Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeమానవిపజ్రలకు సేవ చేసే దినసరి కూలీని నేను

పజ్రలకు సేవ చేసే దినసరి కూలీని నేను

- Advertisement -

ఆమె ఓ ఐఏఎస్‌ అధికారి. కాలుమీద కాలేసుకొని, ఫైళ్లు చూస్తూ హాయిగా గడిపేయవచ్చు. కానీ ఆమె అలా కాదు. ఓ బాధ్యత గల అధికారిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు అహర్నిశలూ శ్రమిస్తు న్నారు. క్షేత్రస్తాయి వరకు వెళ్లి ప్రజల కష్టాలు తెలుసుకొని మరీ పరిష్కరిస్తున్నారు. తాను చేస్తున్న ఈ ప్రయాణంలో ఎదురొస్తున్న అడ్డంకుల ను బద్దలు కొడుతూ నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆమే ముగ్ధా సిన్హా. సివిల్‌ సర్వీసుల లో తన ఇరవై ఆరేండ్ల కెరీర్‌లో కీలకమైన మైలురాళ్లను విజయవంతంగా దాటారు. ఎదుర్కొన్న సవాళ్లే ఆమెను నేడు ఐటిడిసి మేనేజింగ్‌ డైరెక్టర్‌ వరకు ఎదిగేలా చేశాయి. ఇటీవల ఆమె తన అనుభవాలను ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌తో పంచుకున్నారు. ఆ వివరాలు మానవి పాఠకుల కోసం…


ముగ్ధా ఐదవ తరగతిలో ఉన్నప్పుడు వేసవి సెలవుల్లో ఓ అసైన్‌మెంట్‌ చేయాల్సి వచ్చింది. జీవితంలో ఏమి కావాలనుకుంటుందో రాయమని టీచర్‌ అడిగారు. అప్పుడు ఆమె తన తల్లిని సలహా అడిగింది. ‘మా అమ్మ, ‘నువ్వు ఐఏఎస్‌ అధికారి కావాలనుకుంటున్నానని రాయి’ అంది. నేను ఆమెను ‘ఐఏఎస్‌ అంటే ఏమిటి’ అని అడిగాను? మా తాత అమ్మను సివిల్‌ సర్వెంట్‌ చేయాలనుకున్నాడు. కానీ ఆమె పాఠశాలలో ఉన్నప్పుడే ఆయన మరణించాడు. ఆ కల నెరవేరలేదు. కాబట్టి నా తాత కోరికను నేను ముందుకు తీసుకెళ్లాలని నా తల్లికి కోరిక’ అని ముగ్ధా గుర్తుచేసుకున్నారు. అప్పట్లో సివిల్‌ సర్వీసెస్‌పై దృష్టి పెట్టింది తన తరగతిలో ఆమె మాత్రమే. దానికి తగ్గట్టు కృషి చేసింది. పోటీలో గెలిచిన ప్రతిసారీ అందరూ ఆమెను ”ఓహ్‌! ముగ్ధా సివిల్‌ సర్వీస్‌ అధికారి కావడానికి సిద్ధమవుతోంది’ అనేవారు. ఇది ఆమెను ఎంతో ఉత్సాహపరిచేది. ఇలా వేసవిలో సరదాగా ప్రారంభమైన ప్రాజెక్ట్‌ ఆమె జీవిత లక్ష్యాన్నే మార్చివేసింది. రాజస్థాన్‌ జిల్లాలలో భారతదేశ సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖల వరకు ఆమె కెరీర్‌ను రూపొందించింది.
పరీక్షలు సులభమే…

జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి చదువును పూర్తి చేసిన ముగ్ధా సివిల్‌ సర్వీసెస్‌లో 8వ ర్యాంక్‌ సాధించింది. 1999లో రాజస్థాన్‌ కేడర్‌లో చేరింది. ‘పరీక్షలో విజయం సాధించడం అత్యంత సులభం. నిజమైన పరీక్ష తర్వాత ప్రారంభమవుతుంది. సమాజానికి సేవ చేయాలనుకోవడమే అది’ అంటారు ఆమె. ముస్సోరీలోని అకాడమీలో శిక్షణ పూర్తి చేసిన ముగ్ధా ఏడాది పాటు ప్రొబేషనర్‌గా ఉదయపూర్‌కు వెళ్లారు. ఈ అనుభవం ఆమెకు ఎన్నో జీవిత పాఠాలను నేర్పింది. మారుమూల ప్రాంతమైన జాడోల్‌లో బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌గా నియమితులైన ముగ్ధా ప్రాథమిక స్థాయి నుండి నేర్చుకోవడం ప్రారంభించారు. నిర్మాణంలో ఉన్న పాఠశాల భవనాలను కొలవడానికి జూనియర్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్లతో కొండలపై ట్రెక్కింగ్‌ వంటివి ఎన్నో చేశారు. ఝున్‌ఝునుకు వెళ్లే ముందు ఆమె బుండి, హనుమాన్‌గఢ్‌లలో పనిచేశారు. ఆ జిల్లా 63 ఏండ్ల చరిత్రలో ఆమె అక్కడ మొదటి మహిళా జిల్లా కలెక్టర్‌గా పని చేశారు.


రాజకీయ ఒత్తిళ్లు
అక్రమ మైనింగ్‌కు ఆ జిల్లా పెట్టింది పేరు. అర్థరాత్రి కాల్స్‌ చేసి ముగ్ధాను బెదిరించేవారు. రాజకీయంగా అనేక ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు. అయినా నిబద్ధతతో పని చేశారు. దాంతో ఆమెను బదిలీ చేశారు. అయితే ప్రజలు పెద్దఎత్తున ఆమెకు అండగా నిలిచారు. ‘బార్‌ అసోసియేషన్‌ నాకు మద్దతుగా ఒక తీర్మానాన్ని జారీ చేసింది. వారు ఏ అధికారికీ ఎప్పుడూ ఇలా చేయలేదు. వర్తకులు తమ దుకాణాలను మూసివేశారు. చివరకు నా బదిలీని వెనక్కు తీసుకున్నారు’ అంటూ ఆమె గుర్తు చేసుకున్నారు. ముగ్ధా రాజస్థాన్‌లో సంస్కృతి, సైన్స్‌, టెక్నాలజీ రంగాలలో అనేక కీలక కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. ఆస్ట్రో నైట్‌ స్కై టూరిజంకు మార్గదర్శకత్వం వహించారు. ఇది ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రారంభించేలా ప్రేరేపించింది. హన్లే(లేహ్‌)ను భారతదేశంలోని మొట్టమొదటి డార్క్‌ స్కై రిజర్వ్‌గా ప్రకటించడంలో కూడా ఆమె కీలక పాత్ర పోషించింది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో జాయింట్‌ సెక్రటరీగా +ూAవీ విభాగానికి నాయకత్వం వహించారు.


విప్లవాత్మకమైనది
అధికారిగా ఆమె ప్రణాళిక విప్లవాత్మకమైనది. లైబ్రరీల ఉత్సవంలో భాగంగా ఆమె స్వయంగా దేశవ్యాప్తంగా ఉన్న లైబ్రరీలకు 10,000కి పైగా లేఖలు రాశారు. ‘దీనికి కేరళ నుండి కాశ్మీర్‌ వరకు వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. 1959 తర్వాత మొదటి సమగ్ర మ్యూజియం సర్వేను ఆమె నిర్వహించారు. 1934లో కేవలం 105 మ్యూజియంలు ఉంటే భారతదేశంలో ఇప్పుడు 1,201 మ్యూజియంలు ఉన్నాయి. భారతదేశపు మొదటి అధికారిక మ్యూజియం మ్యాప్‌ను అభివృద్ధి చేశారు. నేడు ఇండియా టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ముగ్ధా దృష్టి సాంప్రదాయ హోటల్‌ కార్యకలాపాలకు మించి విస్తరించింది.

తప్పని లింగ వివక్ష
పాలనలో మహిళగా ముగ్ధా అనుభవాలు సూక్ష్మ పక్షపాతాల నుండి బహిరంగ వివక్ష వరకు ఉన్నాయి. కానీ ఆమె ప్రతిస్పందన స్థిరంగా ఉంది. రాజస్థాన్‌లోని కొన్ని అత్యంత సవాలుతో కూడిన జిల్లాల్లో పనిచేసిన అనుభవాలను ఆమె పంచుకున్నారు. కెరీర్‌ ప్రారంభంలో ఒక సీనియర్‌ అధికారి మంచి సేవలు అందించే మహిళా అధికారులను కష్టపడి పనిచేసే, నిజాయితీగల, విధేయులుగా చూశారు. అదే పురుషులనైతే డైనమిక్‌ హీరోలుగా ప్రస్తావించారు. ఈ పదాలు మహిళలకు ఎందుకు వర్తించవని ఆమె ప్రశ్నించారు. చాలా ఏండ్ల తర్వాత అదే అధికారి వేరే పోస్టింగ్‌లో ఆమె సీనియర్‌ అయినప్పుడు అతనే మళ్లీ మాట్లాడుతూ ‘మనం ఏమి అవుతామో నిర్ణయించేది శారీరకత కాదు, ఇది మెదడుకు సంబంధించిన విషయం. దీనికి ముగ్ధా మంచి ఉదాహరణ’ అన్నారు. ‘మనం కత్తిని కాదు, కలం పట్టుకుంటాము. మహిళలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత కరుణ చూపించవచ్చు. కానీ లింగం అధారంగా వారి సామర్థ్యాలను లెక్కించడం సరైనది కాదు’ అంటారు ఆమె.

జవాబుదారిగా ఉంటాను
ఆమె సాధించిన విజయాలకు అనేక అవార్డులు, ప్రశంసలు పొందారు. అయినప్పటికీ ముద్ధా ఎంతో వినయంగా ఉంటారు. ఈ లక్షణాలు ఓ పౌర సేవకురాలిగా తన ప్రయాణంలో ఆమెకు ఎంతో సహకరించాయి. ‘నేను ప్రజల కోసం పనిచేసే దినసరి కార్మికురాలిని. రేపు ఏమి జరుగుతుందో నాకు తెలియదు. అందుకే చేసే ప్రతి పనికి నేను జవాబుదారీగా ఉంటాను. ఒక దినసరి కార్మికుడి ఏకైక బహుమతి రోజు చివరిలో సంతృప్తి చెందడం. అప్పుడే ప్రశాంతంగా నిద్రపోగలరు. నేను అలాగే భావిస్తాను. ఈరోజు ప్రజలకు నేను ఇది చేయగలిగాను అనుకున్నప్పుడే హాయిగా నిద్రించగలను’ అంటూ ఆమె తన మాటలు ముగించారు.
– సలీమ

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img