ఓపీఎస్‌తోనే ఉద్యోగులకు మేలు
సెప్టెంబర్ 1న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా : ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్), ఏకీకృత పెన్షన్ స్కీం (యూపీఎస్) వద్దనీ, పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) కావాలని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి చెప్పారు. రెండు దశాబ్ధాలకుపైగా ఓపీఎస్ కోసం అనేక ఉద్యమాలు చేస్తున్నారని అన్నారు. పెన్షన్ విద్రోహ దినం పేరుతో వచ్చేనెల ఒకటో తేదీన హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేపట్టనున్నట్టు వివరించారు. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2004, సెప్టెంబర్ ఒకటి నుంచి సీపీఎస్ విధానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమల్లోకి వచ్చిందన్నారు. తెలంగాణ వస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఉద్యోగులు భావించారని చెప్పారు. కానీ సీపీఎస్ విధానాన్ని కొనసాగిస్తామంటూ గత ప్రభుత్వం కేంద్రానికి చెపస్పిందన్నారు. అధికారంలోకి వస్తే సీపీఎస్‌ను రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చిందనీ, మ్యానిఫెస్టోలో పొందుపర్చిందని అన్నారు. కర్నాటక, హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం సీపీఎస్‌ను రద్దు చేసిందన్నారు. దీంతో రాష్ట్రంలోని ఉద్యోగుల్లో ఆశ కలిగిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా సీపీఎస్ రద్దుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతూ వచ్చేనెల ఒకటిన హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు. ఇది రాజకీయాలకతీతంగా నిర్వహిస్తున్నామని వివరించారు. ఏఐఎఫ్‌టీవో సెక్రెటరీ జనరల్ సీఎల్ రోజ్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని చెప్పారు. గురుకులాల టైంటేబుల్‌ను మార్చాలని డిమాండ్ చేశారు. ఏకీకృత సర్వీస్ రూల్స్‌ను అమలు చేయాలని కోరారు. డీఈవోలుగా ఐఏఎస్ అధికారులను నియమించడాన్ని ఖండించారు. డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామనీ, ఆ తీర్పును అమలు చేయాలని కోరారు. సీపీఎస్ విషయంలో ప్రధాన దోషి కేంద్ర ప్రభుత్వమేననీ, రాష్ట్రాలపై బలవంతంగా రుద్దుతున్నదని చెప్పారు.
కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌లోకి వెళ్తే మ్యూచువల్ ఫండ్‌లో ఉద్యోగులు దాచుకున్న సొమ్మును తిరిగి ఇవ్వబోమంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడాన్ని ఖండించారు. ఉద్యోగుల సొమ్ముపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదన్నారు. దానిపై పోరాటం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూటీఎస్ అధ్యక్షులు గుండు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎస్, యూపీఎస్ వద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES