Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeఎడిట్ పేజి'ఓటు చోరీ'పై ఉద్యమం

‘ఓటు చోరీ’పై ఉద్యమం

- Advertisement -

బీహార్‌లో ఓట్లచోరీ తతంగంపై పార్లమెంటు ప్రతిపక్ష సభ్యులు చేపట్టిన ఉద్యమానికి ప్రజల మద్దతు పెరుగుతోంది. మొన్న మూడు వందల మంది ఎంపీలు పార్లమెంట్‌ నుంచి కేంద్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం వరకు శాంతియుత కార్యక్రమం చేపట్టడం దేశం దృష్టిని ఆకర్షించింది. యాత్రకు అనుమతిలేదంటూ వారిని పోలీసులు మధ్యలోనే అడ్డుకుని దౌర్జన్యానికి పాల్పడే క్రమంలో జరిగిన తోపులాటలో పలువురు ఎంపీలు సొమ్మసిల్లి పడిపోవడం విచారకరం. ప్రతిపక్షనాయకునితో సహా ఎంపీలను అరెస్టుచేసి పోలీసువ్యానుల్లో కుక్కడం మరీ దారుణం. ఇది సర్కార్‌ అణచివేతకు పరాకాష్ట. అంతేకాదు, ప్రశ్నించే గొంతులను ఏక పక్షంగా నొక్కేయడమే. ఎందుకింత అక్కసు? ప్రజాస్వామ్యంలో ఎన్నికలు పారదర్శకంగా జరగాలని కోరుకోవడం తప్పా? ఇంతటి నిర్భంధాన్ని ప్రయోగించడాన్ని చూస్తుంటే అవకతవకలకు నేతృత్వం వహించింది కేంద్రమేనా? ఈసి నోరెందుకు మెద పడం లేదు? ఇలాంటి ప్రశ్నలు సామాన్యపౌరులెవరికైనా రావడం సహజం.

వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో బీహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్‌)పై చర్చ జరగాలని ప్రతిపక్షాలు పద్దెనిమిది రోజులుగా డిమాండ్‌ చేస్తున్నాయి. కానీ, అందుకు కేంద్రం సిద్ధపడటం లేదు. పైగా వారి వాదనలను కనీసం పట్టించు కున్న దాఖలాలు లేవు. ఇదే అంశంపై సీఈసీతో మాట్లాడేందుకు ఎంపీల బృందం వెళ్లగా వారిని అనుమతించలేదు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిస్తున్న తరుణంలో, ఓటుపై అనేక సందేహాలు వెల్లువెత్తుతున్న సమయంలో ప్రజాప్రతినిధులకు సమాధానం చెప్పేందుకు ఈసికి ఎందుకింత భయం? ఎంపీలను కలవకపోవడంలో ఆంతర్యమేంటి? దీన్నిబట్టి చూస్తే కేంద్రం కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందా? ఓట్‌చోరీపై కచ్చితమైన వివరణ కావాలంటూ విపక్షాలు వినూత్న పద్ధతుల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టడంతో కేంద్రం ఆత్మరక్షణలో పడింది నిజం. ఓవైపు ఈ చర్చ నడుస్తుండగానే బీహార్‌ ఎన్నికల కమిషన్‌ విడుదల చేసిన ఓట్ల జాబితాలో ఆశ్చర్యకరమైన విషయం వెలుగుచూసింది. మింతా దేవి ఓటరు ఐడీలో వయసు 124 అని ముద్రించడం ఎన్నికల సంఘం డొల్లతనాన్ని, సర్కారు నిర్లక్ష్యాన్ని బట్ట బయలు చేసింది. కర్నాటకలో బహుళ వ్యక్తులు, బహుళ ఓట్ల వివరాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా దేశప్రజలకు ప్రత్యక్షంగా చూపించారు. మరి కేంద్రానికి, ఎన్నికల కమిషన్‌కు కనపడట్లేదా? ఈసి ఇచ్చిన డేటాతోనే కదా వివరించారు. మరెందుకు స్పందించడం లేదన్నది చర్చ.

భిన్నభిప్రాయాలు కలిగినదే ప్రజా స్వామ్యం. అలాంటి వ్యవస్థ ఉన్నచోట ప్రతి పక్షాలు చెప్పేదేంటో వినాలి, చర్చించాలి. అవ సరమైన సూచనలు పరిగణలోకి తీసుకోవాలి. కానీ ‘మేం చెప్పిందే వినాలన్న’ రీతిలో కేంద్రం వ్యవహరిం చడం సమంజసం కాదు. లక్షలాది మంది స్వేచ్ఛగా, నిష్పా క్షికంగా తమ నాయకులను ఎన్నుకునే శక్తివంతమైన ప్రక్రియ ఎన్నికలు. దానికే అవంతరాలు ఏర్పడుతుంటే ప్రశ్నించకూడదా? చర్చించకూడదా? వివరణ తీసుకోకూడదా? ఇవన్నీ అడిగితే అరెస్టు చేసి నిర్భందిస్తారా? ఎన్నికల కమిషన్‌లో పారదర్శకత లోపించిందని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? విపక్షాలు అడిగే ఓట్ల జాబితాను ఇవ్వకపోవడం వెనుక ఉన్న మతలాబేంటి? ఆటోమాటెడ్‌ విశ్లేషణ ద్వారా లోపాలు గుర్తించడానికి వీలు కల్పించే యంత్రాలతో చదవగలిగే ఓటర్ల జాబితాను అందించేందుకు ఈసి ఎందుకు నిరాకరిస్తోంది? ఇది ప్రజల్లో పలు అనుమానాలను రేకెత్తించడమే కాదు, ఓట్‌చోరీ అంశాన్ని బలపరుస్తున్నది కూడా. ఇది ముమ్మాటికీ ప్రజా స్వామ్యాన్ని వంచించే చర్య.

భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి ఒక్కరికీ ఒక ఓటును ఆయుధంగా ఇచ్చింది. కానీ, దీనికి భిన్నంగా కేంద్రంలోని బీజేపీ మాత్రం ఒక్కొక్కరికి పదుల సంఖ్యలో ఓట్లు కల్పించి ప్రజాస్వామ్యాన్నే అభాసుపాలు చేసింది. ఓడిపోతామనుకున్న ప్రతి నియోజక వర్గంలో ఓట్లచోరీతో అడ్డదారుల్లో అధికారాన్ని చేజిక్కించు కుందని బహిర్గతమైంది! ఇది ప్రపంచంలోనే ఎంతో ఖ్యాతిగాంచిన మనదేశ ఎన్నికల చరిత్రను కల్మష పరిచింది. మనం స్వతంత్రంగా వేసుకునే ఓటును ఎవరో దొంగిలించడం, దాన్ని ప్రశ్నిస్తే అణిచివేయడం ప్రజాస్వా మ్యానికి ముంచుకొస్తున్న అతిపెద్ద ప్రమాదానికి సంకేతం. ‘మన ఓటును దోచుకుంటున్నారు. మన హక్కును దోచు కుంటున్నారు. మన ఉనికినే ప్రశ్నార్థకం చేసున్నారు.’ అంటే మనం జాగ్రత్తగా లేమనడానికి నిదర్శనం. ఇలాంటి సమ యంలో పౌరునిగా మనపాత్ర మనం వహించాలి. విపక్షాలది రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఓటుహక్కును కాపాడటం కోసం చేస్తున్న ఉద్యమం. దాన్ని బలపరచడానికి చైతన్యవంతంగా ఆలోచించాలి. అందుకే ఓటుచోరీ..ఎక్కడో కదా, మనది కాదు అనుకుంటే, రేపు మనఓటు దూరమవటమే కాదు, ప్రజాస్వామ్యమే దూరమవుతుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad