నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని విభాగాలకు సెలవులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు, ఆనకట్టలు, కాలువలతో పాటు చెరువులపై నిఘా పెంచాలని ఉత్తమ్ సూచించారు. ఎక్కడైనా విపత్తు సూచన కనిపిస్తే వెంటనే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో పాటు అన్ని విభాగాల అధికారులతో ఇరిగేషన్ అధికారులు సమన్వయం చేసుకుంటూ పని చేయాలని చెప్పారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఆయన నీటిపారుదల శాఖ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, స్పెషల్ సెక్రటరీ జీవన్ పాటిల్, జాయింట్ సెక్రటరీ కె.శ్రీనివాస్, ఈఎన్సీ అంజాద్ హుస్సేన్ లతో పాటు జిల్లాల సీఈలకు ఆదేశాలు జారీ చేశారు.