Thursday, August 7, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంబీసీ రిజర్వేషన్లకు మోడీనే అడ్డంకి

బీసీ రిజర్వేషన్లకు మోడీనే అడ్డంకి

- Advertisement -

– 42శాతం రిజర్వేషన్లు సాధించేవరకు నిద్రపోం
– ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద దీక్షలో సీఎం రేవంత్‌ రెడ్డి
– ప్రొఫెసర్‌ జయశంకర్‌, గద్దర్‌కు నివాళ్లు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు ప్రధాని మోడీనే అడ్డంకి అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఈ విషయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ బీసీ బిల్లులకు ఆమోదం తెలపకుండా అడ్డు పడుతున్నారని ఆరోపించారు. ‘బిల్లులు ఆమోదం తెలిపేందుకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ అడిగి చాలా రోజులైంది.. ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి సమాధానం రాలేదు. ఇదీ శోచనీయం. రేపటిలోగా అపాయింట్‌మెంట్‌ ఇచ్చి, సమస్యను విని పరిష్కరిస్తా రని ఆశిస్తున్నాం. నరేంద్ర మోడీ తాజాగా రాష్టపతిని కలిశారు. బీసీ బిల్లులపై అపాయింట్‌ మెంట్‌ ఇవ్వొద్దని రాష్ట్రపతిపై ఏమైనా ఒత్తిడి చేశారా..! కావొచ్చు.. బలహీన వర్గాలన్నీ ఆలోచన చేయాలి’ అని ముఖ్యమంత్రి అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనలో తెలంగాణ ప్రజల శక్తిని తక్కువగా అంచనా వేయొద్దని, బీసీ బిల్లులకు ఆమోదం తెలపకపోతే ప్రధాని మోడీకి తెలంగాణ తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లను ఆమోదిస్తారా? గద్దె దిగుతారా? అని నిలదీశారు. బుధవారం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వేదికగా నిర్వహించిన కాంగ్రెస్‌ పోరుబాటలో ప్రధాని మోడీ టార్గెట్‌గా సీఎం రేవంత్‌ రెడ్డి కీలక కామెంట్లు చేశారు. ‘నరేంద్రమోడీకి జంతర్‌ మంతర్‌ చౌరస్తా నుంచి సవాల్‌ విసురుతున్నా.. మా డిమాండ్‌ను ఆమోదిస్తారా? లేదంటే మిమ్మల్ని గద్దెదించి, ఎర్రకోట మీద మూడు రంగుల జెండా ఎగరేసి, రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసి, 42శాతం బీసీ రిజర్వేషన్లు సాధించుకోమంటారా? ఏది ఏమైనా బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు మేం నిద్రపోం..’ అని హెచ్చరించారు. ‘అయ్యా.. నరేంద్రమోడీగారూ.. మీ గుజరాత్‌ నుంచి గుంట భూమి అడగలే. మీ పోరుబందర్‌ పోర్ట్‌ నుంచి గుక్కెడు నీళ్లడగలే.. మా తెలంగాణలో మా గడ్డ మీద బలహీనవర్గాలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చుకుంటామంటే మీ గుజరాత్‌ వాళ్లకు వచ్చిన కడుపు మంట ఏంటి? రిజర్వేషన్ల కోసం బిల్లులు ఆమోదించి.. 4.5 కోట్ల మంది ప్రజలు విజ్ఞప్తి చేస్తే మా బిల్లులను తుంగలో తొక్కే అధికారం మీకెవరిచ్చారని అడుగుతున్నా.. ‘ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

మా పోరాటం మోడీతోనే…
‘మన పోరాటం.. రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న చంద్రశేఖర్‌రావుతోనో, కిషన్‌ రెడ్డితోనో, బండి సంజరుతోనో, రాంచందర్‌రావుతోనో కాదు.. మన పోరాటం కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోడీతో..’ అని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ‘బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్న ఆలోచన నరేంద్రమోడీకి లేదు.. కానీ ఆయన మోచేతి నీళ్లు తాగుతున్న కిషన్‌ రెడ్డి, బండి సంజరు, రాంచందర్‌రావుకు ఏమైంది? మీరు మళ్లీ తెలంగాణకు రారా? తెలంగాణ ఓట్లు మీకు అవసరం లేదా? బీఆర్‌ఎస్‌ తెంపుకున్నట్టే తెలంగాణ రాష్ట్ర ప్రజలతో మీ పేగు బంధం తెంపుకున్నారా? ‘ అని ప్రశ్నించారు.

సాధించి తీరుతాం…
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్యా ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించి తీరుతామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ బిల్లులు ఆమోదం పొందే వరకు తాము నిద్రపోమని స్పష్టం చేశారు. బలహీన వర్గాలపై కక్ష గట్టిన గత సీఎం కేసీఆర్‌ 50 శాతం రిజర్వేషన్లు మించకుండా చట్టం చేశారని విమర్శించారు. ‘నాడు కేసీఆర్‌ చేసిన చట్టం నేడు రిజర్వేషన్లకు గుదిబండగా మారింది. తెలంగాణలో బలహీన వర్గాల బిడ్డలు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు కాకుండా అడ్డుగా ఉన్న ఈ చట్టాన్ని తొలగించాలని తాము ఆర్డినెన్స్‌ చేసి గవర్నర్‌కు పంపాం. దానిని ఆమోదించడం లేదు. వెనుకబడిన వర్గాలకు స్థానిక ఎన్నికల్లో… విద్యా, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు ఢిల్లీలో ధర్నాకు దిగాం. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సాధించి తీరుతాం’ అని ముఖ్యమంత్రి అన్నారు.
42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధనకు తెలంగాణలోనైనా ధర్నా చేయొచ్చని… కానీ అక్కడ ధర్నా చేస్తే స్థానిక పార్టీలు మాత్రమే వస్తాయని.. అందుకే ఢిల్లీలో ధర్నా చేస్తున్నామని సీఎం రేవంత్‌ తెలిపారు. ఢిల్లీలో చేపట్టిన ధర్నాలో కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎంపీలతో పాటు ఇండియా బ్లాక్‌లోని సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, ఎన్సీపీ, వామపక్షాలకు చెందిన వంద మంది ఎంపీలు పాల్గొని సంఘీభావం తెలియజేశారని ఆయన తెలిపారు.
బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఆ నలుగురు…. అడ్డు

