Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంపాతదే కొత్తగా 'సారథి'

పాతదే కొత్తగా ‘సారథి’

- Advertisement -

– సమస్యలు పట్టించుకోని రవాణాశాఖ
– అవగాహన లేక.. సేవలు పొందడంలో వినియోగదారుల ఇబ్బందులు
– అవసరమైన సామగ్రి పూర్తిస్థాయిలో లేకుండానే ముందుకు..
– నగరంలో ప్రయోగాత్మకంగా అమలు.. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా..
నవతెలంగాణ-సిటీబ్యూరో

రవాణాశాఖ తమ వినియోగదారులకు మరింత పారదర్శకంగా, మెరుగైన సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘సారథి’ పోర్టల్‌ను అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత ప్రయోగాత్మకంగా తిరుమలగిరి, ఆ తర్వాత ఖైరతాబాద్‌ ఆర్టీఏ ఆఫీసుకు ఈ సేవలను విస్తరించింది. నేటి నుంచి రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాలకు విస్తరించే పనులు చేపట్టింది. తద్వారా వాహన యజమానులకు సంబంధించిన లర్నింగ్‌ లైసెన్స్‌, శాశ్వత డ్రైవింగ్‌ లైసెన్స్‌తో పాటు రెన్యూవల్‌, చిరునామా మార్పు, తదితర సేవలన్నీ ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్‌లోనే పొందే వీలుంది. కానీ సారథి పోర్టల్‌, స్లాట్‌ బుకింగ్స్‌ ఎలా చేసుకోవాలి అనే అంశాలపై ఎక్కడా వినియోగదారులకు అవగాహన కల్పించకలేదు. దాంతో స్లాట్‌ బుకింగ్‌, డాక్యుమెంట్స్‌ అప్‌లోడ్‌ సమయంలో ఎదురవుతున్న టెక్నికల్‌ సమస్యలకు సకాలంలో పరిష్కారమూ చూపకపోవడంతో వినియోగదారులు రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరుగుతూ నానాయాతన పడుతున్నారు. ఈ నేపథ్యంలో నగర పరిధిలోని ఆఫీసుల్లో వస్తున్న టెక్నికల్‌ తప్పులకు మార్గం చూపించకుండా.. రవాణా శాఖ ఉన్నతాధికారులు రాష్ట్రమంతా విస్తరణ కు చర్య లు తీసుకోవడం వల్ల ఇబ్బందులు తప్పవనే అభి ప్రాయం వ్యక్త మవుతోంది. ఎవరో ఒత్తిడికి తలొగ్గి విస్తరణకు చర్యలు తీసుకుంటే వినియోగదారులు, వాహన యాజమానులే బలవుతారని విషయాన్ని అధికారులు గుర్తించాలని చెబుతున్నారు.

ఇప్పటివరకు రాష్ట్ర రవాణాశాఖ సిటీజన్‌ ఫ్రెండ్లీ సర్వీసెస్‌ ట్రాన్స్‌పోర్ట్‌(సీఎఫ్‌ఎస్‌టీ) పోర్టల్‌ ద్వారా వివిధ రకాల పౌర సేవలను అందచేసింది. మరింత పారదర్శకమైన సేవల కోసమంటూ కేంద్రం పరిధిలోని సారథిలోకి 5 నెలల క్రితం ప్రవేశించింది. మార్చి 30న ఈ పోర్టల్‌ను సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి ఆర్టీఏ ఆఫీసులో ప్రయోగాత్మకంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రారంభించారు. గత నెల 26న ఖైరతాబాద్‌ ఆర్టీఏ ఆఫీసుకు సారథి సేవలను విస్తరించారు. అనంతరం సిటీలోని అన్ని ఆఫీసుల్లోకి విస్తరించగా.. ఇప్పుడు రాష్ట్రమంతా ఈ సేవలను విస్తరించేలా ఆర్టీఏ అధికారులు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ పోర్టల్‌ ద్వారా ఆర్టీఏకు సంబంధించిన సుమారు 20 వరకు సేవలు పౌరులకు అందుబాటులో ఉన్నాయి. అయితే తరచూ సాంకేతిక సమస్యలు ఏర్పడటంతో చిన్న చిన్న పనుల కోసం గంటలు, రోజుల తరబడి ఇబ్బందులు పడుతున్నట్టు వాహనదారులు ఆరోపిస్తున్నారు. అంతేగాక ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుకింగ్‌ సమయంలో అవసరమైన డాక్యుమెంట్లు, ఫొటోలను సారథిలో అప్‌లోడ్‌ చేసుకోవాలన్నా గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని వాపోతున్నారు.

ఉదాహరణకు ఖైరతాబాద్‌ ఆర్టీఏ పరిధిలో నివసించే ఓ వ్యక్తి వారం రోజుల క్రితం అమెరికా నుంచి ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ పర్మిట్‌ రెన్యూవల్‌ కోసం సారథి అప్లికేషన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. కావాల్సిన ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేసి.. నిర్దేశిత ఫీజు చెల్లించారు. ఐడీపీ రెన్యూవల్‌కు అప్‌లోడ్‌ చేసిన డాక్యుమెంట్లతో పాటు విదేశాల్లో ఉన్నట్టు ధ్రువీకరించే లెటర్‌ ఇండియన్‌ ఎంబసీ ద్వారా తీసుకుని లైసెన్స్‌ రెన్యూవల్‌కు తన తల్లిదండ్రులను ఆర్టీఏ కార్యాలయానికి పంపించారు. డాక్యుమెంట్లను పరిశీలించిన అధికారులు ఐడీపీ కావాలనుకునే వ్యక్తి ప్రత్యక్షంగా వచ్చి ఫొటో, సిగేచర్‌ చేస్తేనే రెన్యూవల్‌ ప్రోసిజర్‌ పూర్తవుతుందని చెప్పడంతో వారు షాక్‌కు గురయ్యారు. సారథి ద్వారా ఎక్కడినుంచైనా స్లాట్‌ బుక్‌ చేసుకొని.. రెన్యూవల్‌ చేసుకునే వీలుందని చెప్పారు కదా అని అడగ్గా.. అది ‘ఫేస్‌లెస్‌’ సేవలు అమలులోకి వచ్చిన తర్వాతే అని చెప్పడంతో వారు విస్మయానికి గురయ్యారు. నగరానికి చెందిన మరో వ్యక్తి పాత డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌కు కోసమని స్లాట్‌ బుక్‌ చేసుకుంటే.. ఎప్పుడో ఇచ్చిన మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వెళ్లింది. దాంతో అతను స్లాట్‌ బుక్‌ చేసుకోలేకపోయారు. అధికారులను సంప్రదించి పాత నెంబర్‌ స్థానంలో కొత్త నంబర్‌ అప్‌డేట్‌ చేసుకున్నారు. దానికోసం సంబంధిత ఆర్టీవోను సంప్రదిస్తేనే పని అయ్యింది. ఇలాంటివి రోజుకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. సారథి పోర్టల్‌తో ఒరిగిందేమీ లేదని వాపోతున్నారు.
సిబ్బందికి తప్పని ఇక్కట్లు
వాస్తవానికి రవాణాశాఖలో ఇప్పుడున్న కంప్యూటర్లు, ఇతర సామగ్రి ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం సారథి అప్లికేషన్‌ అమలుకు కూడా వాటినే వినియోగిస్తున్నారని తెలిసింది. సాధారణంగా కొత్త సాఫ్ట్‌వేర్‌ అమలు సమయంలో అందుకు తగినట్టుగానే సిస్టమ్స్‌ అప్‌గ్రేడ్‌కు అవసరమైన చర్యలు తీసుకుంటారు. కానీ రవాణాశాఖ ఆ దిశగా పూర్తి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. ఫలితంగా సారథి సాఫ్ట్‌వేర్‌ నెమ్మదిగా పనిచేయడం, దాంతో పని చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవడం లేదా ఆగిపోతుండటం జరుగుతుంది. వినియోగదారుల వివరాలు, ఇతర డేటా నమోదు చేస్తున్న సమయంలో సర్వర్‌ పనిచేయకపోవడంతో ఎక్కువ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. లావాదేవీ పూర్తయిన విషయం కూడా తెలియడం లేదు. అంతా అసంపూర్తిగానే ఉండటం అటు సిబ్బందిని ఇటు వినియోగదారులను గందగోళంలోకి నెట్టేస్తున్నాయి

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Advertisement
Advertisement
Ad