Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజిసామ్రాజ్యవాదం రౌడీయిజం

సామ్రాజ్యవాదం రౌడీయిజం

- Advertisement -

బ్రిటిష్‌ సామ్రాజ్యవాదాన్ని పారదోలి భారతీయ ప్రజలు విజయం సాధించి 78 ఏండ్లు పూర్తయిన సందర్భంలో ఇప్పుడు మనం ఉన్నాం. అయితే పరిస్థితిలోని వైపరీత్యం ఏమంటే, ఇప్పుడు అమెరికన్‌ సామ్రాజ్యవాదం బహిరంగంగానే ఇండియా మీద రౌడీయిజాన్ని చెలాయిస్తోంది. తన ఆదేశాలకు తలొగ్గమని హుకుం జారీ చేస్తోంది. సామ్రాజ్యవాదానికి ఇదేమీ కొత్త కాదని, దాని స్వభావమే అటువంటిదని, గత ఏడున్నర దశాబ్దాలుగా చాలా సందర్భాల్లో అమెరికన్‌ సామ్రాజ్యవాదం ఇండి యాను తన ఆదేశాలకు లోబడి నడుచుకోవాలని బెదిరించిందని కొందరు వాదించవచ్చు. గతంలో చేసిన బెదిరింపులకు, ఇప్పుడు చేస్తున్నదానికి మౌలికంగానే రెండు తేడాలు ఉన్నాయి. మొదటిది: ”మేం చెప్పినట్టు చేయడం నీకే మంచిది” అన్న పద్ధతిలో కొంచెం మెత్తగా బెదిరించడం గతంలో జరిగేది. కాని ఇప్పుడు అలా లేదు. సూటిగానే ”మేం చెప్పినట్టు మా ప్రయోజనాల కోసం నువ్వు నడుచుకోనట్టయితే నిన్ను శిక్షిస్తాం” అన్న విధంగా అమెరికా బెదిరిస్తోంది. ఇక రెండవ తేడా: గతంలో భారతదేశం ఈ బెదిరింపుల సందర్భంలో జావగారిపోకుండా వెన్నెముక నిటారుగానే ఉంచుకోగలిగింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ రౌడీయిజానికి ఇండియా నుండి మిశ్రమ ప్రతిస్పందనలు వస్తున్నాయి.

స్వతంత్రం వచ్చాక భారతదేశం అమెరికన్‌ సామ్రాజ్యవాదం ఏర్పాటు చేసిన మిలిటరీ కూటములు ‘సియాటో’లో గాని, ‘సెంటో’లో గాని చేరడానికి అంగీకరించలేదు. ఆ మిలిటరీ కూటములన్నీ సోవియట్‌ యూని యన్‌ చుట్టూ మోహరించినవి (పశ్చిమాన నాటో కూటమి ఇప్పుడ కూడా కొనసాగుతోంది). ఆ కూటముల్లో చేర కుండా ఇండియా అలీన విధానాన్ని అనుసరిం చింది. అందుకు అమెరికా ఆగ్రహించింది. అప్పటి అమెరికా విదేశాంగ కార్యదర్శి జాన్‌ ఫోస్టర్‌ డల్లెస్‌ ఒక అధికారిక ప్రకటన చేశాడు. ”నువ్వు నావైపు గనుక నిలవనట్లయితే నాకు నువ్వు వ్యతిరేకంగా ఉన్నట్టే” అన్నదే ఆ ప్రకటన. దానికి అనుగుణంగానే అమెరికా ఇండియా పట్ల శత్రుపూరిత వైఖరినే అనుసరించింది. అప్పటిరోజుల్లో ఇండియా స్వావలంబన సాధించి సామ్రాజ్యవాద దేశాల పెట్టుబడి కబంధ హస్తాల నుండి బైటపడాలన్న ఆకాంక్షతో బలమైన ఆర్థిక వ్యవస్థకు పునాదిగా ఉండే భారీ పరిశ్రమలను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయడానికి ప్రణాళికలను రూపొందించుకుంది. ఈ ప్రణాళి కలకు అమెరికా నుంచి కాని, దాని చెప్పుచేతల్లో ఉండే ప్రపంచ బ్యాంక్‌ నుంచి కాని ఎటువంటి ”అభివృద్ధి సహాయమూ” అందలేదు. ఇండియా రూపొం దించుకున్న స్వావలంబన వ్యూహాన్నే నెహ్రూ- మహలనోబిస్‌ వ్యూహం అంటారు. అటువంటి వ్యూహాన్ని చేపట్టవద్దని ఆ కాలంలో ఇండియాలో పర్యటించిన ”అమెరికా ప్రాయోజిత” నిపుణులందరూ సలహాలు కూడా ఇచ్చారు.

సోవియట్‌ యూనియన్‌ ఆ కాలంలో అందించిన నికరమైన సహాయంతో ఇండియా అటు అలీన విధానాన్ని, ఇటు స్వావలంబన వ్యూహాన్ని అమలు జరపగలిగింది. ప్రభుత్వ రంగం దన్నుతో సామ్రాజ్యవాద దేశాల పెట్టుబడి ఆధి పత్యాన్ని ఎదుర్కోగలిగింది. ఈ క్రమంలో మన దేశం తీవ్ర స్థాయిలో విదేశీమారక ద్రవ్య కొరతను కూడా చవి చూసింది. కాని తన బాట నుండి పక్కకు మళ్లలేదు. 1950 దశకం చివరి కాలంలో డల్లెస్‌ మరణానంతరం క్రమంగా అమెరికా ఇండియా పట్ల తన వైఖరిని మార్చుకోసాగింది. ఇండియాను దూరం పెట్టడం వలన ఇండియాకు కలిగిన నష్టం ఏమీ లేకపోగా, అది సోవియట్‌ యూనియన్‌కే అనుకూలంగా మారుతోందని గ్రహించింది. ఆ దశలో ఇండి యాకు ఐసెన్‌ హోవర్‌ వచ్చి వెళ్లిన అనంతరం మెల్లమెల్లగా ప్రపంచబ్యాంక్‌ ”సహాయం” రావడం మొదలైంది. అది కూడా మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల కోసం మాత్రమే సుమా.

బంగ్లాదేశ్‌ యుద్ధ సమయంలో ఇండియా జోక్యం చేసుకున్నందువలన బంగాళాఖాత ప్రాంతంలో చిచ్చు రేప డానికి ఉన్న బంగారం లాంటి అవకాశం కాస్తా అమెరికాకు లేకుండా పోయింది. దాంతో తీవ్రంగా ఆగ్రహించిన అమె రికా తన ‘టాస్క్‌ఫోర్స్‌ 74’ సైనిక దళాలను, యుద్ధవిమాన వాహకనౌక ‘యు.ఎస్‌.ఎస్‌ ఎంటర్‌ప్రైజ్‌’ను బంగాళాఖాతంలోకి పంపి ఇండియాను బెదిరించడానికి పూనుకుంది. కాని ఇండియా మాత్రం తొణకకుండా బంగ్లాదేశ్‌ విముక్తి పూర్తయేవరకూ తన పాత్రను సక్రమంగా నెరవేర్చింది.

సామ్రాజ్యవాదం తన ఆధిపత్యాన్ని సాధించడం కోసం రౌడీయిజానికి దిగడం సాధారణంగా జరిగేదే. అమెరికన్‌ వ్యూహాలకు లోబడి ఇండియా నడుచుకునేలా బెదిరించడం గతంలో కూడా జరిగినదే. అటువంటి బెదిరింపులను, రౌడీయిజాన్ని ఇండియా గతంలో జయప్రదంగా తిప్పికొట్ట గలిగింది. కాని ఇప్పుడు అమెరికా చెలాయిస్తున్న రౌడీ యిజం పూర్తిగా వేరే నేపథ్యంలో జరుగుతోంది. ఇప్పుడు మన దేశం నయా ఉదారవాద పెట్టుబడిదారీ విధానాన్ని అమలుచేస్తోంది. అంటే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యానికి లోబడి వ్యవహరించడానికి సిద్ధపడింది.

ఇప్పుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రదర్శిస్తున్న కండకావరం కేవలం ఇండియా వరకే పరిమితం కాదు. ఇప్పుడు రెండు విధాల సుంకాలను ట్రంప్‌ విధిస్తున్నాడు. మొదటిది ఉన్న సుంకాలను పెంచడం. వాటి విషయంలో ఆగస్టు ఒకటి నాటికి ఒప్పందం ఏదీ కుదరలేదు గనుక అమెరికన్‌ మార్కెట్లలో ఇండియా ఎగుమతుల మీద 25 శాతం అదనపు సుంకం విధిస్తారు. రెండవది పెనాల్టీ సుంకాలు. రష్యా మీద పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలను ఉల్లంఘించి ఆ దేశం నుండి చమురు కొనుగోలు చేస్తున్నందుకు గాను శిక్షగా అపరాధపు సుంకం విధిస్తారు. ఇది కాకుండా, బ్రిక్స్‌ కూటమి గురించి ట్రంప్‌ చేస్తున్న వ్యాఖ్యలను పరిశీలిస్తే ఇండియా ఆ కూటమి నుండి బయటకు రావలసి వస్తుంది లేదా ఆ కూటమిలోనే కొనసాగుతూ అమెరికన్‌ ప్రయోజనాలను నెరవేర్చేలా ఆ కూటమికి వెన్నుపోటుదారుడిగా నడుచుకోవలసి వస్తుంది. ఐతే అది తక్షణ ప్రాధాన్యత కలిగినది కాదు. తక్షణం ముందుకొచ్చినది రష్యా నుండి చమురు కొనుగోలు చేసే విషయం. ఇందులో ఇండియా వైపు నుండి పరస్పర విరుద్ధ సంకేతాలతో వస్తున్న ప్రకటనలను చూస్తే ఇండియా అమెరికాను ఎలాగైనా ప్రసన్నం చేసుకోవాలని తాపత్రయ పడడం కనిపిస్తోంది.

అమెరికా అనుమతించిన ఏ ఇతర దేశాలకన్నా కూడా రష్యా నుంచి కొనుగోలు చేసే చమురుచౌకగా లభి స్తుంది.అటువంటప్పుడు ఇండియా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం మానేస్తే అది ఇండియా ప్రయోజ నాలకే నష్టం. అటువంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాలి? గతంలో దక్షిణాఫ్రికా ప్రభుత్వం అనుసరించిన వర్ణవివక్ష విధానాలకు వ్యతిరేకంగా ఐరాస ఆంక్షలు విధించింది. ఇప్పుడు అమెరికా విధిస్తున్న ఆంక్షలు ఐరాస గతంలో ఆమో దించిన ఆంక్షల వంటివి కావు. అమెరికా, తక్కిన సామ్రాజ్యవాద దేశాలు తమను ధిక్కరించిన దేశాల మీద ఏకపక్షంగా విధిస్తున్న ఆంక్షలివి. క్యూబా, ఇరాన్‌ వెనిజులా వంటి దేశాల మీద ఇటువంటి ఆంక్షలనే విధించారు. ఈ విధంగా తమ ఆదేశాలకు తలొగ్గమని, కాదంటే ఆంక్షలు విధించడం ద్వారా ఆ ఆంక్షలకు గురైన దేశాలు తమ స్వంత ప్రయోజనాలకు తామే హాని కలిగించుకునేలా సామ్రాజ్యవాదం చేస్తోంది. ఆ క్రమంలో సామ్రాజ్యవాద దేశాలు లాభ పడ తాయి. ఈ ఆంక్షల వెనుక ఎటువంటి దాపరికమూ లేదు. ఎటువంటి గొప్ప ఆదర్శాల కోసమూ వీటిని విధించడం లేదు. మర్యాదగా తాము చెప్పినట్టు నడుచుకుంటే సరి, లేకపోతే మీ భరతం పడతాం అన్నట్టుగా అమెరికన్‌ సామ్రా జ్యవాదం వ్యవహరిస్తోంది. మూడవ ప్రపంచ దేశాలు తమ ప్రయోజనాలను తామే దెబ్బతీసుకునేట్టు చేస్తోంది.

ఈ విషయంలో మోడీ ప్రభుత్వం ఎందుకు ధైర్యంగా, నిర్ణయాత్మకంగా వ్యవహరించడం లేదు? ఎందుకు ట్రంప్‌ బెదిరింపులను తిరస్కరించడం లేదు? చైనా ఒక సోషలిస్టు దేశం గనుక దానిని పక్కన పెట్టినా, బ్రెజిల్‌ వంటి పెట్టుబడిదారీ దేశం సైతం ట్రంప్‌ను ధైర్యంగా తిరస్కరించింది. బ్రెజిల్‌ ఉత్పత్తుల మీద అమెరికా గనుక యాభై శాతం సుంకం విధిస్తే బ్రెజిల్‌ కూడా అమెరికన్‌ ఉత్పత్తుల మీద 50 శాతం సుంకాలు విధిస్తామంటూ బ్రెజిల్‌ అధ్య క్షుడు లూలా ప్రకటించాడు. బంగ్లాదేశ్‌ యుద్ధం సమయంలో ఇందిరాగాంధీ అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌ తో నిబ్బరంగా వ్యవహరించిన తీరుతో ఇప్పుడు మోడీ అనుసరిస్తున్న కాళ్లబేరం తీరును పోల్చుతూ కాంగ్రెస్‌ పార్టీ సరిగ్గానే విమర్శించింది (ఒక సందర్భంలో తాను సూటిగా ఇందిరా గాంధీ కళ్లలోకి చూసేందుకే భయపడ్డానని నిక్సన్‌ అంగీకరించాడు).
అయితే ఒక నాయకుడి లేదా నాయకురాలి ధైర్యం గాని, పిరికితనం గాని వ్యక్తిగతమైనవి కావు. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న వర్గాల దృక్పథాన్ని అవి సూచిస్తాయి. లూలా ధైర్యం వెనుక అతడి మూలాలు ఉన్న కార్మికవర్గం ఉంది. ఇక్కడ మోడీకి కార్మికవర్గం ఓట్లు పడివుండవచ్చు కాని అతడిని సాకుతున్నది బడా బూర్జువా వర్గం. అదే మాదిరిగా గతంలో నెహ్రూ గాని, ఇందిరా గాంధీ కాని అమెరికన్‌ బెదిరింపులను లెక్క చేయకపోవడం వెనుక ఉన్నది అప్పటి ఆర్థిక విధానాలు (స్వావలంబన విధానాలు). ఇప్పుడు మోడీ పిరికితనం వెనుక ఉన్నది ఇప్పటి నయా ఉదారవాద ఆర్థిక విధానాలు.

ఒక దేశం అనుసరించే విదేశాంగ విధానానికి ఆ దేశం అనుసరించే ఆర్థిక విధానంతో సన్నిహిత సంబంధం ఉంటుంది. గతంలో భారతదేశం అనుసరించిన స్వావలంబన విధానాలకు సరితూగే విధంగా అప్పటి అలీన విదే శాంగ విధానం ఉండేది. అందుకే అప్పుడు అమెరికన్‌ బెదిరింపులకు లెక్కపెట్టకుండా నిలబడగలిగింది. ఇప్పుడు అనుసరించే విధానాలు స్వావలంబనను నాశనం చేయడమే గొప్ప విజయంగా చెప్పుకుంటున్నాయి. ”మేక్‌ ఇన్‌ ఇండియా” నినాదం విదేశీ పెట్టుబడులకు బహిరంగంగా మోడీ పలికిన స్వాగతం. నయా ఉదారవాద విధానాలు వచ్చిందే మూడవ ప్రపంచ దేశాల స్వావలంబన శక్తిని నాశనం చేయడానికి. అప్పుడే అవి సామ్రాజ్యవాదులు ఆడమన్నట్టల్లా ఆడతాయి.

