– నోటిఫికేషన్లన్నీ ఫిమేల్ నర్సింగ్ ఆఫీసర్లకే అనుకూలం
– లింగవివక్ష కూడదని గతంలోనే కోర్టు తీర్పు
– ఎన్నేళ్లైనా మేం ఇక్కడేనా… మేల్ నర్సింగ్ స్టాఫ్ ఆవేదన
– జీవో నెంబర్లు 466, 101, 126 సవరించాలని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నర్సింగ్ వృత్తి… ఒకప్పుడు దానిలో మహిళలు మాత్రమే ఉండేవారు. ఆ తర్వాత ఆ వృత్తిలోకి పురుషులూ వచ్చేశారు. కానీ ప్రభుత్వ ఉత్తర్వుల్లో మాత్రం మార్పులు రాలేదు. నోటిఫికేషన్లన్నీ ఫిమేల్ నర్సింగ్ ఆఫీసర్లకు అనుకూలంగానే ఉంటున్నాయి. పదోన్నతుల్లోనూ అదే పరిస్థితి. ఏండ్ల తరబడి నర్సింగ్ సేవలు అందిస్తున్న మేల్ నర్సింగ్ ఆఫీసర్లు జీవితకాలం మొత్తం అదే హోదాలో ఉండిపోతున్నారు. ప్రభుత్వ నోటిఫికేషన్లలో లింగ వివక్ష కూడదని అనేక సందర్భాల్లో న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చాయి. కానీ వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్లు ‘ఓన్లీ ఫర్ ఫిమేల్ నర్సింగ్ ఆఫీసర్స్’ అనే షరతుతోనే వస్తున్నాయి. ఫలితంగా మేల్ నర్సింగ్ స్టాఫ్‌కు ప్రమోషన్లు రావట్లేదు. సమస్య సున్నితమైంది కావడంతో ప్రభుత్వం కూడా ఇప్పుడున్న సిస్టంను మార్చేందుకు సాహసించట్లేదు. కానీ దానివల్ల తమకు పదోన్నతుల్లో అన్యాయం జరుగుతుందనేది మేల్ నర్సింగ్ ఆఫీసర్ల ఆవేదన. 1980కి ముందు నర్సింగ్ విద్య, వృత్తిలో మహిళలు, పురుషులకు అవకాశం ఉండేది. ఆ తర్వాత ఆ వృత్తిని కేవలం మహిళకే పరిమితం చేశారు. దీంతో నర్సింగ్ విద్య పట్ల ఆసక్తి కలిగిన పురుషులు తమకు అవకాశం కల్పించాలని కోరుతూ వచ్చారు. రోగులకు సేవలందించే క్రమంలో పురుషులైన నర్సింగ్ ఆఫీసర్ల అవసరం కూడా ఉంటుందనీ, వారిని కూడా ఆ విభాగంలో భాగస్వాముల్ని చేయాలని వైద్యరంగ నిపుణులు సూచించారు. దీనితో 2005లో మొదటిసారిగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలతో పాటు కొంత శాతం మేరకు పురుషులు కూడా నర్సింగ్ విద్యను అభ్యసించేందుకు అవకాశం కల్పించింది.
దీనితో 1980 తర్వాత ఆగిపోయిన పురుష అభ్యర్థుల నియామకం తిరిగి 2011లో నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులు భర్తీ చేయడంతో మళ్లీ మొదలైంది. 2021, 2024 నోటిఫికేషన్ల ద్వారా క్రమంగా మేల్ నర్సింగ్ ఆఫీసర్ల సంఖ్య పెరిగింది. గతంలో కార్మికశాఖ పరిధిలోని ఈఎస్‌ఐలో నర్సింగ్ ఆఫీసర్ల నియాకమం కోసం కేవలం ”మహిళా అభ్యర్థులు మాత్రమే” దరఖాస్తు చేసుకోవాలంటూ షరతు విధించింది. దీనిపై నర్సింగ్ విద్యను అభ్యసించిన పురుష అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా, నియామకాల్లో ఎలాంటి లింగ వివక్ష చూపించరాదని తీర్పు వచ్చింది. అప్పటి నుంచి వైద్యారోగ్యశాఖ నియామకాల్లో మేల్, ఫిమేల్ వంటి వివక్ష లేకుండా నోటిఫికేషన్లు ఇస్తున్నారు. ఈ 15 ఏండ్లలో విడుదలైన 3 నోటిఫికేషన్ల ద్వారా వెయ్యి నుంచి 1,200 మంది వరకు ప్రభుత్వ నర్సింగ్ ఆఫీసర్లు అయ్యారు. అయితే పదోన్నతుల సమయంలో గతంలో జారీ చేసిన జీవోలు ఇప్పుడు వీరికి అడ్డంకిగా మారుతున్నాయి. 2024లో కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో 214 లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం సీనియార్టీ లిస్ట్‌ను కేవలం మహిళా అభ్యర్థులతోనే విడుదల చేశారు. దీనిపై మేల్ నర్సింగ్ ఆఫీసర్లు హైకోర్టును ఆశ్రయించారు. 1998 అక్టోబర్ 16న విడుదల చేసిన జీవో నెంబర్ 466, 1997 ఏప్రిల్ 4న విడుదలైన 101 నెంబరు జీవోలు పదోన్నతులకు ”మహిళా అభ్యర్థులు మాత్రమే” అర్హులని నిర్దేశించి ఉండటంతో ఇప్పుడు అవి మేల్ నర్సింగ్ ఆఫీసర్ల పదోన్నతులకు ప్రధాన ఆటంకంగా మారాయి.
సవరించిన ఆంధ్రప్రదేశ్
2014 సెప్టెంబర్ 4న ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (హైదరాబాద్)లో జరిగిన విచారణలో జీవో నంబర్ 126లోని రూల్ 4(ఎ)ను సవాలు చేశారు. దీంతో ట్రిబ్యునల్ స్టాఫ్ నర్స్ పోస్టులను మహిళలకు మాత్రమే పరిమితం చేయడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (చట్టం ముందు సమానత్వం), ఆర్టికల్ 16 (పబ్లిక్ ఉపాధిలో సమాన అవకాశాలు)లను ఉల్లంఘిస్తుందని తీర్పు వెలువరించింది. ప్రభుత్వానికి రూల్స్ సవరించే స్వేచ్ఛ ఉందని స్పష్టం చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 మార్చి 14న జీవో నెంబర్ 47 ద్వారా సవరణలు చేసింది. ఆ జీవోలను ”కేవలం మహిళలు” అనే పదాలను ”పురుషులు మరియు మహిళలు”గా మార్చింది. ఈ సవరణలను అదే ఏడాది ఏప్రిల్ 3న ఆంధ్రప్రదేశ్ గెజిట్‌లో ప్రచురించారు. తెలంగాణ రాష్ట్రంలోనూ పదోన్నతుల్లో పురుషులకు సమాన అవకాశాలు కల్పించేందుకు వీలుగా జీవో నెంబర్లు 466, 101, 126లను సవరించి తమకు న్యాయం చేయాలని మేల్ నర్సింగ్ ఆఫీసర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
‘మేల్ నర్సింగ్’కు పదోన్నతుల్లో అడ్డంకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES