Sunday, May 4, 2025
Homeఖమ్మంఇందిరమ్మ ఇండ్లకు ఆశావాహులు, అర్హులు అధికం..

ఇందిరమ్మ ఇండ్లకు ఆశావాహులు, అర్హులు అధికం..

- Advertisement -

నిబంధనలు కఠినతరం…
అధికారిక కోటా అల్పం…
అమలు ప్రశ్నార్ధకం…
నవతెలంగాణ – అశ్వారావుపేట
: ఇందిరమ్మ అర్హులైన లబ్దిదారుల ఎంపిక అధికారులకు ప్రహసనంగా మారింది. తన పాలన ప్రజలకు జవాబుదారీగా  ఉంటుందని ప్రకటించిన రేవంత్ రెడ్డి సర్కార్ అమల్లో ఆపసోపాలు పడుతోంది. ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు నుండి లబ్దిదారుల ఎంపిక వరకు తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటుంది. లబ్దిదారుల జాబితాలను ఎట్టకేలకు శనివారం ఆయా పంచాయితీల్లో ప్రదర్శనకు ఉంచారు. గ్రామాల్లో ఆశావాహులు మాత్రం జాలిగా ఎదురుచూస్తున్నారు. లబ్దిదారుల ఎంపిక కోసం నిర్వహించిన గ్రామసభల్లో నిరుపేదలు ఎందరో ఇళ్ళు మంజూరుకు నోచుకోలేదు. దీనితో గ్రామ సభలలోనే అధికారులను నిలదీశారు. పధకం అమలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించి నెలలు గడుస్తున్నా.. ఇంకా లబ్దిదారుల ఎంపికలో గందరగోళ పరిస్థితులే నెలకొన్నాయి. ప్రజాపాలనలో ఇళ్ళు కోసం దరఖాస్తు కున్న వారిని ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 గా విభజించి జాబితాను ప్రభుత్వం రూపొందించింది. ఎల్ 1 అంటే నివాస స్థలం ఉండి ఇళ్ళు లేని అత్యంత పేదలు. ఎల్ 2 అంటే ఇంటి స్థలం లేని ఉమ్మడి కుటుంబాలు, ఎల్ 3 అంటే ఆర్ధిక స్తోమత ఉండీ ఇంటి స్థలం, ఇళ్ళు లేని కుటుంబాలుగా తెలిపారు. ఈ నిబంధనలు ప్రకారం అశ్వారావుపేట మండలంలోని 27 పంచాయితీల్లో ఎల్ 1 కేటగిరీ లో 3540, ఎల్ 2 విభాగంలో 619, ఎల్ 3 లో 7223 కుటుంబాల వివరాలు పొందుపరిచారు. అయితే ఇందిరమ్మ ఇళ్ళు కేటాయింపు అత్యల్ప గానూ.. అర్హులు అధికంగానూ ఉండటంతో ఎంపిక కష్టంగా మారింది.
ఇందిరమ్మ గ్రామ కమిటీలు ఎంపిక చేసిన జాబితాను ప్రత్యేక అధికారులు తనిఖీ చేసి గురువారం గ్రామ పంచాయితీల్లో తుది అర్హుల జాబితాను ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనితో ఇందిరమ్మ గ్రామ కమిటీలు ఇచ్చిన జాబితాలను అధికారులు వారికి ఇచ్చిన చెక్ లిస్ట్ ప్రకారం తనిఖీలు చేపట్టారు. కానీ ఈ దశలోనే ప్రజల నుండి ప్రతిఘటన ఎదురైంది. అర్హులకు కాకుండా అనర్హులకే ఇళ్ళు మంజూరు చేశారంటూ అధికారులను అడ్డుకున్నారు. పలు పంచాయితీల్లో తనిఖీలు చేయనీయకుండా అధికారులను వెనక్కి పంపించారు.
ఎదురు చూస్తున్న ఆశావాహులు..
జాబితాలో పేర్లు ఉంటాయో లేదోనన్న ఆందోళన పలువురి ఆశావాహులలో  వ్యక్తం అవుతుంది. ఇందరమ్మ గ్రామ కమిటీల ఎంపికలో పేర్లు ఉన్నప్పటికి నిబంధనల మేరకు అర్హత ఉందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గ్రామ కమిటీలు ఇచ్చిన జాబితాలను అధికారులు తిరిగి వెరిఫికేషన్ చేసే సమయంలో చెక్ లిస్ట్ ప్రకారం లేకపోతే పరిస్థితి ఏమిటనే సందిగ్ధత నెలకొంది. ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేసిన ప్రభుత్వం గ్రామ సభలు ద్వారా లబ్దిదారులను ప్రకటించింది. జాబితాలను చూసి నివ్వెర పోయిన నిరుపేదలు ఒక్కసారిగా అధికారులను నిలదీసి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో అర్హుల ఎంపిక కోసం సర్వే చేపడతామని, అధికారులు ప్రకటించి అక్కడ నుండి వచ్చేశారు. తర్వాత ఇందిరమ్మ గ్రామ కమిటీల ద్వారా జాబితాలను సిద్ధం చేసిన ప్రభుత్వం లబ్దిదారులను అధికారుల చేత వెరిఫికేషన్ చేయించింది. వెరిఫికేషన్ సమయంలోనూ నిరుపేదలు అభ్యంతరం చెప్పారు. అనర్హులకే ఎక్కువగా ఇళ్ళు మంజూరు చేశారంటూ నిలదీశారు. కొన్ని గ్రామాల్లో విచారణ అధికారులను అడ్డుకున్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయాలని పలు మండలాల్లో పేదలు ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు.
లబ్దిదారుల ఎంపికలో గందరగోళం..
ఇందిరమ్మ ఇళ్ళ మంజూరులో అంతా గందరగోళ పరిస్థితులే నెలకొన్నాయి. మండలంలోని అశ్వారావుపేట మున్సిపాలిటీ, మోడల్ విలేజ్ పాత రెడ్డిగూడెం పాటు మిగతా 27 గ్రామ పంచాయితీలకు బప్పర్ కోటాలో ప్రభుత్వం అధికారికంగా 713 ఇళ్ళు మంజూరు చేసింది. కానీ ఇందిరమ్మ గ్రామ కమిటీల ద్వారా అధికారులు 812 మంది జాబితాలను సిద్ధం చేసుకుని వెరిఫికేషన్ చేశారు. ఎంపిక చేసింది ఇందిరమ్మ కమిటీలు, వెరిఫికేషన్ చేసింది మాత్రం ప్రత్యేక అధికారులు. ప్రజల శాపనార్థాలను పంచాయితీ కార్యదర్శులు ఎదుర్కోంటున్నారు. ఇళ్ళు మంజూరు, ఎంపికలో వీరి ప్రమేయం లేకున్న పేదల నుండి అపవాదు మోస్తున్నారు.
లబ్ధిదారుల వివరాలు పంచాయితీల్లో ప్రదర్శనకు ఉంచాం: ఎంపీడీఓ రామారావు
లిస్ట్ 1 ప్రకారం వాస్తవ కోటా 617 లబ్ధిదారులను గుర్తించి 613 మంది అర్హులుగా, నలుగురు అనర్హులను విచారణ అధికారులు తేల్చారు. బప్పర్ 20 శాతం కోటా ప్రకారం మండలానికి 89 గుర్తించి, నలుగురిని అనర్హులుగా తేల్చారు. మొత్తం మండలంలో లిస్ట్ 1 ప్రకారం 698 మందిని ఇందిరమ్మ ఇళ్ళుకు అర్హులు, 8 మందిని అనర్హులుగా నిర్ధారించి, అన్ని వివరాలను ఆయా పంచాయితీల్లో సంబంధిత కార్యదర్శులు ప్రదర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -