– ఎన్నికలు నిర్వహించలేదంటూ రూ.3వేల కోట్లు నిలుపుదల
– మంత్రి సీతక్క వినతిని పట్టించుకోని మోడీ సర్కార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు నిధుల విడుదలలో కేంద్రం కొర్రీ పెట్టింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించనందున క్షేత్రస్థాయిలో వివిధ అభివృద్ధి పనులకు వినియోగించాల్సిన దాదాపు రూ.3వేల కోట్ల నిధుల్ని నిలిపివేసింది. ఈ నిధుల కోసం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌కు వినతిపత్రం ఇచ్చి, నిధులు విడుదల చేయాలని కోరినా, నేటికీ ఫలితం శూన్యం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి, వాటిలో మౌలిక వసతుల కల్పన కోసం కేంద్రం రూ.1,570 కోట్లను కేటాయించింది. ఈ మేరకు బడ్జెట్‌లో పొందుపరిచారు. కానీ వాటిలో ఒక్క పైసా విడుదల చేయలేదు. 2025-26లో కొన్ని పంచాయతీలు స్థానిక మున్సిపాల్టీల్లో విలీనం అయ్యాయి. దానితో ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో రూ.1,500 కోట్లు కేటాయించారు. వాటిలోనూ ఒక్క పైసా ఇప్పటి వరకు విడుదల కాలేదు. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టి రెండు త్రైమాసికాలు ముగుస్తున్నా, ఇప్పటి వరకు నిధులు విడదల చేయకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆక్షేపిస్తుంది. అయితే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తేనే ఆ నిధులు విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేస్తున్నట్టు సమాచారం. పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర హైకోర్టు తీర్పు ప్రకారం సెప్టెంబర్ 30వ తేదీ లోపు నిర్వహించకుంటే, రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్‌గా రావల్సిన మరో రూ.1,200 కోట్లు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆ శాఖ ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిధుల నిలిపివేత వల్ల గ్రామపంచాయతీల్లో అనేక పనులు అర్థంతరంగా నిలిచిపోయాయి. కొన్ని చోట్ల సర్పంచులు అప్పులు తెచ్చి, ప్రజోపయోగ కార్యక్రమాల కోసం ఖర్చు చేశారు. ఆ సొమ్ముతో పాటు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన అనేక బిల్లులు పెండింగ్‌లో పడిపోయాయి. అయితే రాష్ట్రంలో బీఆర్‌ఎస్ సర్కార్ హయాంలో పల్లెల్లో నిర్మించిన వైకుంఠ ధామాలు, క్రీడా ప్రాంగణాలు, రైతు వేదికలు, బీటీ రోడ్లకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు ఇప్పటికీ కాలేదు. వీటి కోసం సర్పంచులు రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్ హయాంలోనే కొందరు సర్పంచ్‌లు పెండింగ్ బిల్లులు చెల్లించలేదని ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అప్పట్లో ఈ ఘటనలు తీవ్ర చర్చనీయాంశాలు అయ్యాయి. అసెంబ్లీలోనూ ప్రస్తావనకు వచ్చాయి. కానీ అప్పటికీ, ఇప్పటికీ రాష్ట్రంలో పార్టీల మధ్య అధికారమార్పిడి జరిగిందే తప్ప, కేంద్రం నుంచి నిధులు మాత్రం రాలేదు. నిధుల లేమితో గ్రామీణంలో మంచినీరు, పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ కష్టంగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులకు రాష్ట్రపతితో ఆమోద ముద్ర వేయిస్తే, వెంటనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేకమార్లు స్పష్టం చేసింది. కానీ మోడీ సర్కార్ ఆ బిల్లుల్ని తొక్కిపెట్టిన విషయం తెలిసిందే. అయినా గ్రామ పంచాయతీలకు ఆర్థిక నష్టం జరుగుతున్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 30 నాటికి స్థానిక ఎన్నికల నిర్వహణను పూర్తిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈనెల 16, 17 తేదీల్లో ఈ ఎన్నికల నిర్వహణపై స్పష్టత వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలను ఇప్పటికైనా నిర్వహించపోతే మొత్తంగా దాదాపు రూ.4,200 కోట్ల కేంద్ర నిధులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది.42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం తెలుపకుండా, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ ఆలస్యానికి కారణం అవుతున్నదని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న విషయం తెలిసిందే.
పంచాయతీ నిధులకు కేంద్రం కొర్రీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES