఇంటి నుంచి బయటకు రానివ్వలేదు. భద్రాద్రి కొత్తగూడెంలో ఆ యూనియన్‌ నేత బ్రహ్మచారిని మంగళవారం రాత్రి నుంచి బయటకు రానివ్వలేదు.

అక్రమ అరెస్టులను ఖండిస్తూ నేడు నిరసనలు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం : పాలడుగు భాస్కర్‌
తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అనుమతివ్వాలని పది రోజుల కిందనే మధ్యాహ్న భోజన కార్మికులు కోరినా వారు నిరసన తెలిపే హక్కును కాలరాయడం దుర్మార్గమని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ అన్నారు. సీఐటీయూ నేతలను గృహనిర్బంధం చేయడం, మధ్యాహ్న భోజన కార్మికులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలనీ, ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేయాలని సీఐటీయూ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కార్యాలయం ఎదుట మీడియా తో ఆయన మాట్లాడుతూ… నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ మహిళలు అనే విచక్షణ కూడా లేకుండా అరెస్టు చేయడమేంటని ప్రశ్నిం చారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ఐదు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదనీ, 10 నెలల కోడిగుడ్ల బిల్లులు, వంట బిల్లులను పెండింగ్‌లో పెట్టిందని తెలిపారు. ప్రభుత్వం గుడ్లకు ఇచ్చే బడ్జెట్‌కి రెండు గుడ్లు కూడా రావనీ, మూడు గుడ్లు పెట్టడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. పెండింగ్‌ వేతనాల బిల్లులు చెల్లించాలని అధికారుల చుట్టూ కార్మికులు చెప్పులు అరిగేలా తిరిగినా ఫలితం లేకపోవడంతో ఈ ధర్నాకు పిలుపునిచ్చామన్నారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ సక్రమంగా సాగాలంటే బకాయి వేతనాలు, బిల్లులు తక్షణమే చెల్లించాలనీ, గ్రీన్‌ ఛానల్‌ ద్వారా కార్మికుల వ్యక్తిగత బ్యాంక్‌ అకౌంట్లో డబ్బులు వేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ.రమ మాట్లాడుతూ..కట్టెల పొయ్యి మీద వంట చేయొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారనీ, వారికి ఇచ్చే రూ.3 వేల వేతనంతో నాలుగైదు సిలిండర్లు ఎలా కొంటారని ప్రశ్నించారు. ఇది ఎలా న్యాయమనిపిస్తోందని నిలదీశారు. ప్రభు త్వానికి బాధ్యతే లేదన్నట్టు వ్యవహరించడం తగదన్నారు. ప్రతి పాఠశాలకూ అవసరమైన గ్యాస్‌ ను ఉచితంగా సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. కొత్త మెనూ తీసుకువచ్చి రెండు రకాల కూరలు పెట్టాలని, సాంబారు, రాగి జావ పోయా లని కార్మికులపై ఒత్తిడి చేయడం సబబు కాదని అన్నారు. కేటాయించిన బడ్జెట్‌ పాత మెనూకే సరిపోవడం లేదనీ, కొత్త మెనూ ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img