ప్రజానుకూల ప్రత్యామ్నాయ విద్యావిధానాన్ని తేవాలి : ఎస్టీఎఫ్‌ఐ
కోల్‌కతాలో జాతీయ మహాసభలు ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నూతన జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ-2020)ని రద్దు చేయాల్సిందేనని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్‌ఐ) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రజానుకూల ప్రత్యామ్నాయ విద్యా విధానాన్ని తేవాలని కోరింది. మూడు రోజులపాటు జరిగే ఎస్టీఎఫ్‌ఐ తొమ్మిదో జాతీయ మహాసభలు (రజతోత్సవ వేడుకలు) మహాజతి సదన్ కొల్‌కతా నగరంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. మహాసభల ప్రారంభం సందర్భంగా జాతీయ జెండాను ఎస్టీఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సిఎన్ భారతి, ఎస్టీఎఫ్‌ఐ పతాకాన్ని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు కెసి హరికృష్ణన్ ఆవిష్కరించారు. అనంతరం ఎస్టీఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి సిఎన్ భారతి అధ్యక్షతన ప్రారంభ సదస్సును నిర్వహించారు. ముఖ్య వక్తలుగా రవీంద్ర భారతి యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పవిత్ర సర్కార్, కొల్‌కతా యూనివర్సిటీ ప్రొఫెసర్ శామ్యూల్ చక్రవర్తి, జాదవ్‌పూర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ సిద్ధార్థ దత్తా, ప్రొఫెసర్ అబ్దుల్ కఫీలు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రయివేటీకరణ విధానాల వల్ల దేశమంతా వేలాది ప్రభుత్వ పాఠశాలలు మూతబడుతున్నాయని విమర్శించారు. వాటిలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నదని చెప్పారు. ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని అన్నారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రయివేటీకరణ, కేంద్రీకరణ, కార్పొరేటీకరణ, మతోన్మాద విధానాలు దేశంలో విద్యార్థులను అశాస్త్రీయ భావజాలానికి గురయ్యేలా చేస్తున్నాయనీ, మూఢత్వం పెరుగుతున్నదని అన్నారు. దేశంలో అన్ని భాషలకూ సమాన ప్రాధాన్యతను రాజ్యాంగం ఇస్తున్నదనీ, కానీ కేంద్రం ఒక భాషను అందరిపై రుద్దుతున్నదని చెప్పారు. ఒక దేశం ఒకే విధానం, ఒకే దేశం ఒకే కరిక్యులం అనే నినాదం సమంజసం కాదన్నారు. ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం మన నినాదమని వివరించారు. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచాల్సిన ఆవశ్యకత ఉన్నదని చెప్పారు. ఉపాధ్యాయులంతా వారి పని ప్రదేశంలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. కొఠారి కమిషన్ సూచించినట్టుగా జీడీపీలో ఆరు శాతం, కేంద్ర బడ్జెట్‌లో పది శాతం నిధులు విద్యారంగంపై కేటాయించాలని డిమాండ్ చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) లాంటి ఒక కేంద్రీకృత ఏజెన్సీ దేశవ్యాప్తంగా ఉన్న విద్యారంగంపై అజమాయిషీ చలాయిస్తున్నదని విమర్శిం చారు. రాష్ట్రాల హక్కులను హరిస్తున్నదని చెప్పారు. దేశ వ్యాప్తంగా లక్షలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నా యని ఆందోళన వ్యక్తం చేశారు. రెగ్యులర్ నియామకాలు చేయకుండా కాంట్రాక్టు, తాత్కాలిక ఉపాధ్యాయులతో నెట్టుకొస్తున్నారని అన్నారు. సరిపడినంత ఉపాధ్యాయ నియామకాలు లేకపోవడం, సౌకర్యాలు కల్పించక పోవడంతో ప్రభుత్వ పాఠశాలలు మూతపడిపోతున్నాయని వివరించారు. ఉన్నత విద్యలో 50 శాతం యూనివర్సిటీలు ప్రయివేట్ రంగంలో ఉన్నాయనీ, రాబోయే కాలంలో ప్రభుత్వ రంగసంస్థలు పూర్తిగా తగ్గిపోయే ప్రమాదమున్న దని అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఎస్టీఎఫ్‌ఐ అధ్యక్షుడు కెసి హరికృష్ణన్ అధ్యక్షతన నిర్వహించిన విద్యా సదస్సులో ఎస్టీఎఫ్‌ఐ ఉపాధ్యక్షుడు టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి ఎన్‌ఈపీ-2020పై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రజా వ్యతిరేక ఎన్‌ఈపీ-2020ని తిరస్కరించాలనీ, రాజ్యాంగానికి అనుగుణమైన శాస్త్రీయ విద్యా విధానాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యను కాపాడాలని కోరారు. విద్యా సదస్సులో జాదవ్ పూర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ నందిని ముఖర్జీ, ప్రొఫెసర్ దేవాసిస్ సర్కార్ మాట్లాడారు. ఈ మహాసభలో ఎస్టీఎఫ్‌ఐ కేంద్ర కమిటీ సభ్యులు, అన్ని రాష్ట్రాల భాగస్వామ్య సంఘాల ప్రతినిధులు 560 మంది పాల్గొన్నారు. తెలంగాణ నుంచి 38 మంది ప్రతినిధులు హాజరయ్యారు. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకట్, ఉపాధ్యక్షులు సిహెచ్ దుర్గాభవాని, కోశాధికారి టి లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు, పలు జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
ఎన్‌ఈపీని రద్దు చేయాల్సిందే…
- Advertisement -
- Advertisement -