‘ఆకలికి అన్నం, రోగానికి మందు’ అంటారు. ఆకలి తీర్చడం సంగతేలా ఉన్నా…రోగానికి మాత్రం మందు కావాల్సిందే. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే అధిక రక్తపోటు, మధుమేహ బాధితుల కోసం ఒక్కఏడాదిలో ప్రభుత్వం కొనుగోలు చేసిన మాత్రల సంఖ్య అక్షరాలా 55,69,98,087…అది కూడా ప్రభుత్వ ఆస్పత్రులకే. ఇక ప్రయివేటు ఆస్పత్రుల సంగతి వేరే. రాష్ట్రంలో అధిక రక్తపోటు, మధుమేహం బాధి తుల సంఖ్య భారీగా పెరిగిపోతోందనేందుకు ఇదే రుజువు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఇలా ఉంటే మిగతా దేశమంతా పరిస్థితి ఏంటి? వాస్తవం ఇదైతే.. కేంద్ర ఆరోగ్యశాఖ మాత్రం పార్లమెంట్ వేదికగా నిస్సిగ్గుగా షుగర్, హైబీపీలకు ‘పసుపే సర్వరోగ నివారిణి’ అని చెప్పుకొచ్చింది. పసుపుతో రోగాలన్నీ పోతాయని చెబుతున్నది.
పసుపులో కొన్ని యాంటీబయోటిక్ గుణాలుండవచ్చు కాక…కానీ, అదే అన్ని రోగాలకు దివ్యౌషధం అంటే శాస్త్రీయతకు నిలబడే విషయమేనా? అదికూడా దీర్ఘకాలంగా వేధించే షుగర్, హైబీపీ, మైగ్రెయిన్‌లను కంట్రోల్ చేస్తుందని, ఎనీమియా, సోరియాసిస్, కంటి వాపును నివారిస్తుందని… పైల్స్‌ను నయం చేస్తుందని, కిడ్నీలో రాళ్లనూ కరిగిస్తుందని చెబుతున్నారు. మొన్నమొన్నటి వరకు ‘గోమూత్రం సర్వ రోగ నివారిణి’ అని సెలవిచ్చిన పెద్దలు, నేడు పసుపు సర్వరోగ నివారిణి అంటున్నారు. ఇలాంటి తలాతోకలేని మాటలకు శాస్త్రీయతను ఆపాదించి, ధృవీకరించుకోవాలనే తపనతో కేంద్రప్రభుత్వం ఇప్పుడు వైద్యరంగాన్ని ఆశ్రయించింది. అందులో భాగంగానే సీసీఆర్‌ఏఎస్, ఐసీఏఆర్, ఐసీఎంఆర్ వంటి సంస్థలు రీసెర్చ్ చేశాయంటూ నమ్మబలుకుతున్నది.
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాస్త్రీయతకు బదులు అశాస్త్రీయ భావాలను ఎక్కువగా విస్తరింప చేస్తున్నది. సాక్షాత్తు ప్రధానమంత్రే నేషనల్ సైన్స్ కాంగ్రెస్‌లో కౌరవులు కుండలో పుట్టారని, అదే ‘టెస్ట్ ట్యూబ్ బేబీ’ అని చెప్పారు. విమానాన్ని రైట్ సోదరులు కనిపెట్టకముందే ‘పుష్పక విమానం’ ఉండేదని, అందులో ఎంతమంది ఎక్కినా ఇంకొకరికి చోటు ఉంటుందని తెలిపారు. శివుడు వినాయకునికి ఏనుగు తల పెట్టాడని అదే ‘ప్లాస్టిక్ సర్జరీ’ అని ప్రస్తావించారు. వాస్తవానికి మనిషికి జంతువు తలను పెట్టి సర్జరీ చేయడం సాధ్యమా? స్వయంగా ఆ పార్టీ ఎంపీ గోమూత్రం తాగడం వల్లే లంగ్‌ఇన్ఫెక్షన్ నయమైందని, కరోనా తన దరిచేరలేదని చెప్పారు. గోమూత్రం ప్రాణరక్షణ పానియం అని కూడా సెలవిచ్చారు. గోమూత్రం, ఇతర గోసంబంధ ఉత్పత్తుల మిశ్రమాన్ని తీసుకున్నందునే తన క్యాన్సర్ నయమైందని చెప్పిన సదరు ఎంపీనే ఎయిమ్స్‌లో చికిత్సపొందిన విషయం తెలిసిందే. ప్రపంచమంతా సైన్స్‌ను నమ్ముకుని పరిశోధన చేస్తుంటే మన పాలకులు మాత్రం అశాస్త్రీయ ఆలోచనల చట్రంలో ప్రజలను బంధించే పనిని చాలా ఆత్మవిశ్వాసంతో చేస్తున్నారు. బోలేబాబా పాద ‘ధూళి’ సేకరించి, దాన్ని వంటికి రాసుకుంటే శరీరంలో ఉన్న రోగాలన్నీ నయమవుతాయని ప్రజలను నమ్మించారు. అలా ఆ ధూళిని సేకరించడానికి వెళ్లి 121మంది ప్రాణాలే కోల్పోయారు. కుంభమేళాలో మునిగితే సకల రోగాలు పోతాయంటే విదేశాల నుంచి కూడా వచ్చారు. తీరా ఏమైంది? వారు అంటురోగాల బారిన పడిన వారి దేశాలకు పరుగులు తీసిన సంగతి తెలిసిందే.
ఆయుర్వేదాన్ని, అల్లోపతిని కలిపేసి ‘మిక్సోపతి’ అంటూ తలతిక్క ఆలోచనలు చేయడంలో వారికి వారేసాటి. ఆయుర్వేద చరక సంహితను, అలెగ్జాండర్ పెన్సిలిన్‌ను ఒకేగాటన కట్టేసి, వైద్యరంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామని కొత్త ఇంటిగ్రేటెడ్ కోర్సు(ఎంబీబీఎస్-బీఏఎంఎస్) ప్రణాళికను ప్రకటించిన అదే కేంద్రమంత్రి నేడు పసుపు పాఠాలు చెబుతున్నారు. అదే వాస్తవమైతే దీనికి ప్రాచుర్యం పెరగాలి… డాక్టర్లు కూడా ఇది మంచిదని సూచించాలి…కానీ అలా జరగడం లేదు. కేవలం ఒక పార్టీకి చెందిన నేతలే ఇలా ప్రకటనలు చేస్తున్నారు తప్ప…కేంద్రం చెబుతున్న గోమూత్రం, పసుపు చికిత్సలు పూర్తి అశాస్త్రీయమైనవి, హేతుబద్ధతలేని లేనివి. ఇలాంటి ప్రచారం వల్ల ఏవైనా దుష్పరిణామాలు సంభవిస్తే బాధ్యులెవరు? ఇలాంటి ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పాలి?
నిజానికి వారు అంటున్నట్టు వంటిల్లే ఔషదశాల అయి…అందులో పసుపే ఎన్నో రోగాలకు దివ్యౌషదమైతే… మనది రోగవిముక్తి దేశం ఎప్పుడో కావాలి. ఎందుకంటే మన దేశంలో పసుపు లేని వంటలుండవు. కానీ, షుగర్, హైబీపీ, మైగ్రెయిన్, ఎనీమియా, సోరియాసిస్, పైల్స్, కిడ్నీలో రాళ్లను ‘జయించే’ గుణాలు పసుపునకు ఉన్నాయని కేంద్రమంత్రి చెబుతున్నారో ఆ రోగాలే నేడు దేశాన్ని తీవ్రంగా వేధిస్తున్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి వంటింటి చిట్కాలతో ప్రభుత్వాలు తమ బాధత్య నుంచి తప్పుకోజాలవు.
అమాత్య ‘వైద్యం’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES