– ఇద్దరికీ మంత్రి పదవులిస్తే తప్పేంటి ?
– సమీకరణలు ఎందుకు కుదరడం లేదు
– ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పుడు.. నల్లగొండకు ఉంటే తప్పా.. :
మరోసారి ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
నవతెలంగాణ -మునుగోడు
”నన్ను పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా మేము ఇద్దరం అన్నదమ్ములం ఉన్నాం అని?.. ఇద్దరమూ దమ్మున్నోళ్లమే.. సమర్థులమే.. అలాంటప్పుడు ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి? 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పుడు.. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్లగొండ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండటంలో తప్పేంటి?” అంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని ఎలగలగూడెంలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని మంగళవారం ఎమ్మెల్సీ నెలికంటి సత్యంతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘నాకు అన్యాయం జరిగితే పర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని గత ప్రభుత్వానికి చెప్పినా.. ఇప్పుడూ చెప్తున్నా.. మీరు మంత్రి పదవి ఇస్తానని మాటిచ్చారు.. ఇచ్చినప్పుడు ఇవ్వండి కానీ అప్పటివరకు రూపాయి కూడా ఆపకుండా మునుగోడు అభివృద్ధికి సహకరించాలి” అని ప్రభుత్వానికి సూచించారు. ఇస్తామన్నమాట ఆలస్యమైంది.. సమీకరణాలు కుదరటం లేదు అంటున్నారు.. ఎందుకు కుదరటం లేదు సమీకరణలు.. ఎవరడ్డుకుంటున్నారు రాకుండా ? అని ప్రశ్నించారు. ‘ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య.. ఒడ్డు దాటాక బోడి మల్లయ్య’ అన్న చందంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉందని అన్నారు. ఆలస్యమైనా సరే తాను ఓపిక పడుతున్నానని, ఈ ప్రాంతానికి అన్యాయం చేయొద్దని కోరారు. నల్లగొండ జిల్లాలోనే మునుగోడు నియోజకవర్గం వెనుకబడి ఉందని చెప్పారు. ఏ పదవి ఇచ్చినా మునుగోడు ప్రజల కోసమే కానీ తన కోసం కాదన్నారు. అనంతరం ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. నూతన గ్రామ పంచాయతీ భవనం ద్వారా గ్రామస్తుల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు వీలవుతుందని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మెన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ దోటి నారాయణ, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మేకల ప్రమోద్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు భీమనపల్లి సైదులు, సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షులు మిరియాల వెంకన్న, మాజీ సర్పంచ్ సురిగి చలపతి, నాయకులు వేమిరెడ్డి జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.
అన్నదమ్ములమిద్దరం సమర్థులమే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES