Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంసీనియర్‌ సిటిజన్‌ కార్డులపై యూటర్న్‌

సీనియర్‌ సిటిజన్‌ కార్డులపై యూటర్న్‌

- Advertisement -

అకస్మాత్తుగా నిలిపివేత
– కార్డులు జారీ చేయొద్దంటూ మహిళా శిశుసంక్షేమ శాఖ డైరెక్టర్‌ ఉత్తర్వులు
– ఎందుకు ప్రారంభించారంటూ వృద్ధుల ఆవేదన

నవతెలంగాణ- కరీంనగర్‌
సీనియర్‌ సిటిజన్‌ కార్డులకు బ్రేక్‌ పడింది. వయోవృద్ధుల సంక్షేమం కోసం అంటూ ఆర్భాటంగా ప్రారంభించిన కార్డుల జారీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం అకస్మాత్తుగా నిలిపివేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటనా లేకుండా తీసుకున్న ఈ నిర్ణయం వృద్ధులను తీవ్ర గందరగోళానికి, నిరాశకు గురిచేసింది. బస్‌, రైలు ప్రయాణ రాయితీలతోపాటు ఇతర ప్రభుత్వ పథకాలకు ఈ కార్డులు తప్పనిసరి అని ప్రకటించిన ప్రభుత్వమే.. ఇప్పుడు వాటి అవసరం లేదన్నట్టుగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


వృద్ధులకు ప్రత్యేక ప్రయోజనాలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సీనియర్‌ సిటిజన్‌ కార్డుల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకోసం తెలంగాణ స్టేట్‌ సర్వీస్‌ డెలివరీ గేట్‌వే(టీఎస్‌ఎస్‌డీజీ) పేరుతో ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌ను కూడా ప్రారంభించింది. ఆధార్‌, వయసు ధృవీకరణ పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది. ప్రభుత్వ ప్రచారంతో ఇటీవల కాలంలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. వేలాది దరఖాస్తులు జిల్లా సంక్షేమ కార్యాలయాల్లో పరిశీలన దశలో ఉన్నాయి. ఇంతలోనే ఈ ప్రక్రియను నిలిపి వేయడంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


మౌఖిక ఆదేశాల నుంచి అధికారిక మెమో వరకు..
జూమ్‌ మీటింగ్‌లో ఉన్నతాధికారులు చెప్పారంటూ.. కార్డుల జారీని తాత్కాలికంగా ఆపుతున్నామని నెల రోజుల కిందట దరఖాస్తుదారులకు అధికారులు మౌఖికంగా తెలిపారు. అయితే, ప్రభుత్వ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 14567ను సంప్రదిస్తే, తమకు అలాంటి సమాచారం ఏదీ లేదని చెప్పడంతో గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితిపై ‘నవతెలంగాణ’ ములుగు, పెద్దపల్లి జిల్లాల సంక్షేమ అధికారులను కలిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మహిళలు, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సాధికారత శాఖ డైరెక్టర్‌, మెమో నెం.యస్‌ 1/1315/2025 (తేది: 03/07/2025) ద్వారా తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు సీనియర్‌ సిటిజన్‌ కార్డుల జారీని రాష్ట్రవ్యాప్తంగా నిలిపివేయాలని ఆదేశించారు.


అవసరం లేకుంటే.. ఎందుకు ప్రారంభించారు..?
అసలు అవసరమే లేనప్పుడు, ప్రభుత్వం ఎంతో వ్యయప్రయాసలకోర్చి ఈ పథకాన్ని ఎందుకు ప్రారంభించినట్టు..? కార్డుల జారీని నిలిపివేసినప్పుడు, సంబంధిత వెబ్‌ పోర్టల్‌ను ఇప్పటికీ ఎందుకు కొనసాగిస్తున్నట్టు..? ఇప్పటికైనా స్పందించి, సీనియర్‌ సిటిజన్‌ కార్డుల జారీపై ప్రభుత్వం వైఖరిని స్పష్టం చేయాలి. కార్డుల జారీని కొనసాగిస్తారా..? రద్దు చేసి ప్రత్యామ్నాయ మార్గాలను స్పష్టంగా ప్రకటిస్తారో తేల్చాలి. – డాక్టర్‌ నీలం సంపత్‌, రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌


తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు
సీనియర్‌ పౌరులు ప్రభుత్వ పథకాలు పొందడానికి ప్రత్యేకంగా సీనియర్‌ సిటిజన్‌ కార్డు అవసరం లేదు. రాష్ట్ర సాధికారత శాఖ తాజా ఆదేశాల ప్రకారం, ఆధార్‌, తెల్ల రేషన్‌ కార్డు లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలు ఉంటే పథకాలు సులభంగా పొందొచ్చు. ప్రస్తుతం సీనియర్‌ సిటిజన్‌ కార్డుల జారీకి రాష్ట్ర స్థాయిలో మార్గదర్శకాలు లేవు. అందువల్ల తాత్కాలికంగా ఈ కార్డుల జారీ నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయంతో వృద్ధులకు ఎటువంటి అన్యాయమూ జరగదు.
-సరస్వతి, కరీంనగర్‌ జిల్లా సంక్షేమ అధికారి

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img