మన దేశంలో నయా ఉదారవాద విధానాలను ప్రవేశపెడుతున్నప్పుడు దాన్ని సమర్ధించుకుంటూ ముందుకు తెచ్చిన వాదనలు ఏమిటి? ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, శాశ్వతంగా కొనసాగే పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చిందని, అందులో పెట్టుబడి ప్రపంచవ్యాప్తంగా సంచరిస్తుందని, మూడవ ప్రపంచ దేశాల్లో వేతనాల స్థాయి తక్కువ గనుక ఇక్కడికి పెట్టుబడుల ప్రవాహం వచ్చిపడు తుందని, దాని ఫలితంగా ఇక్కడ వెనుకబాటుతనాన్ని అధిగ మించగలుగుతామని, పేదరికాన్ని నిర్మూలించగలుగు తామని వాదించారు. ఈ వాదనలలో స్పష్టంగా ఒక లోపం కనిపిస్తుంది. శాశ్వతమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంటూ ఏదీ ఉండదు అన్న సత్యాన్ని ఈ వాదనలు విస్మరించాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అన్నవి సామ్రాజ్యవాదపు సృష్టి మాత్రమే. వాటిని ఆ సామ్రాజ్యవాదమే తనకి అవసర మైనప్పుడు మార్చేస్తుంది. అలా సామ్రాజ్యవాదం తన అవసరాల కోసం మార్చిన ప్రతీ సందర్భంలోనూ ఆ ఆర్థిక వ్యవస్థ చట్రంలో ఇరుక్కున్న ఇండియా వంటి దేశాలకు పరిస్థితి ప్రాణ సంకటంగా మారుతుంది.

ఒకసారి ఏ దేశమైనా అంతర్జాతీయ వాణిజ్యం మీద ప్రధానంగా ఆధారపడడం మొదలైతే, ఆ వాణిజ్యంలో ఎటువంటి అవాంతరాలు వచ్చినా, దాని ఫలితంగా ఆ దేశం బాగా దెబ్బతింటుంది. అందుచేత సామ్రాజ్యవాదం బెదిరింపుల కు దిగిన ప్రతీసారీ, అది రాజీ చేసుకోడానికి తయారౌతుంది. అయితే ఆ రాజీ చేసుకునే క్రమంలో ఆ దేశం గనుక తన ఆర్థిక వ్యవస్థలో పెద్ద స్థాయిలో సర్దుబాట్లు చేసుకోవలసిన అగత్యం ఏర్పడితే అప్పుడు అది తన దేశంలోని బడా బూర్జువా వర్గం నుండి, పట్టణ మధ్యతరగతి వర్గాల నుండి వ్యతిరేకతను చవిచూడవలసి వస్తుంది. ఎందుకంటే, ఇంతవరకూ ఇండియా అనుసరించిన నయా ఉదారవాద విధానాల ఫలితంగా ప్రధానంగా ప్రయోజనాలు పొందినవి ఆ రెండు వర్గాలే. ఆ వర్గాల ప్రయోజనాలను కాపాడడానికే మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది కూడా. ఇప్పుడు అమెరికా బెదిరింపులకు లొంగి ఆ వర్గాలకే ఇబ్బంది కలిగించే విధంగా ఆర్థిక విధానాలను మార్చు కోవలసి వస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి?
సామ్రాజ్యవాద పెత్తనం నుండి బయటపడి స్వతంత్రంగా మనగలగడం అంటేనే నయా ఉదారవాద వ్యూహాన్ని తిరస్కరించడం. 1990కి మునుపు నడిచిన ప్రభుత్వాలు ఈ వాస్తవాన్ని గ్రహించాయి గనుకనే ఆ కాలంలో సామ్రాజ్యవాదుల రౌడీయిజానికి అవి భయపడతేదు. నయా ఉదారవాద విధానాలను ఎప్పుడైతే చేపట్టడం జరిగిందో, అప్పటి నుంచే మన దేశ స్వాతంత్య్రం విషయంలో పరిమితులు ఏర్పడడం మొదలైంది. ఇప్పుడ ట్రంప్‌ రౌడీయిజం చూస్తే ఈ వాస్తవం అందరికీ స్పష్టంగా బోధపడుతుంది.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్‌ పట్నాయక్‌

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img