వరద ముంపుతో నీటమునిగిన నగరం
6 పునరావాస కేంద్రాల ఏర్పాటు…ముంపు కాలనీల ప్రజల తరలింపు
అలుగు పారుతున్న వాగులు, వంకలు
పాలేరు వాగు పొర్లడంతో నీటమునిగిన పంటలు
సాగర్ 16 గేట్లు, హిమాయత్‌సాగర్ 4 గేట్లు ఎత్తి నీరు విడుదల
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి/ విలేకరులు
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాలు జలదిగ్బంధం అయ్యాయి. ముఖ్యంగా గ్రేటర్ వరంగల్ మరోమారు వరద ముంపునకు గురైంది. మంగళవారం వేకువజామున కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలమైంది. వరంగల్ నగరంలో పలు కాలనీలు నీటిమునిగి ఇండ్లల్లోకి కూడా నీరు చేరడంతో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎగువన రాష్ట్రాలతో పాటు తెలంగాణాలోనూ కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. నాగార్జునసాగర్‌లో 16 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. హిమాయత్ సాగర్‌లో 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ జారీ చేయడంతో సీఎం రేవంత్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో భారీ వర్షాలు, వరద అప్రమత్తతపై మంగళవారం సాయంత్రం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులను అప్రమత్తంగా ఉండి డీఆర్‌ఎఫ్ బృందాలతో సహాయక చర్యలు చేపట్టాలని, ముంపు ప్రాంతాలను గుర్తించి ప్రజలను ముందే పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
ఉమ్మడి వరంగల్ జల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరంగల్ జిల్లా సంగెం మండలంలో అత్యధికంగా 20 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్థన్నపేటలోని ఆకేరువాగు పొంగిపొర్లుతుంది. తహసీల్దార్ కార్యాలయం నీట మునిగింది. సంగెం మండలం ఎల్గూరు రంగంపేట పెద్ద చెరువు, పర్వతగిరి మండలం ఏనుగట్ల ఊరచెరువు మత్తడి పోస్తోంది. ఎల్గూరు స్టేషన్ పరిధిలోని తిమ్మాపురం-ఎల్గూరు రంగంపేట గ్రామాల మధ్య రైల్వే అండర్‌పాస్ పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. దాంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్‌లోని ఎస్‌ఆర్‌నగర్ ఎనుమాముల రహదారిపై వరద పోటెత్తుడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయి గణేష్‌కాలనీ, లెనిన్ నగర్, అగర్తల చెరువు ప్రాంతం, మైసయ్యనగర్, గిరిప్రసాద్ కాలనీ, వివేకానందకాలనీ, మధురానగర్, పద్మానగర్, డీకేనగర్, ఎన్టీఆర్ నగర్ కాలనీ, గోకుల్‌నగర్, శాంతినగర్ తదితర కాలనీలు వరద ముంపునకు గురయ్యాయి. వివేకానందకాలనీ, సాయిగణేశ్ కాలనీ, శివనగర్‌లో ఇండ్లలోకి వరద నీరు చేరడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ నేపథ్యంలో వరంగల్ నగరంలో ఎస్‌ఆర్‌నగర్‌లో శుభం గార్డెన్, గాంధీనగర్, మైసయ్యనగర్ కమ్యూనిటీ హాలులో, డికె నగర్‌లో బీరన్నకుంట హైస్కూల్‌లో, గిరిప్రసాద్‌నగర్‌లోని మార్వాడీ హాలు కలిపి 6 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. సుమారు 1,300మంది లోతట్టు ప్రాంత ప్రజలను ఈ పునరావాస కేంద్రాలకు తరలించి సౌకర్యాలు కల్పిస్తున్నారు. వరంగల్ రైల్వేస్టేషన్‌లోకి వరద నీరు చేరడంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. నెక్కండ మండలంలోని వెంకటాపురం శివారులో ఉన్న లోలెవల్ కాజ్‌వే వద్ద వరదనీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
భూపాలపల్లి జిల్లాలోనూ భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. గద్దకుంట వాగు పొంగిపొర్లడంతో రాంపూర్-గొల్లబుద్దా రం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గొల్లబుద్దారం జడ్పీహెచ్ పాఠశాల వరద ముంపునకు గురి కావడంతో ఉపాధ్యాయులు అప్రమత్తమై విద్యార్థులను వరదలో నుండి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. భూపాలపల్లి జిల్లా కొయ్యుర్‌లోని బొగ్గులవాగు, మల్లారంలోని అరేవాగులు పొంగి పొర్లుతున్నాయి. తాడిచర్ల ఓసీపీకి డేంజర్ జోన్‌లో ఉన్న ఇంటి గోడలు, ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అలాగే జిల్లాల అధికార యంత్రాంగం లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసింది. హనుమకొండ కలెక్టరేట్‌లో, మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. హనుమకొండలో ఏ సమస్య ఉన్నా 7981975495 నెంబర్‌ను సంప్రదించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, మహబూబాబాద్ జిల్లాలో సమస్యలుంటే 7995074803లో సంప్రదించాలని ఇన్‌చార్జి కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో తెలిపారు.
పొంగిపోర్లుతున్న వాగులు, చెరువులు
పాకాల సరస్సు 30.1 అడుగుల నీటిమట్టం సామర్థ్యం కాగా 27.3 అడుగుల నీటిమట్టానికి చేరుకొని మత్తడికి చేరువలో ఉంది. మరో ప్రధానమైన మాదన్నపేట పెద్ద చెరువు అలుగుల పరవళ్లు తొక్కింది. 27 అడుగుల నీటిమట్టానికి చేరుకొని రెండు అడుగుల ఎత్తులో మత్తడి పడింది. వట్టెవాగు పొంగి పొర్లుతూ పాకాల వాగులోకి భారీగా వరద ప్రవాహం పోటెత్తింది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజీలో మొత్తం నీటి సామర్థ్యం 83 మీటర్లు కాగా, ప్రస్తుతం 75.50 మీటర్లకు చేరింది. గోదావరి వరద బ్యారేజీలో ప్రస్తుతం ఇన్ ఫ్లోలు 1,05,280 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 1,00,760 క్యూసెక్కులుగా ఉంది. 12 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టులో పేజ్-1,2,3లోని ఏడు పంపుల ద్వారా 1767 క్యూసెక్కుల నీటిని రిజర్వాయర్లకు తరలిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
నారాయణపేట జిల్లాలో వరద నీటిలో ఆగిపోయిన స్కూల్ బస్సు
నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు కర్ని చెరువు నిండి అలుగుపారుతోంది. మక్తల్ నుంచి అనుగొండు వెళ్లే ప్రధాన రహదారిపై వదర నీరు ప్రవహిస్తోంది. దాంతో దాదాపు పది గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రవాహాన్ని దాటుతుండగా ఓ ప్రయివేట్ స్కూల్ బస్సు నీటిలో ఆగిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే బస్సును ముందుకు తోసి ఒడ్డుకు చేర్చారు. దాంతో విద్యార్థులకు ప్రమాదం తప్పింది.
‘పాలేరు’ అలుగుపోయడంతో నీట మునిగిన పంటలు
ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయం నీటిమట్టం 23 అడుగులు కాగా పూర్తిస్థాయిలో నిండి అలుగు పోస్తోంది. దాంతో జలాశయం లోతట్టు ప్రాంతాల్ల్లోని సుమారు 500 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. దాంతో రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. కూసుమంచి గ్రామంలోని చెరువు అలుగు పోయడంతో కూసుమంచి నుంచి కిష్టాపురం, తదితర గ్రామాలకు వెళ్లే రాకపోకలు పూర్తిగా బందయ్యాయి. నరసింహులగూడెం గ్రామంలోని రాతి బంధం వాగు పూర్తిస్థాయిలో ప్రవహించటంతో రోడ్డు పైకి నీళ్లు చేరి ఆయా గ్రామాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి.
జలాశయాల గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల
ఎగువ రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. దాంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయానికి వరద నీరు క్రమేణా పెరుగుతూ ఉండటంతో మంగళవారం సాయంత్రానికి 18 గేట్లను ఐదు అడుగుల మేరకు ఎత్తి దిగువనకు నీటిని విడుదల చేస్తున్నారు. మూడు రోజులుగా 4 క్రస్ట్ గేట్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. సాగర్‌కు శ్రీశైలం నుంచి 1,86,258 క్యూసెక్కుల నీరు వస్తుండగా అంతేమొత్తాన్ని బయటకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.50 అడుగులుగా ఉంది. మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తడంతో మంగళవారం 4 క్రస్ట్ గేట్లను 4 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 643.60 అడుగుల (4.09 టీఎంసీలు) వద్ద స్థిరంగా ఉంది.మూసీ ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు డ్యాం అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలోని జంట జలశయాలు కళకళలాడుతున్నాయి. హిమాయత్‌సాగర్ చెరువు నిండు కుండలాగా మారడంతో అధికారులు జలాశయం 6 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు. దాంతో ఔటర్ సర్వీస్ రోడ్డు మూసివేశారు. కిస్మత్‌పూర్ బిడ్జ్రిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సర్వీస్ రోడ్డుపైకి వాహనాలు రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
‘వరంగల్’ జలదిగ్బంధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES