దీనితోనే సమాజ మార్పు
మానసిక వైద్య నిపుణులు, సైకాలజిస్ట్ కౌన్సెలర్ పద్మా కమలాకర్
”ప్రభుత్వ బడి పిల్లలు- ప్రతిభ గల పిడుగులకు” ప్రతిభా పురస్కారాలందజేత
నవతెలంగాణ-సిటీబ్యూరో/ముషీరాబాద్
పిల్లల్లో సృజనాత్మక శక్తిని వెలికితీయడమే మంచి విద్యనందించినట్టు అని మానసిక వైద్య నిపుణులు, సైకాలజిస్ట్ కౌన్సెలర్ పద్మా కమలాకర్ అన్నారు. వారిలో సృజనాత్మక శక్తిని పెంచినప్పుడే సైన్స్ అభివృద్ధి చెందుతుందని, దాంతో సమాజ మార్పులకు దోహదమవుతుందని చెప్పారు. తెలంగాణ బాలోత్సవం ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల 7, 8, 9 తరగతుల ప్రథమ శ్రేణి విద్యార్థులకు హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ”ప్రతిభా పురస్కారాలు” ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నపిల్లల మనోభావాలను సరిగ్గా తెలుసుకోగలిగి వారి నడవడికను మార్చగలిగేది తల్లిదండ్రులు.. ఆ తర్వాత ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయులేనని చెప్పారు. మారిన వాతావరణం, ఆహారపు అలవాట్లు పిల్లల మనోభావాలనూ కలుషితంగా మారుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బట్టీ చదువులు, వయసుకి ఆలోచనా శక్తికి మించిన పాఠ్యపుస్తకాలు, అశాస్త్రీయమైన విద్యావిజ్ఞానం, సామాజిక మాధ్యమాలు పిల్లల ఆలోచనా శక్తిని మళ్లిస్తున్నాయని చెప్పారు.
పిల్లలను ఆటల్లో, పాటల్లో ప్రోత్సహిస్తూనే పాఠశాల వైపు మళ్లించినప్పుడు మంచి భవిష్యత్‌ను ఎంచుకోగలుగుతారని చెప్పారు. నేడు అమ్మాయిలు అనేక సమస్యలు ఎదుర్కొం టూనే అబ్బాయిలతో సమానంగా ఎదుగుతున్నారని, అయితే మానసిక ఆందోళనకు గురి చేసే.. సామాజిక పోకడలు వారి ఎదుగుదలకు అడ్డుపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వారికి మనోధైర్యంతోపాటు సెల్ఫ్ డిఫెన్స్ విద్యను అందించాల్సిన అవసరం ఉందన్నారు. నేడు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అనేక మంది ప్రయివేటు పాఠశాలల విద్యార్థుల కంటే ముందున్నారన్నారు. అది మంచి పరిణామమని, ప్రభుత్వం నుంచి మరింత ప్రోత్సాహం అవసరం అని చెప్పారు.
విజ్ఞానదర్శిని అధ్యక్షులు టి.రమేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో నిర్వహిస్తున్న పోటీ పరీక్షల్లో అనేకమంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రాణించడం గొప్ప విషయమన్నారు. వారికి నిజంగా శాస్త్రీయ విద్యను అందించి అవసరమైన పరిశోధన సౌకర్యాలు కల్పిస్తే అన్ని రంగాల్లోనూ ముందుంటారన్నారు. దేశభక్తి ముసుగులో పాఠశాల సిలబస్‌ను మారుస్తున్నారని, ఇది దేశ భవిష్యత్‌కు చాలా నష్టదాయకమని తెలిపారు. ఇప్పటికైనా తిరోగమన ఆలోచనల నుంచి ప్రభుత్వాలు, పాలక పార్టీలు బయటపడాలని కోరారు. బాలోత్సవం కమిటీ ప్రధాన కార్యదర్శి ఎన్.సోమయ్య కార్యక్రమాల రిపోర్టు పెట్టారు. ఈ పురస్కారాలు అందుకుంటున్న విద్యార్థులు మరింత కష్టపడి చదువులో రాణించాలని సూచించారు. తెలంగాణ బాలోత్సవం అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు అధ్యక్షోపన్యాసం చేశారు. పిల్లల సరైన భవిష్యత్ కోసం పెద్దలు పాటుపడినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. 600 మందికిపైగా విద్యార్థులు, 100 మంది ఉపాధ్యాయులు, తెలంగాణ బాలోత్సవం ఆఫీస్ సెక్రెటరీ బ్రాహ్మణి, కమిటీ సభ్యులు సుజావతి, అంకమ్మ, మమత, పద్మావతి, నవీన్, మహేష్ దుర్గే పాల్గొన్నారు.
పిల్లల్లో సజనాత్మకత పెంపుతోనే సైన్స్ అభివృద్ధి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES