– ప్రతి ఇల్లూ మాతృభాష పాఠశాల కావాలి
– మండలి వెంకట కృష్ణారావు తెలుగు భాషా సంస్కృతికి ప్రతీక : రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
నవతెలంగాణ-కల్చరల్
మాతృ భాష కేవలం పరస్పరం సంభాషణకు మాత్రమే కాదని, జాతి సాంస్కృతిక చిరునామా అని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ప్రతి ఇల్లూ మాతృ భాష పాఠశాల కావాలని చెప్పారు. హైదరా బాద్ తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్‌టీఆర్ కళా మందిరంలో మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీ య తెలుగు కేంద్రం నిర్వహణలో బుధవారం సంస్కృతి పురస్కారాలు ప్రదానోత్సవం జరిగింది. 2024 సంవత్సరానికి అజో విభో కందాల ఫౌండేషన్(అమెరికా) అప్పాజోష్యులు సత్య నారాయణకు, 2025కుగాను తెలుగు భాషా అభివృద్ధి మండలి (సోలాపూర్) అధ్యక్షులు కమటమ్ మల్లికార్జున్‌కు గవర్నర్ పురస్కారాలు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండలి వెంకట కృష్ణారావు తెలుగు భాష సంస్కృతికి ప్రతీక అని కొనియాడారు. నిర్మలమైన ప్రజా సేవకుడని, భాషా ప్రేమికుడని అన్నారు. దివి సీమ తుఫాన్ సందర్భంగా ఆయన చేసిన కృషి చిరస్మరణీయం అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని కలిపేందుకు ప్రపంచ తెలుగు మహాసభలు తొలిసారిగా జరిపి తెలుగు ఖ్యాతి ఇనుమడింపజేశారని గుర్తు చేశారు. పురస్కారం అందుకున్న సత్యనారాయణ, మల్లికార్జున్ తెలుగు ప్రాంతానికి దూరంగా స్థిర పడినా.. కృష్ణారావు ఆశయాలకు అనుగుణంగా తెలుగు భాషా సంస్కృతి వ్యాప్తికి కృషి చేస్తున్నారని అభినందించారు. అధ్యక్షత వహించిన తెలుగు విశ్వవిద్యాలయం ఉపాద్యక్షులు ఆచార్య నిత్యానందరావు మాట్లాడు తూ .. కృష్ణారావు భాష సంస్కృతి కోసం చేసిన కృషిని వివరించారు. ఆయన కుమారుడు మండలి బుద్ధప్రసాద్ వివేకశీలి అని, తెలుగు భాషపై అపార ప్రేమ కలిగిన వారని చెప్పారు. తండ్రి పేరిట తెలుగు విశ్వవిద్యాలయంలో మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఏర్పాటు చేసి.. రాష్ట్రేతర ప్రాంతాల్లో, విదేశాల్లో తెలుగు భాష సంస్కృతి వ్యాప్తికి కృషి చేస్తున్న వారిని 2007 నుంచి నగదు పురస్కారంతో సత్కరిస్తున్నారని తెలిపారు. మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. సత్యనారాయణ అమెరికాలో తెలుగు భాషా సంస్కృతికి కృషి చేస్తున్న వారిని సత్కరించటంతో పాటు పలు పరిశోధనా గ్రంథాలు, సాహిత్య సంపుటాలు ప్రచురించారని వివరించారు. మల్లికార్జున్ షోలాపూర్‌లో తెలుగు భాషా సంస్కృతి వ్యాప్తికి సంస్థను ఆరంభించి తెలంగాణ నుంచి వలస వెళ్లిన చేనేత కార్మికులను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ కెెవి.రమణ మాట్లాడుతూ.. మహాత్ములు పదవులు కోసం కాకుండా ప్రజా శ్రేయస్సుకు పని చేస్తారని, కృష్ణారావు జీవితం తరతరాలకు ఆదర్శం అని చెప్పారు. కేంద్రం డైరెక్టర్ డాక్టర్ పద్మప్రియ నివేదిక సమర్పించగా, రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు వందన సమర్పణ చేశారు.
మాతృభాష జాతి సాంస్కృతిక చిరునామా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES