లింగంనేని సుజాత… డెబ్బై ఏండ్లు దాటినా సాహిత్యంపై అభిలాషతో కథలు రాస్తున్నారు. వివిధ పత్రికలకు కాలమ్స్ నిర్వహిస్తున్నారు. తమిళ గడ్డపై ఉన్నా తెలుగుపై అభిమానంతో సాహిత్యానికి విశేష సేవలు అందిస్తున్నారు. ఈ వయసులోనూ ఎంతో ఆరోగ్యంగా ఉంటూ తన అభిలాషను కొనసాగిస్తున్నారు. తన సేవలకు గుర్తుగా అనేక పురస్కారాలు అందుకున్న ఆమె పరిచయం ఆమె మాటల్లోనే…
నేను కృష్ణా జిల్లా, గుడివాడ మండలం, దొండపాడు గ్రామంలో 1944లో జన్మించాను. అమ్మ అనసూయ, నాన్న తుమ్మల రామారావు. నాన్న మద్రాసు గిండీ ఇంజనీరింగ్ కాలేజీలో చదివారు. 1947 మే నెలలో బళ్ళారి జిల్లా రామసాగరం అనే ఊరిలో ఉద్యోగంలో చేరారు. అమ్మ నాన్నలకు మేము నలుగురు సంతానం. అందరూ ఆడపిల్లలమే. నేనే పెద్దదాన్ని. నాకు ఐదేండ్లు రాగానే స్కూల్లో చేర్పించారు. ‘మనం తెలుగు వాళ్ళం, కన్నడంలో చదివిస్తే ఎలా అని’ అమ్మ తన పుట్టింటికి వెళ్ళినప్పుడు అమ్మమ్మ ఇంటి ఎదురుగా ఉన్న ప్రైవేట్ స్కూల్లో నన్ను చేర్పించింది. ఆ స్కూల్లో నాలుగేండ్లు చదివాను. పక్క ఊరి మోటూరు హైస్కూల్లో ఏడవ తరగతిలో చేరాను. అక్కడే ఎనిమిది వరకు చదువుకున్నాను.
చదువు మానేయాల్సి వచ్చింది
మా నాన్నకు పి.డబ్ల్యూడిలో గవర్నమెంటు ఉద్యోగం వచ్చి కడప జిల్లా, పోరుమామిళ్ల బదిలీ చేశారు. తొమ్మిది, పది, పదకొండో తరగతులు చదివి ఎస్.ఎస్.ఎల్.సి పబ్లిక్ పరీక్ష రాసి పాసయ్యాను. ఆ స్కూల్లో ఎస్.ఎస్.ఎల్.సి చదివి పాసైన మొదటి ఆడపిల్లను నేనే. అయితే పద్నాలుగేండ్లకే ఎస్.ఎస్.ఎల్.సి పాసైనందువల్ల రూల్ ప్రకారం కాలేజీలో చదవడానికి నాకు అర్హత లేదన్నారు. పైగా మా అమ్మతో బంధువులు ‘ఆడపిల్లకు ఇంకా చదువెందుకు? మన కులంలో కట్నాలు ఎక్కువ. నీకు నలుగురు ఆడపిల్లలున్నారు’ అన్నారు. ఆ విధంగా నా కాలేజీ చదువు ఆగిపోయింది.
మధ్యలో ఆగిపోయింది
పదహారేండ్ల వయసులో అమ్మ రెండవ తమ్ముడు బసవ శంకరరావుతో వివాహం జరిగింది. ఆయన అప్పటికి గుడివాడ కాలేజీలో బి.ఏ. చదివారు. మా పెండ్లి జరిగిన తర్వాత ఆయన ఎస్.వి.యూనివర్సిటీ తిరుపతిలో ఎం.ఏలో చేరారు. అప్పుడు నేను పుట్టింట్లోనే ఉన్నాను. ఆ రోజుల్లో మా నాన్న కడపలో ఇంజనీరుగా ఉద్యోగం చేసేవారు. మా పక్క వీధిలో వొకేషనల్ ట్రైనింగ్ కాలేజి ఉందని తెలుసుకుని, అందులో డి.కాం.కోర్సులో చేరాను. ఎస్.ఎస్.ఎల్.సి. పాసైన వారు మూడేండ్లు చదివితే డి.కాం. సర్టిఫికెట్ ఇస్తారు. అందులో టైపు, షార్ట్ హ్యాండ్, కామర్సు, బ్యాంకింగ్, అకౌంటెన్సీ ఇంకా కొన్ని సబ్జెక్టులు ఏడాదిన్నర చదివాను. ఇంతలో మా నాన్నకు ఆ ఊరి నుండి ట్రాన్స్ఫర్ అయింది. నా చదువు ఆగిపోయింది. ఆ తర్వాత హిందీ పరీక్షలకు ప్రైవేటుగా చదివి విశారద పాసయ్యాను. ఎంబ్రాయిడరీ, కుట్లు, అల్లికలు నేర్చుకున్నాను.
చెన్నై పయనం…
చిన్నప్పటి నుండి మా ఇంటికి వచ్చే వార పత్రికలు ఆంధ్ర ప్రభ, ఆంధ్ర పత్రిక చదివేదాన్ని. దీని వల్ల నాకు సాహిత్యంపై ఆసక్తి పెరిగింది. ఒకటి, రెండు కథలు రాసి ప్రచురణకు పంపించాను. కానీ ప్రచురింప బడలేదు. నిరాశ చెందాను. ఇంతలో మా వారు ఎం.ఏ. పాసై పిహెచ్.డిలో చేరారు. యు.జీ.సి. స్కాలర్షిప్ వచ్చిన తర్వాత నన్ను తిరుపతికి తీసుకెళ్లి కాపురం పెట్టారు. మా వారి గురువు ప్రొఫెసర్ పింగళి లక్ష్మీకాంత్ ఇంటికి నన్ను తీసుకువెళ్లారు. ఆయన భార్య నాతో ‘పద్మావతి కాలేజీలో చేరి చదువుకోమ్మా!’ అని సలహా ఇచ్చారు. అప్పటికి నేను మూడు నెలల గర్భవతిని. ఒకరి తర్వాత మరొకరు పిల్లలు పుట్టారు. దాంతో చదువుకోలేకపోయాను. మావారు పిహెచ్.డి. పూర్తి చేసి 1968లో మద్రాసు రాజధాని కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. అప్పటి నుండి చెన్నైలో ఉంటున్నాము. ఇక నేను ఉద్యోగం గురించి ఆలోచనే మానేశాను.
మొదటిసారి గొంతువిప్పాను
మా పిల్లలిద్దరూ బాగా చదువుకున్నారు. మావారిని 2015లో తెలుగు భాషా దినోత్సవం నాడు అప్పటి ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు విజయవాడలో ఇరవై ఐదు వేలు ఇచ్చి సన్మానం చేశారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మద్రాసు రాజధాని కళాశాలలో సన్మానం చేశారు. ఆ రోజున మా వారి శిష్యురాలు కన్యకా పరమేశ్వరి కాలేజి ప్రిన్సిపాల్ మోహనశ్రీ నన్ను మాట్లాడమని అడిగారు. తొలిసారిగా నేను మైకు ముందు నిలబడి మాట్లాడాను. ఆ సభకు వచ్చిన సినీ గేయకవి భువన చంద్ర నన్ను చూసి ‘నీవు మాట్లాడుతుంటే కథ చెప్పినట్టు ఉంది. నీవు కథలెందుకు రాయకూడదమ్మా’ అని ప్రోత్సహించారు. ఆ ఒక్క మాటే నన్ను రచయిత్రిగా మార్చేసింది. అప్పటి నుండి కథలు, కవితలు, వ్యాసాలు, వంటల కాలమ్స్, పజిల్స్ రాస్తున్నాను
సుజాత కథలు
ఇప్పటి వరకు దాదాపు 100 కథలు రాశాను. ఆకాశవాణి చెన్నై కేంద్రం నుండి ప్రసారమైన 12 కథలు, శ్రీ వాసవిమిత్రలో ప్రచురితమైన 22 కథలు, హ్యాపీ టైమ్స్, చెన్నపురి కథలు, మదరాసు బతుకులు, చెన్నై తెలుగు అసోసియేషన్, శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ వంటి వాటిలో ప్రచురించబడిన 40 కథలతో ‘సుజాత కథలు’ అనే పుస్తకం 2020లో ప్రచురించాను. శ్రీ వాసవిమిత్ర మాసపత్రికలో 2016 ఫిబ్రవరి నుండి కథలు, వ్యాసాలు, వంటలు రాశాను. వారు నన్ను గౌరవిస్తూ 2016, 2018, 2019లో సత్కరించారు.
మనిషి కథలు
సిరికోన సాహితి అకాడమీలో 29 కథలు, శిరాకదంబం మాసపత్రికలో 5 కథలు, ప్రసన్న భారతి వాట్సప్ ప్రసార సంచికలో 2 కథలు, శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ రజతోత్సవ సంచికలో ఒక కథ, ఆకాశవాణి చెన్నై కేంద్రం నుండి ప్రసారమైన 2 కథలతో ‘మనిషి కథలు’ అనే నా రెండవ పుస్తకాన్ని 2024లో ప్రచురించాను. నా రెండు పుస్తకాలకు సినీ గేయ కవి భువన చంద్ర పీఠికలు రాశారు. అంతే కాకుండా ఇప్పటివరకు వివిధ పత్రికలలో పలు అంశాలపై వ్యాసాలు రాశాను. ఇలా నిరంతరం తెలుగు భాషలో సాహిత్య సేద్యం చేస్తున్నాను.
మాతృవందనం…
సిరికోన కథల పోటీలో పాల్గొన్నందుకు ‘శ్రీ జింకా చెన్నరాయ కిశోర్ స్మారక సిరికోన సాహితీ పురస్కారం 2022’ అందజేశారు. త్వరలో నా మూడవ పుస్తకం ప్రచురించాలనుకుంటున్నాను. ఈ ఏడాది అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా మాతృ వందనం పురస్కారాన్ని ప్రదానంచేసిన అక్షరయాన్ వారికి నా ధన్యవాదాలు. చెన్నైలో తెలుగు తరుణి వారు పదవ యానివర్సరీ సెలబ్రేషన్స్‌లో నన్ను ప్రత్యేక అతిథిగా పిలిచి సన్మానించారు. అశోక్ నగర్ ప్రోగ్రెసివ్ విమెన్స్ అసోసియేషన్ వారు నిర్వహించిన డిజిటల్ యోగా కంటెస్ట్‌లో ఫస్ట్ ప్రైజ్ అందుకున్నాను. నాకు 3-8-2025 నాడు వారి 30 వ యానివర్సరీ సెలబ్రేషన్స్‌లో నాకు బహుమతి అందించారు. నా జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఇంతకన్నా ఈ జీవితానికి కావలసిందేముంది.
– అచ్యుతుని రాజ్యశ్రీ
ఆ ఒక్క మాటే నన్ను మార్చేసింది
- Advertisement -
- Advertisement -