– ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
– చింతకుంట బాలికల గురుకుల పాఠశాల తనిఖీ
– దొడ్డు బియ్యం సరఫరాపై మంత్రి ఆగ్రహం
నవతెలంగాణ -కరీంనగర్
గురుకులాల్లో చదువుతున్న ఎస్సీ, పేద విద్యార్థుల సంక్షేమం విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదనీ, పేద విద్యార్థుల చదువులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా కొత్తపెల్లి మండలం చింతకుంట బాలికల గురుకుల పాఠశాలను మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం వండిన ఆహారాన్ని పరిశీలించిన ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుండగా, దొడ్డు బియ్యం ఎందుకు పెడుతున్నారని అధికారులను ప్రశ్నించారు. పేద విద్యార్థులు చదువుకునే గురుకుల పాఠశాలకు దొడ్డు బియ్యం పంపిణీ చేయడం ఏంటని డీఎస్‌ఓపై ఫోన్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఈ విషయంపై సివిల్ సప్లయిస్ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహన్‌తో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. రెండు రోజుల్లో ఈ సమస్య పరిష్కారం చేయాలని కమిషనర్‌కు సూచించారు. రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లకు దొడ్డు బియ్యం సరఫరా చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడా ఇలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గురుకులంలో మెస్ పరిసరాలు మెరుగుపరచాలని, శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం పిల్లలతో కలిసి మంత్రి భోజనం చేశారు. ఏమైనా సమస్యలు ఉంటే అధి కారులు, తమ దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు మంత్రి సూచించారు.
విద్యార్థుల సంక్షేమంలో రాజీపడం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES