చైతన్యవంతమైన స్ఫూర్తిని, ఉద్యమాల చరిత్రని అవగాహన చేయించడం కొందరి త్యాగధనుల జీవితాలకే సాధ్యమవుతుంది. ఒక మనిషి మహోన్నతుడిగా, యుద్ధవీరుడిగా ఉద్యమకారుడిగా శక్తిమంతుడు కావడానికి ఏ యే అంశాలు, ఎంతెంత కృషి అవసరమవుతాయో కూడా వివరించేది ఆయా వ్యక్తుల జీవిత చరిత్ర మాత్రమే. అవినీతి, బంధుప్రీతి, స్వార్థం, లాభం వుంటేనే పనిచేసే వ్యక్తులు, వ్యవస్థలు మన కళ్లముందు సాధారణమయిపోతున్న సందర్భంలో, సమాజం కోసం జీవితాన్నే అంకితం చేసిన త్యాగధనుల చరిత చదువుతుంటే ఒళ్లంతా పులకిస్తుంది. వారి జీవితం ఒక పాఠంగా మనకెన్నో విషయాలను బోధిస్తుంది. మనిషి పుట్టుకకు సార్థకత ఏమిటో తెలియపరుస్తుంది. అట్లాంటి ఒక ఉద్యమకారుని జీవిత పరిచయమే ‘ఉద్యమాల శిఖరం – ఉద్దరాజు రామం’ అనే పుస్తకం. ఉద్దరాజు రామం మెమోరియల్ ఫౌండేషన్, ప్రజాశక్తి బుకహేౌస్ వారు సంయుక్తంగా ఈ పుస్తకాన్ని వెలువరించారు.
ఈ పుస్తకం ద్వారా మనకు మూడు విషయాలు అవగాహనవుతాయి. ఒకటి రామంగారి జీవన గమనం, రెండు స్వాతంత్య్రోద్యమ పరిణామం పరిస్థితులు, మూడు కమ్యూనిస్టు ఉద్యమారంభం, పరిణామం, వారి నిబద్ధ రాజకీయ పోరాటం. అంతేకాదు, ఆనాటి సామాజిక పరిస్థితులు, మహిళల స్థితిగతులు తెలుస్తాయి. ఒక వ్యక్తి జీవితం, ఆనాటి సామాజిక, రాజకీయ చరిత్రను తెలుపుతోందంటేనే సమాజంతో వారెంత మమేకమయ్యారో అర్థమవుతుంది. ఉద్దరాజు రామంగారి గురించిన విషయాలు, నేటి ఉద్యమకారులకు, కార్యకర్తలకు బోలెడంత ప్రేరణ, చైతన్యాన్ని నింపుతుంది. అంతటి యోధులు, త్యాగధనులు నిర్మించిన ఉద్యమ పునాదుల మీదే మనం నిలబడి వున్నామనే స్పృహ మననెంతో ఉత్తేజపరుస్తుంది.
తొలితరం స్వాతంత్య్ర సమర యోధునిగా, సంఘ సంస్కరణ ఆచరణవాదిగా, పశ్చిమ గోదావరి జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతగా, ఆదర్శ ప్రజా ప్రతినిధిగా, ఉద్యమకారునిగా జీవితాంతం నిబద్ధంగా పనిచేసిన ధన్యజీవి ఉద్దరాజు రామం. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని వాలమర్రు గ్రామంలో 1911లో జన్మించిన వీరు, తన తండ్రి పద్మనాభరాజుపై వున్న జాతీయోధ్యమ ప్రభావం, సంఘ సంస్కరణ, ప్రగతిశీల ఉద్యమాల ప్రభావాలతో పెరిగారు. చిన్నతనంలోనే స్వాతంత్య్ర ఉద్యమాల్లో పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గ్రామం మోగల్లుతో వీరికి కుటుంబ సంబంధాలు, గాంధీగారి ప్రభావం ఉద్యమం వైపుకు మరల్చింది. ఆనాటి సంఘ సంస్కర్తలు కందుకూరి, గురజాడ సాహిత్య అధ్యయనం, అల్లూరి సత్యనారాయణరాజు లాంటి మిత్రుల సహచరత్వం స్వాతంత్య్ర సమరంలోకి నడిపించింది. ఆ తర్వాత కాంగ్రెస్‌లో వుంటూనే కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మిస్తున్న పుచ్చలపల్లి సుందరయ్య పరిచయం రామంను కమ్యూనిస్టుగా మార్చింది. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టయి రాయవెల్లూరు జైల్లో నిర్భంధించబడ్డారు. అక్కడే జాన్ రీడ్ ‘ప్రంచాన్ని కుదిపేసిన ఆ పది రోజులు’, గోర్కీ ‘అమ్మ’ నవలలను చదివి ఉత్తేజాన్ని పొందారు. ఆనాటి స్త్రీల ఘోషా పద్ధతిని అతిక్రమించి, భార్య మాణిక్యాంబను సైతం స్వాతంత్రోద్యమంలోకి తీసుకువచ్చారు. ఆమె కూడా పోరాటాల్లో పాల్గొంది.
1938లోనే పశ్చిమ గోదావరి జిల్లాలోని జమీందారులు, భూస్వాముల దురాగతాలకు వ్యతిరేకంగా వీరోచిత కాళీపట్నం రైతాంగ పోరాటాన్ని నిర్వహించారు రామం. ఈ ఉద్యమానికి దేశవ్యాప్త మద్దతును సంపాదించారు. 1936లో ఫైజాపూర్ కాంగ్రెస్ సభలో ఇం.ఎం.ఎఫ్, సుందరయ్య, నండూరిలతో పాటు రామం పాల్గొన్నారు. 1940 – 42 వరకు అజ్ఞాత వాసాన్ని, 1943 – 44 వరకు జైలు జీవితాన్ని, 1948 నుండి నాలుగేండ్లు అజ్ఞాతవాసాన్ని గడిపారు. 1962లో చైనా భారత్ సరిహద్దు సమస్య వచ్చినప్పుడు నిర్భంధానికి గురయ్యారు. 1975లో ఎమర్జెన్సీలో నిర్భంధానికి గురై చెంచల్‌గూడ జైలు జీవితం అనుభవించారు. 1957లో నర్సాపురం పార్లమెంట్ సభ్యునిగా గెలుపొందారు. పార్లమెంట్‌లో నీటి పారుదల, రైతుల సమస్యలపై ఆయన హిందీలో చేసిన ప్రసంగాలు ఎంతగానో ప్రశంసలు అందుకున్నాయి. భగత్‌సింగ్ సహచరుడు శివవర్మ రాసిన మార్క్సిస్టు సిద్ధాంత పరిచయాన్ని హిందీ నుండి తెలుగులోకి తీసుకొచ్చారు రామంగారు. 1936 లోనే సుభాష్ చంద్రబోస్ రచన భారత స్వాతంత్య్ర సమరం గ్రంథాన్ని రంగూన్ వెళ్లి ప్రింట్ చేయించి తెలుగు ప్రజలకు అందించారు. సర్ ఆర్థర్ కాటన్ ‘ఇరిగేషన్ వర్క్ ఇన్ ఇండియా’ రచనను పుస్తకంగా ప్రచురించి వెలుగులోకి తెచ్చారు.
ఉద్దరాజు రామం అంటేనే గుర్తుకువచ్చే ఉద్యమం రైతు ఉద్యమం. రాష్ట్రంలోని, దేశంలోని రైతుల సమస్యలపై, రైతాంగ విషయాలపై సమగ్ర అవగాహన వున్నవారు. అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షులుగా పరిచేశారు. కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యునిగా పనిచేసి ఎంతోమందిని కమ్యూనిస్టు ఉద్యమానికి అందించిన నాయకుడు రామం. కమ్యూనిస్టు పార్టీలో మితవాద ధోరణులకు వ్యతిరేకంగా సైద్ధాంతిక పోరాటం చేశారు. 1964లో తెనాలి కన్వెన్షన్‌లో పాల్గొన్నారు. రైతు సంఘ నాయకుడిగా, మార్క్సిస్టు పార్టీ ప్రతినిధిగా అనేక దేశాలు పర్యటించారు. జీవిత పర్యంతం ప్రజల కోసం పరితపించిన కమ్యూనిస్టు ఉద్యమ శిఖరం ఉద్దరాజు రామం. నిరాడంబరుడిగా, ప్రజా నాయకుడిగా నిరంతరం కష్టజీవుల విముక్తి కోసం శ్రమించిన మంచి కమ్యూనిస్టు రామం. వారి జీవిత విశేషాలను ఉద్యమ సహచరులు, స్ఫూర్తిపొందిన నాయకులు, నేటి తరం నేతలు ఆయన గురించిన జ్ఞాపకాలను ఇందులో పొందుపరిచారు. ఈ పుస్తకం అందరూ చదవదగ్గదిగా వుంది. ఇందుకు కృషి చేసిన వారికి, రామంగారి కుమారులు, మిత్రులందరికీ అభినందనలు.
- కె.ఆనందాచారి
99487 87660