నవతెలంగాణ – కంఠేశ్వర్ : తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై పార్లమెంట్లో చట్టం చేయాలని ధర్నాకు పిలుపునిస్తున్నామని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ తెలిపారు. ఈ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని, ఆర్డినేన్స్ ను వెంటనే ఆమోదించి అమలుకు పూనుకోవాలని పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈనెల 11న ధర్నా నిర్వహించాలని జిల్లా కమిటీలో నిర్ణయించినట్లు రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ తెలిపారు.
ఈ మేరకు శనివారం సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి బిజెపి శాసనసభ్యులు, ఆమోదించింది కేంద్రానికి పంపిన తర్వాత, ముస్లింలకు ప్రయోజనం చేకూర్చటానికి బీసీ రిజర్వేషన్లు అమలుకు కేంద్రం, రాష్ట్రం పూనుకున్నదని సాకుతో 42శాతం రిజర్వేషన్లు అమలు జరపకుండా అడ్డం పడుతున్నారని, పూర్తిగా పక్షపాత ధోరణిని తెలియజేస్తుందని విమర్శించారు.
ఈ క్రమంలో బలహీన వర్గాల అందరికీ న్యాయం జరగటానికి విద్య ,ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42శాతం అమలు జరపటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధపడితే బిజెపి దాన్ని అడ్డుకోవడం వారి ఆలోచనా ధోరణిని తెలియజేస్తుందని అన్నారు. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలలో బిజెపి పాలిత ప్రాంతాలలో మైనార్టీలకు రిజర్వేషన్లను అమలు జరుపుతున్నప్పటికీ తెలంగాణలో రాజకీయ దురుద్దేశంతో అడ్డుకోవడం కేంద్ర ప్రభుత్వ వైఖరి సరైనదికాదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా ఒంటరిగా పోరాడటం కన్నా అఖిలపక్షాలను కలుపుకొని కేంద్రంపైన ఒత్తిడి తేవడానికి పోరాటం చేయాలని సూచించారు.
అనంతరం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం చెందినందున ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సమస్యలను తెలుసుకొని ప్రజలు పోరాటాలలో కదిలి రావటానికి సీపీఐ(ఎం) పార్టీ వివిధ ప్రాంతాలలో సమావేశాలు నిర్వహించటంతో పాటు సర్వేలను చేయాలని నిర్ణయించిందని, ఆయా ప్రాంతాల్లో ప్రజలు, పార్టీ కార్యకర్తలకు సహకరించాలని ఆయన కోరారు. ఐక్య పోరాటాల ద్వారా మాత్రమే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు. పెద్ది వెంకట్ రాములు, వెంకటేష్, శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు జంగం గంగాధర్, సుజాత, నన్నే సబ్ తదితరులు పాల్గొన్నారు.