Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంరాజగోపాల్‌ రెడ్డిపై ఏఐసీసీ గరంగరం

రాజగోపాల్‌ రెడ్డిపై ఏఐసీసీ గరంగరం

- Advertisement -

– క్రమశిక్షణ సంఘం చైర్మెన్‌ మల్లు రవి ఫోన్‌
– త్వరలో పిలిచి మాట్లాడే అవకాశం
– సీఎం రేవంత్‌పై వ్యాఖ్యల నేపథ్యంలో అధిష్టానం సీరియస్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై కాంగ్రెస్‌ అధిష్టానం గరంగరంగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ నిర్ణయించింది. అధిష్టానం ఆదేశాలతో టీపీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మెన్‌ మల్లు రవి రంగంలోకి దిగారు. రాజగోపాల్‌రెడ్డికి ఫోన్‌ చేసి మాట్లాడిన ఆయన ఎమ్మెల్యేకు క్లాస్‌ పీకినట్టు తెలిసింది. రెండు మూడు రోజుల్లో ఆయన్ను గాంధీభవన్‌కు పిలిచి మాట్లాడాలని క్రమశిక్షణ సంఘం నిర్ణయించింది. రాజగోపాల్‌ గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ పార్టీ పెద్దగా పట్టించుకోలేదు. అయినా ఆయన తన వైఖరిని ఏ మాత్రం మార్చుకోకుండా సొంతపార్టీ నేతలపైనా, సీఎంపైనా బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అధిష్టానం పట్ల కూడా ఆయన ఇదే రకంగా వ్యవహరిస్తుండటం గమనార్హం.
ఈ క్రమంలో తాజాగా ఆయన సీఎంపై చేసిన వ్యాఖ్యలను హైకమాండ్‌ సీరియస్‌గా తీసుకుంది. ‘నాకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వడం లేదు. నాకంటే జూనియర్లకు క్యాబినెట్‌లో స్థానం కల్పించారు…’ అంటూ కోమటిరెడ్డి ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి విదితమే. దాంతోపాటు సీఎంగా రేవంత్‌రెడ్డి మూడున్నరేండ్లు మాత్రమే ఆ పదవిలో ఉంటారనీ, ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎవరనేది అధిష్టానం చూసుకుంటుందంటూ కామెంట్లు చేశారు. మంత్రి ఉత్తమ్‌ టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు… రాజగోపాల్‌ ఆయన పట్ల కూడా ఇదే రకంగా వ్యవహరించారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో విభేదాలొచ్చాయి. ఈ పరిణామాలతో కాంగ్రెస్‌లో కొనసాగలేక రాజగోపాల్‌ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తర్వాత కమలం కండువా కప్పుకుని మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఓటమి తర్వాత కొంతకాలం రాజకీయంగా సైలెంట్‌గా ఉన్న ఆయన… బీజేపీలో ఆశించిన స్థాయిలో అవకాశాలు లేవని భావించి తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ సందర్భంగా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎంపీగా గెలిపిస్తే…మంత్రి పదవి ఇస్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్టు రాజగోపాల్‌రెడ్డి ప్రచారం చేసుకున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినప్పటికీ మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు దక్కలేదు. దీంతో రాజగోపాల్‌ తరచూ మీడియా ముందుకొచ్చి సొంత పార్టీపైనా, ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన సీఎంపై నేరుగా విమర్శల దాడికి దిగుతున్నారు. సీఎం, మంత్రులతోపాటు కాంగ్రెస్‌లోని మరికొందరు నేతలపై కూడా కోమటిరెడ్డి గతంలో ఇదే రకంగా వ్యాఖ్యలు చేసి, వారి ఆగ్రహానికి గురయ్యారు. తద్వారా ఏదో ఒకరకంగా మీడియాలో నానుతూ వస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. దీంతో పార్టీ నేతలు ఆయనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బీసీ బిల్లుపై కాంగ్రెస్‌ ఢిల్లీలో పోరాటం కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో కాళేశ్వరం అవినీతిపై పీసీ ఘోష్‌ కమిటీ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. దానిపై రాష్ట్ర మంత్రివర్గంలో కూడా చర్చించారు. ఇలాంటి పరిణామా లను తనకు అనుకూలంగా మార్చుకోవాలని అధికార పార్టీ భావిస్తోన్న తరుణంలో అందుకు భిన్నంగా రాజగోపాల్‌రెడ్డి పార్టీకి నష్టం చేకూరేలా మాట్లాడుతున్నారంటూ పలువురు ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి కూడా ఇది ఇబ్బందికరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలను ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ ట్వీట్టర్‌ వేదికగా తప్పుపట్టారు. రాజగోపాల్‌కు మంత్రి పదవి ఇచ్చే విషయంపై అధిష్టానానిదే తుది నిర్ణయమని చెప్పారు. మొత్తం మీద ఈ ఎపిసోడ్‌ హాట్‌ హాట్‌గా కొనసాగుతోంది. టీపీసీసీ క్రమశిక్షణ సంఘం ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img