సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సీతారాం ఏచూరి కి నివాళి
నవతెలంగాణ – దుబ్బాక
బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం నిరంతరం పరితపిస్తూ..ప్రజా సమస్యలపై ప్రభుత్వాలను నిలదీసిన గొప్ప నాయకుడు సీతారాం ఏచూరి అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీ. భాస్కర్ అన్నారు. ఏచూరి ప్రజా పోరాటాల్ని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయ సాధనకు పార్టీ శ్రేణులు, సానుభూతిపరులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. దివంగత సీపీఐ(ఎం) జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి జయంతి సందర్భంగా మంగళవారం దుబ్బాకలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సీతారాం ఏచూరి 1974 లో ఎస్ఎఫ్ఐ లో, 1984లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీకి ఎన్నికై 1992 నుంచి 2014 వరకు పొలిట్ బ్యూరో సభ్యులుగా, 2015 నుంచి 2024 వరకు సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారని, 1996 లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం, 2004 లో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియన్స్ ప్రభుత్వం, 2023లో ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్ సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటు నిర్మాణ ప్రక్రియలో సీతారాం ఏచూరి చురుగ్గా వ్యవహరించినట్లు తెలిపారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పార్లమెంట్లో దేశ ప్రజల సమస్యలపై నిరంతరం ప్రభుత్వాలను నిలదీస్తూ ప్రజా అనుకూలమైన విధానాల్ని ప్రతిపాదించే నాయకుడిగా, ఉత్తమ పార్లమెంట్ సభ్యులుగా సీతారాం ఏచూరి పలుసార్లు అవార్డులు పొందారని గుర్తు చేశారు. సీపీఐ(ఎం) దుబ్బాక మండల, పట్టణ కార్యదర్శులు సింగిరెడ్డి నవీన, కొంపల్లి భాస్కర్, నాయకులు ఎండీ.సాదిక్, బత్తుల రాజు, ఎల్లం లక్ష్మీ నర్సయ్య, మల్లేశం, మహేష్, ఎండీ.సాజిద్ పలువురున్నారు.
ప్రజా సమస్యలపై ప్రభుత్వాలను నిలదీసిన నాయకుడు సీతారాం ఏచూరి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES