– గుజరాత్‌లో బీజేపీ సర్కారు తీరు
– స్కూల్ పుస్తకాల్లో భగవద్గీత పాఠాలు
– విద్యావేత్తలు, మేధావుల ఆందోళన
గాంధీనగర్: మత సంబంధ విషయాలకు దూరంగా ఉండాల్సిన విద్యాసంస్థలను గుజరాత్‌లోని బీజేపీ సర్కారు తన హిందూత్వ ఎజెండా కోసం ఆయుధంగా వాడుకుంటున్నది. విద్య కాషాయీకరణలో భాగంగా ఇప్పటికే పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకొని పలువురు విద్యావేత్తలు, మేధావుల ఆగ్రహానికి గురైన బీజేపీ ప్రభుత్వం.. మళ్లీ అలాంటి చర్యలే అమలు చేస్తున్నది. తొమ్మిది నుంచి 12వ తరగతి విద్యార్థులకు భగవద్గీత నేర్చుకోవటాన్ని తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఆ తరగతుల ఫస్ట్ లాంగ్వేజ్ పాఠ్యపుస్తకాల్లో భగవద్గీత చాప్టర్లను చేర్చింది. గుజరాతీతో పాటు హిందీ, ఇంగ్లీశ్, ఉర్దూ పుస్తకాల్లోనూ ఈ చాప్టర్లను గుజరాత్ సెకండరీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ బోర్డ్ (జీఎస్‌హెచ్‌ఎస్‌ఈబీ) చేర్చింది. కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొచ్చిన వివాదాస్పద నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ)-2020 అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవటం గమనార్హం. అయితే గుజరాత్ ప్రభుత్వ తీరుపై విద్యావేత్తలు, మేధావులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఇది విద్యను కాషాయికరించే బీజేపీ ప్రభుత్వ చర్యల్లో భాగమని ఆరోపిస్తున్నారు. బీజేపీ విద్యాసంస్థలను తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నదనీ, గతంలోనూ ఇలాగే చేసిందని గుర్తు చేస్తున్నారు. గతంలో కర్నాటకలోని పలు విద్యా సంస్థల్లో హిజాబ్‌పై నిషేధం విధించిన అప్పటి బీజేపీ ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా పలు వర్గాల ఆగ్రహానికి గురైన విషయం విదితమే.
స్కూల్ పుస్తకాల్లో భగవద్గీత పాఠాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES