సీఎం రేవంత్‌రెడ్డికి సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ ప్రతినిధి బృందం వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరింది. మంగళవారం హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య, రాష్ట్ర నాయకులు కె.జి. రాంచందర్, కె. రమ, కె. సూర్యం తదితరులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోడు సాగుదారులకు పొజిషన్ హక్కులిచ్చి, అర్హులైన వారికి పట్టా హక్కులను సంపూర్తిగా ఇవ్వాలని కోరారు. పోడు రైతుల పంటలను ధ్వంసం చేస్తూ, వారిపై దౌర్జన్యం చేస్తున్న ఫారెస్టు అధికారుల దౌర్జన్యాన్ని ఆపాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ కూలీలకు రూ. 12 వేల భృతి ఇస్తామన్న వాగ్దానాన్ని నెరవేర్చాలని కోరారు. పెన్షన్ రూ. నాలుగువేలకు పెంచాలని డిమాండ్ చేశారు. మహిళలకు రూ. 2500 పథకం అమలు చేయాలన్నారు. పెండింగ్ స్కాలర్‌షిప్పులను, ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరారు. క్యాజువల్ కార్మికులకు బేసిక్ రూ.18 వేల వేతనం ఇవ్వాలన్నారు. రైతు భరోసాను సీజన్ వారీగా క్రమం తప్పకుండా అమలు చేయాలని సూచించారు. నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టు భూనిర్వాసితులకు భూమికి భూమి ఇవ్వాలనీ, నిర్వాసితుల ప్యాకేజీని రూ. 28 లక్షలు ఇవ్వాలని పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టును ఇల్లందు, మహబూబాబాద్, డోర్నకల్ ప్రాంతానికి పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. వీటితో మొత్తం 27 డిమాండ్లను ముఖ్యమంత్రికి అందజేశారు. మంత్రులు ఆయా జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు తమ పార్టీనాయకులు, ప్రజా సంఘాలు, ఇతర వామపక్ష పార్టీలకు చెందిన నాయకలను ముందస్తు అరెస్టులు చేసే అప్రజాస్వామిక విధానాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. కేసీఆర్ పాలనలో కొనసాగిన ఈ విధానాన్ని ఈ ప్రభుత్వం కొనసాగించడం శోచనీయమైనదని వారు వివరించారు. అలా కొనసాగించడం పట్ల చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు తెలిపారు.
ప్రజా సమస్యలు పరిష్కరించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES