Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుకేంద్రం చేతిలో ప్రజాస్వామ్యం ఖూనీ

కేంద్రం చేతిలో ప్రజాస్వామ్యం ఖూనీ

- Advertisement -

– బీహార్‌లో తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలి
– బీజేపీ గెలుపు కోసం 60 లక్షల ఓట్ల తొలగింపు
– ఆ పార్టీకి అనుబంధ సంఘంగా మారిన కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌ : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
– రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు, దిష్టిబొమ్మల దహనం
నవతెలంగాణ-సూర్యాపేట/ విలేకరులు

”కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాహక్కులను కూనీ చేస్తోంది.. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని తెలిసి అక్కడ అధికారాన్ని నిలుపుకోవడం కోసం కేంద్ర ఎన్నికల కమిషన్‌ మీద ఒత్తిడి తెచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న 60 లక్షల ఓట్లను తొలగించడం అన్యాయం. వెంటనే ఆ ఓట్లను పునరుద్ధరించాలి..” అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు. బీహార్‌లో మతప్రాతిపదికన ఓట్ల తొలగింపు, కేంద్ర ఎన్నికల కమిషన్‌ చర్యలను నిరసిస్తూ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. అధికారం తప్ప ప్రజాస్వామ్యం అంటే బీజేపీకి నచ్చడం లేదన్నారు. ఎన్ని అడ్డదారులైనా తొక్కి అధికారంలోకి రావాలనే ప్రయత్నాలు తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలనే చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్‌ లాంటి రాష్ట్రాల్లో అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చిందన్నారు. స్వతంత్రంగా పని చేయాల్సిన కేంద్ర ఎన్నికల కమిషన్‌ బీజేపీ అనుబంధ సంఘంగా మారిపోయిందని విమర్శించారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగంలో 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిస్తే.. మనుస్మృతిని రాజ్యాంగంగా భావిస్తున్న బీజేపీ ఓటు హక్కును రద్దు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే వైఖరి కొనసాగితే భవిష్యత్‌లో జరిగే ఏ ఎన్నికల్లోనైనా ఇలాంటి నీచమైన పనులు చేయడానికి అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీహార్‌లో అనుసరించిన పద్ధతినే భవిష్యత్‌లో తెలంగాణలో కూడా అమలు జరిపే అవకాశాలు ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేస్తోందన్నారు. ఎన్నికల కమిషన్‌ బీజేపీ కమిషన్‌గా కాకుండా దేశ ప్రజల కమిషన్‌గా ఉండాలని కోరుతున్నామని, లేకుంటే రాబోయే కాలంలో ప్రజలు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నాగారపు పాండు, మట్టి పెళ్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఓట్ల తొలగింపును వ్యతిరేకించాలి
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్‌ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. బీహార్‌ రాష్ట్రంలో ఓట్ల తొలగింపుపై ఎన్నికల సంఘం, కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని అడ్డదారిన ఓట్లను తొలగించిందని విమర్శించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని సుభాష్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. చిట్యాల మండల కేంద్రంలో నల్ల జెండాలు, బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. దేవరకొండ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు.
బీజేపీకి ఈసీ అనుకూల వైఖరిని ఖండించండి: అబ్బాస్‌
కేంద్ర ఎన్నికల కమిషన్‌ బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ.అబ్బాస్‌ అన్నారు. పార్టీ హైదరాబాద్‌ సౌత్‌ కమిటీ ఆధ్వర్యంలో సంతోష్‌ నగర్‌, ఐఎస్‌ సదన్‌ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీహార్‌లో 65 లక్షల మంది ఓటర్ల పేర్లను ఓట్ల లిస్టులో నుంచి తొలగించడం అన్యాయమన్నారు. ఇది అక్కడితో ఆగకుండా మిగతా దేశమంతా విస్తరించే అవకాశం ఉంటుందని తెలిపారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్‌ జిల్లా కేందంలోని అంబేద్కర్‌ చౌక్‌ వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. జన్నారం మండలం సుందరయ్య నగర్‌ కాలనీలో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నిర్మల్‌ జిల్లాలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. మెదక్‌ పట్టణంలోని పోస్ట్‌ ఆఫీస్‌ చౌరస్తా వద్ద, సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జహీరాబాద్‌ పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు కండ్లకు నల్లగంతలు కట్టుకొని నిరసన తెలిపారు. సిద్దిపేట పాత బస్టాండ్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన, చేర్యాల మండలంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు.
బీహార్‌లో
ఎస్‌ఐఆర్‌ సర్వేను ఆపాలి
బీహార్‌ ఎస్‌ఐఆర్‌ సర్వేను వెంటనే ఆపాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జ్యోతి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి.సాగర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అంబేద్కర్‌ చౌరస్తాలో ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ.. బీహార్‌ రాష్ట్రంలో తొలగించిన 64 లక్షల ఓట్లను పునరుద్ధరించాలని, ఎన్నికల కమిషన్‌ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. బీహార్‌లో తనకు వ్యతిరేకంగా వున్న ఓటర్లను తొలగించి అక్రమ పద్ధతుల్లో అధికారంలోకి రావాలని బీజేపీ కుట్ర పన్నుతోందని సాగర్‌ విమర్శించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img