Wednesday, August 13, 2025
EPAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్కలిసిరాని 'కాలం' !

కలిసిరాని ‘కాలం’ !

- Advertisement -

– రెండుసార్లు వాయిదా పడిన బీసీ కదన భేరి కరీంనగర్‌ సభ
– బీసీ నినాదంపై బీఆర్‌ఎస్‌ ప్రయత్నాలకు అడ్డంకులు
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి

తెలంగాణలో బీసీ ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న పోరులో బీఆర్‌ఎస్‌కు ‘కాలం’ కలిసి రావడం లేదు. ఆ పార్టీ ఆధ్వర్యంలో బీసీ కదన భేరి పేరుతో కరీంనగర్‌లో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభ వరుసగా రెండుసార్లు వాయిదా పడింది. బీసీల సమస్యలను, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్ల హామీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావించిన బీఆర్‌ఎస్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. బీసీ నినాదంతో ప్రజల ముందుకు వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలకు కాలం కలిసిరావడం లేదని ఆ పార్టీ వర్గాల్లో నేతలే అంటుండటం గమనార్హం.
బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచనల మేరకు పార్టీలోని సీనియర్‌ నేతలు మధుసూదనాచారి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, గంగుల కమలాకర్‌ వంటి వారు బీసీ నినాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. ఇందులో భాగంగానే బీసీ కదన భేరి పేరుతో కరీంనగర్‌లో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. తొలుత ఆగస్టు 8న నిర్వహించాలని ప్రణాళికలు రూపొందించారు. అయితే, వరుస సెలవులు (శ్రావణ శుక్రవారం, రాఖీ పౌర్ణమి, ఆదివారం) రావడంతో జనాన్ని సమీకరించడం కష్టమని భావించి వాయిదా వేశారు. అనంతరం ఈ సభను ఆగస్టు 14కు మార్పు చేసి, ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారు. కానీ, రాష్ట్రంలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో మరోసారి వాయిదా వేస్తున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది.
బీసీ నినాదంలో కాంగ్రెస్‌..
కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై చురుగ్గా వ్యవహరిస్తున్నట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేలా ఆర్డినెన్స్‌ జారీ చేయాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. అయితే, ఈ ఆర్డినెన్స్‌ గవర్నర్‌ ఆమోదం కోసం పెండింగ్‌లో ఉంది. దీనిపై రాష్ట్రపతి ఆమోదం కోసం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద మహాధర్నా కూడా నిర్వహించారు. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో, ఈ అంశంపై బీఆర్‌ఎస్‌కు క్రెడిట్‌ దక్కడం కష్టంగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, కాంగ్రెస్‌కు బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదని, ఇది కేవలం ‘డ్రామా’ అని బీఆర్‌ఎస్‌, బీజేపీ ఆరోపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను మినహాయించాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. అయితే, బీజేపీ విధానాలు అసలు బీసీ రిజర్వేషన్లకే వ్యతిరేకమనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Advertisement
Advertisement
Ad