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌, కిషన్‌ రెడ్డి, బండి సంజరు, రాంచందర్‌రావులు బీసీ రిజర్వేషన్ల పెంపునకు అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వీళ్లకు తెలంగాణ బీసీల అవసరం లేదా? అని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు ధర్నాను కేటీఆర్‌ డ్రామా అంటున్నారని… కేటీఆర్‌ పేరే డ్రామారావని… కేసీఆర్‌ కుటుంబం డ్రామాలతో బతుకుతోందని ముఖ్యమంత్రి విమర్శించారు. అధికారం, పదవులు పోయినా కేటీఆర్‌ బుద్ధి మారలేదని.. అహంకారం తగ్గలేదని అన్నారు.
రిజర్వేషన్ల పెంపు బిల్లులను ఆమోదించకుంటే ఇక ఢిల్లీ రాకుండా… గల్లీకి వచ్చిన బీజేపీ నేతలను పట్టుకుంటామని హెచ్చరించారు. దళితులు, గిరిజనులకు అండగా నిలిచి ఇందిరా గాంధీ దేశ ప్రజల గుండెల్లో ఇందిరమ్మగా నిలిచిపోయరని సీఎం కొనియాడారు. ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ వారసునిగా వచ్చిన రాహుల్‌ గాంధీ బీసీలకు న్యాయం చేసేందుకు కంకణం కట్టుకున్నారని, ఆయన మహత్తర ఆశయాలకు అడ్డుతగిలితే వారి చిరునామా గల్లంతవుతుందని హెచ్చరించారు. ప్రధాని మోడీకి చిత్తశుద్ది ఉంటే రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లులు తక్షణమే ఆమోదం పొందేలా చూడాలని.. లేకుంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు బీజేపీకి, మోడీకి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

బీజేపీ చెప్పేదొకటి.. చేసేదొకటి
బీజేపీ చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ధర్నా సందర్భంగా ఆయన ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడారు. ‘దేశంలో చేపట్టబోమే జనగణన విషయంలో మోడీ హామీని నమ్మలేం. అందుకోసం లోకసభ, రాజ్యసభలో చర్చ జరగాలి. అందులో ఎలాంటి ప్రశ్నలు ఉంచాలి. తెలంగాణలో మేం 8 పేజీలు 56 ప్రశ్నలు ఉంచి అమలు చేశాం.’ అని అన్నారు. ఎడ్యుకేషన్‌, ఎంప్లారుమెంట్‌, పొలిటికల్‌ రిజర్వేషన్‌ పంచాయతీ మెంబర్ల నుంచి పార్లమెంట్‌ వరకు ఎవరికీ ఎంత వాటా దక్కాలన్న ఈ విషయంపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందేనని చెప్పారు. అలా జరగకుండా బీజేపీ, ఎన్‌డీఏ మోసం చేస్తున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ధర్నా చేస్తోన్న బీజేపీకి కనువిప్పు కలగడం లేదని ఫైర్‌ అయ్యారు. పార్లమెంట్‌లో కూడా మల్లిఖార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ నేతృత్వంలో ధర్నాలు చేపట్టి రిజర్వేషన్లు సాధిస్తామన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో డిప్యూటీ భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, సీతక్క, వివేక్‌ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, పీసీసీ అధ్యక్షులు మహేశ్‌ గౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మెన్‌లు, బీసీ సంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రొ. జయశంకర్‌, గద్దర్లకు సీఎం నివాళి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం, ప్రజలు ఏవిధంగా నష్టపోయారో గణాంకాలతో ఎప్పటికప్పుడు వివరిస్తూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఆరు దశాబ్ధాలు సజీవంగా ఉంచిన ఘనత ప్రొఫెసర్‌ జయశంకర్‌ సర్‌దేనని సీఎం రేవంత్‌ రెడ్డి కొనియాడారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రొ.జయశంకర్‌ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే శ్వాసగా, ధ్యాసగా, లక్ష్యంగా బతికారని, సకల జనుల్లో ఉద్యమ స్పూర్తిని రగిలించారని అన్నారు. తన జీవితాన్ని తెలంగాణకు అంకితం చేసిన గొప్ప పోరాట యోధుడని కొనియాడారు.
అలాగే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన వ్యక్తి గద్దరన్న అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్‌ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చేసిన సేవలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. బుధవారం ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో.. గద్దర్‌ చిత్రపటానికి సీఎం పూలమాల వేసి నివాళులర్పించారు. గద్దర్‌తో తనకు ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గద్దర్‌ చేసిన సాంస్కృతిక, సాహితీ సేవలకు గుర్తింపుగా జూన్‌ 14న గద్దర్‌ పేరిట సినీ కళాకారులకు, సినీ ప్రముఖులకు తెలంగాణ ఫిల్మ్‌ అవార్డులను అందించామని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img