నవతెలంగాణ – దుబ్బాక
దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట 10 వ, 11 వ వార్డుల్లో గత కొద్ది రోజులుగా పందుల బెడద ఎక్కువైంది. ఈ రెండు వార్డుల్లో ఎక్కడపడితే అక్కడ ఇవి దర్శనమిస్తున్నాయి. దీంతో ఇంటి పరిసరాలు అపరిశుభ్రంగా తయారై దుర్వాసన వస్తుందని పిల్లలు, వృద్దులు అనారోగ్యాల బారిన పడుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాకాలం కావడంతో పందులు, పారిశుద్ధ్య లోపంతో ప్రజలు మరింత అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. పలు కాలనీల్లో గడ్డి, పిచ్చి మొక్కలను తొలగించకపోవడం, పారిశుద్ధ్య పనుల్ని సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల ప్రజలు ఈగలు, దోమలతో సతమతమవుతున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే పందుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.