ఆగష్టు 12 అంతర్జాతీయ యువ దినోత్సవం. ఈరోజు కేవలం ఉత్సవంగా కాకుండా, యువతకు రాజకీయ హక్కులు, నాణ్యమైన విద్య, సరైన ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన తక్షణ అవసరాన్ని గుర్తుచేసే రోజుకావాలి. ఇవి అందకపోతే, మనం గర్వంగా చెప్పుకునే యువ జనాభా లాభం వృథా అవుతుంది. ఎందుకంటే, భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశం. నివేదికల ప్రకారం.. మన దేశం మొత్తం జనాభాలో పదిహేను నుండి 29 ఏళ్ల వయసున్న యువ జనాభా 42 కోట్ల మంది. వీరు మొత్తం జనాభాలో సుమారు 29 శాతం. యువత సగటు వయస్సు కేవలం 28.4 సంవత్సరాలు. కానీ, రాజకీయ రంగంలో యువత ప్రాతినిధ్యం ఇంకా పరిమితంగానే ఉండటం ఆందోళన కలిగించే అంశం. దేశంలో యువత అధికం ఉన్నప్పటికీ, ప్రతినిధుల వయస్సు పెరుగుతోంది. 17వ లోక్‌సభలో 41 ఏండ్ల లోపు ఎంపీలు కేవలం 64 మంది మాత్రమే.ఇది యువతలో రాజకీయ శూన్యతను ఎత్తిచూపుతోంది.
విద్యారంగం కూడా సమాన సవాళ్లను ఎదుర్కొంటోంది. 15-24 ఏళ్ల వయస్సు గల యువతలో సాక్షరత రేటు 81శాతం మాత్రమే. పురుషుల్లో 84.4శాతం, మహిళల్లో 74.4శాతం. రాష్ట్రాల వారీగా చూస్తే, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో యాభై శాతానికి పైగా యువత డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదువు పూర్తిచేస్తుంటే, బీహార్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సంఖ్య 20 నుంచి 22 శాతం మాత్రమే. కొన్నిచోట్ల 25శాతం యువతకే ప్రాథమిక విద్య ఉంది. యునెస్కో నివేదిక ప్రకారం, ”లెర్నింగ్ పావర్టీ” ఇంకా కొనసాగుతూనే ఉంది అనేక పిల్లలు పాఠశాలకు వెళ్లినా సాదాసీదా వాక్యాన్నే అర్థం చేసుకోలేకపోతున్నారు. ఉపాధ్యాయుల కొరతతో, పాఠశాలల్లో విద్యార్థి ఉపాధ్యా య నిష్పత్తి 40:1 కంటే ఎక్కువగా ఉంది. ఆర్థిక వృద్ధి రేటు కూడా ఆందోళన కలిగిస్తోంది. 2003-15 మధ్య దేశం సగటున 7.8 శాతం వృద్ధి సాధించినా, 2014-24లో ఇది 5.8శాతానికి పడిపోయింది. అంతర్జాతీయ అంచనాల ప్రకారం 2020-30లో భారత వృద్ధి రేటు 6.7శాతానికి మించదట. ఎనిమిది శాతం వృద్ధి రేటు సాధించకపోతే, యువ జనాభా లాభం చేజారిపోతుంది. తయారీ రంగం 2014లో 17శాతం నుంచి 2022లో 13శాతానికి పడిపోవడం ‘మేక్ ఇన్ ఇండియా’ ఆశలపై నీళ్లు చల్లింది.
ఉద్యోగ అవకాశాల లోటు పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది. యువ నిరుద్యోగం 2017-18లో 17.8శాతం ఉండగా, 2022-23లో పది శాతానికి తగ్గింది. కానీ 2024లో మళ్లీ 16.03శాతానికి పెరిగే అవకాశం ఉంది. దేశంలోని నిరుద్యోగుల్లో 83శాతం మంది యువతే. 2022లో నిరుద్యోగ యువతలో 65.7శాతంమంది కనీసం మాధ్యమిక విద్య లేదా అంతకంటే ఎక్కువ అర్హత కలవారు అంటే చదువు ఉన్నా ఉద్యోగం లేదు. ఇది విద్యలో నేర్పే నైపుణ్యాలు, ఉద్యోగ మార్కెట్ అవసరాల మధ్య ఉన్న అంతరాన్ని చూపిస్తోంది.పట్టభద్రుల్లో నిరుద్యోగ రేటు 29.1శాతంగా ఉందని అంతర్జాతీయ కార్మిక సంస్థ – భారతదేశ ఉపాధి నివేదిక 2024 తెలిపింది. ఇది వారి నైపుణ్యాలకు, ఉద్యోగ మార్కెట్ అవసరాలకు మధ్య ఉన్న అంతరాన్ని స్పష్టంగా సూచిస్తోంది. ఉద్యోగ లేమి, ఆర్థిక అనిశ్చితి, సామాజిక ఒత్తిళ్లు, పోటీ వాతావరణం వంటివి యువతపై తీవ్రమైన మానసిక ఒత్తిడిని పెంచుతోంది. 2022లో కేవలం 15.6శాతం యువతే వృత్తి శిక్షణ పొందగా, వారిలో కేవలం నాలుగు శాతం మందికే అధికారిక సర్టిఫికేషన్ వచ్చింది. ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన కింద 1.6కోట్ల యువత శిక్షణ పొందినా, వారిలో పదిహేను శాతం మందికే ఉద్యోగం దొరికింది. కొన్ని రాష్ట్రాల్లో ఉదాహరణకు కర్నాటకలో ”యువనిధి” పథకం నమోదైనవారు ఎక్కువైనా, శిక్షణ పొందిన వారు తక్కువ. నిరుద్యోగ భృతి కోల్పోతామనే భయం, అవగాహన లోపం పాల్గొనడాన్ని అడ్డుకుంటున్నాయి. తెలంగాణలో, రాజీవ్ యువ వికాసం పథకానికి 16 లక్షల దరఖాస్తులు వచ్చినప్పటికీ, కొత్త సంక్షేమ పథకాలు వాయిదా పడటంతో ఇది తాత్కాలికంగా నిలిచిపోయింది.
రాజకీయ భాగస్వామ్యం, విద్యా నాణ్యత, ఉద్యోగ అవకాశాలు ఈ మూడు రంగాల్లో లోపాలు ఉన్నప్పుడు, యువతను సమర్థంగా దేశాభివృద్ధి దిశగా నడిపించడం కష్టసాధ్యం. అంతర్జాతీయ యువ దినోత్సవం కేవలం జ్ఞాపక దినం కాకుండా, చర్యకు పిలుపుగా మారాలి. యువతకు నిజమైన రాజకీయ స్వరం, నాణ్యమైన విద్య, తగిన నైపుణ్యాలు, విస్తృత ఉపాధి అవకాశాలు అందించాలి. 2040 తర్వాత యువ జనాభా లాభం మన చేతుల్లో ఉండదు. కాబట్టి, ఇప్పటినుంచే ధైర్యవంతమైన చర్యలు తీసుకుంటే, భారత యువత దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించే ప్రధానశక్తిగా నిలుస్తుంది. ఇదే మన యువతకు, దేశానికి అసలు సందేశం.
దన్నంనేని సంపత్ కృష్ణ
9849097835