మద్రాసు హైకోర్టు తీర్పుపై సుప్రీం అసహనం
న్యూఢిల్లీ: సంక్షేమ పథకాల్లో ముఖ్యమంత్రుల పేర్లు, ఫొటోలు ఉపయోగించే విషయంలో సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ అంశంపై గతంలో మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రభుత్వ పథకాల్లో సీఎంలు, ప్రధాని ఫొటోలను ఉపయోగించే విధానాన్ని దేశమంతా అనుసరిస్తోందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాజకీయ యుద్ధాలకు కోర్టులను ఉపయోగించుకోకూడదని హితవు పలికింది.
అసలేం జరిగిందంటే..?
తమిళనాడు ప్రభుత్వం ‘విత్ యు స్టాలిన్’ పేరుతో నిర్వహిస్తోన్న ప్రచార కార్యక్రమంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. ఈ క్రమంలోనే ఇటీవల అన్నాడీఎంకే పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సీవీ షణ్ముగం దీనిపై మద్రాసు హైకోర్టు లో పిల్ వేశారు. దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం.. కొత్తగా తీసుకువచ్చే ప్రజా సంక్షేమ పథకాల్లో జీవించి ఉన్న నేతల పేర్లు వాడొద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే వాటి గురించి ప్రచారం చేసేటప్పుడు మాజీ ముఖ్యమంత్రుల ఫొటోలు, పార్టీ గుర్తులు, జెండాను ఉపయోగించకుండా నిషేధించింది.
దీంతో మద్రాసు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సీజేఐ జస్టిస్ బీఆర్ గవారు నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. అనేక రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల పేర్లతో పథకాలను ప్రవేశపెట్టారని, దీనిపై ఎలాంటి న్యాయపరమైన నిషేధాజ్ఞలు లేవని ధర్మాసనం ముందు తమిళనాడు ప్రభుత్వం వాదనలు వినిపించింది.
దీనిపై సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ మద్రాసు హైకోర్టులో వ్యాజ్యం వేసిన పిటిషనర్‌పై అసహనం వ్యక్తంచేసింది. ”ఈ విషయంలో పిటిషనర్‌కు నిజంగా అంత ఆందోళన ఉంటే.. అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నేతలతో ఉన్న పథకాలను ఎందుకు సవాల్ చేయలేదు? పలు ప్రభుత్వ పథకాలకు ప్రధాని, రాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తుల ఫొటోలు ఉపయోగించుకోవచ్చని సుప్రీం గతంలో అనుమతినిచ్చింది. దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. మీ రాజకీయ పోరాటాల కోసం కోర్టులను వేదికలు చేసుకోవద్దు” అని ధర్మాసనం స్పష్టంచేసింది. మద్రాసు హైకోర్టు తీర్పును పక్కనబెట్టిన సుప్రీంకోర్టు.. అక్కడ పిటిషన్ వేసిన అన్నాడీఎంకే నేత షణ్ముగంకు రూ.10 లక్షల జరిమానా విధించింది.
సీఎం పేర్లతో పథకాలు దేశమంతటా ఉన్నారు..
- Advertisement -
- Advertisement -